‘సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం’ అనే శీర్షికతో ఉన్న Way2News క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. వైయస్ఆర్ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణలోని పలు చోట్ల కాంగ్రెస్ నేతలు, వైయస్ఆర్ అభిమానులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారనేది ఈ వార్త సారాంశం. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్త క్లిప్‌కు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: వైయస్ఆర్ మరణంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం – Way2News
ఫాక్ట్(నిజం): గతంలో వైయస్ఆర్ మరణంపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం నిజమే అయినప్పటికీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరవాత వైయస్ఆర్ మరణంపై వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. కాగా ప్రస్తుతం షేర్ అవుతున్న Way2News న్యూస్ క్లిప్ నిజమైంది కాదు. దీన్ని డిజిటల్‌గా ఎడిట్ చేసి రూపొందించారు. Way2News కూడా ఈ క్లిప్ తాము ప్రచురించలేదని వివరణ ఇచ్చింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
రేవంత్ రెడ్డి గతంలో వైయస్ఆర్ మరణంపై వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఏమి చేయలేదు. కాగా ప్రస్తుతం షేర్ అవుతున్న way2news న్యూస్ క్లిప్ నిజమైంది కాదు. దీన్ని డిజిటల్‌గా ఎడిట్ చేసి రూపొందించారు.
సాధారణంగా Way2News తమ న్యూస్ క్లిప్‌లలో ఆ వార్తకు సంబంధించిన ఒక వెబ్ లింక్‌ను కూడా అందిస్తుంది. ఐతే ప్రస్తుతం షేర్ అవుతున్న న్యూస్ క్లిప్‌లో అందించిన లింక్ అడ్రస్‌తో వెతికితే Way2News ఆగస్ట్ 2023లో క్రికెటర్ పృథ్వీషాకు సంబంధించిన వార్త కనిపిస్తుంది.
కాగా దిష్టిబొమ్మ దహనం చేస్తున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫోటో 2023 జనవరిలో కాంగ్రెస్ నాయకులు అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన ఘటనకు సంబంధించిందని తెలిసింది. దీన్నిబట్టి ప్రస్తుతం షేర్ అవుతున్న క్లిప్‌ను డిజిటల్‌గా ఎడిట్ చేసి రూపొందించినట్టు స్పష్టమవుతుంది.
ఇదిలా ఉండగా పైగా Way2News కూడా ఈ క్లిప్ ఫేక్ అని వివరణ ఇచ్చింది. ఈ వార్తను తాము ప్రచురించలేదని, తమ లోగోను ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని Way2News తెలిపింది.