కర్ణాటక హిజాబ్ వివాదానికి సంబంధించి ముస్లిం మహిళలకు మద్దతుగా బెంగళూరులో బహుజన్ సమాజ్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కర్ణాటక హిజాబ్ వివాదానికి సంబంధించి ముస్లిం మహిళలకు మద్దతుగా బెంగళూరులో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) భారీ ర్యాలీ నిర్వహించిన దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టడానికి నిరాకరించిన రాయచూరు జిల్లా జడ్జి మల్లికార్జున గౌడని వెంటనే పదవి నుండి తొలగించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక దళిత సంఘాల నాయకులు బెంగళూరులో ఇటీవల ఒక భారీ ర్యాలీ నిర్వహించాయి. పోస్టులో షేర్ చేసిన వీడియో ఈ ర్యాలీ దృశ్యాలని చూపిస్తుంది. ఈ ర్యాలీతో హిజాబ్ వివాదానికి గాని, BSPకి గాని ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని పలు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఇటీవల పబ్లిష్ చేసినట్టు తెలిసింది. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. అంబేద్కర్ చిత్రపటం వివాదానికి సంబంధించి కర్ణాటక దళిత సంఘలు బెంగళూరులో భారీ ర్యాలీ నిర్వహించిన దృశ్యాలంటూ ఈ వీడియోలలో తెలిపారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టడానికి నిరాకరించిన రాయచూరు జిల్లా జడ్జి మల్లికార్జున గౌడని వెంటనే పదవి నుండి తొలగించి, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక దళిత సంఘ నాయకులు బెంగళూరులో ‘సంవిధాన సురక్షణ మహా ఒక్కుట’ పేరుతో ఒక భారీ ర్యాలీ నిర్వహించాయి. బెంగళూరు మౌర్య సర్కిల్ దగ్గర మొదలుపెట్టి ఫ్రీడం పార్క్ వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఉద్యమకారులు నీలి రంగులో ఉన్న కర్ణాటక దళిత సంగర్ష జెండాలు అలాగే, అంబేద్కర్ చిత్రపటాలు పట్టుకొని నిరసన తెలిపినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఈ ర్యాలీలో BSP కార్యకర్తలు పాల్గొన్నట్టు ఏ పత్రికా రిపోర్ట్ చేయలేదు.
రాయచూరు జిల్లా కోర్టులో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలో స్టేజిపై మహాత్మాగాంధీ చిత్రపటం పక్కన పెట్టిన అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించాలని జిల్లా ప్రిన్సిపల్ మరియు సెషన్స్ జడ్జి మల్లికార్జున గౌడ ఆదేశించినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో, కర్ణాటక హైకోర్టు, మల్లికార్జున గౌడని కర్ణాటక స్టేట్ ట్రాన్స్‌పొర్ట్ ట్రిబ్యునల్ కోర్టుకి బదిలీ చేసింది. అయితే, మల్లికార్జున గౌడని బదిలీ కాకుండా పదవి నుండి శాశ్వతంగా తొలగించాలని అలాగే, అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రతి కోర్టులో పెట్టాలని దళిత సంఘాలు కర్ణాటకలో నిరసనలు చేపట్టాయి. దళిత సంఘాల డిమాండ్లను అంగీకరిస్తూ కర్ణాటక హైకోర్టు, రాష్ట్రంలో ఇకనుండి జరిగే అన్ని న్యాయవ్యవస్థ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలని 04 ఫిబ్రవరి 2022 నాడు సర్కులర్ ఇచ్చింది.
చివరగా, అంబేద్కర్ చిత్రపటం వివాదంలో భాగంగా కర్ణాటక దళిత సంఘాలు నిర్వహించిన ఒక ర్యాలీ వీడియోని BSP హిజాబ్‌కు మద్దతుగా ర్యాలీ చేసిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.