గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలలో అంబానీ మరియు అదానీలు పొందిన వివిధ కంపెనీలు లైసెన్స్/కాంట్రాక్టు వివరాలంటూ వీరి కంపెనీలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ లైసెన్స్/కాంట్రాక్టు పొందాయన్న సమాచారాన్ని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వివరాలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంబానీ మరియు అదానీలు పొందిన వివిధ కంపెనీల లైసెన్స్/కాంట్రాక్టు వివరాలు.
ఫాక్ట్ (నిజం): ఈ పోస్టులో పేర్కొన్న అంబానీ మరియు అదానీ యొక్క కంపెనీల లైసెన్స్/కాంట్రాక్టులు కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పొందగా కొన్ని బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పొందాయి. కాబట్టి అన్ని లైసెన్స్/కాంట్రాక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పొందాయన్న వాదన కరెక్ట్ కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో ప్రస్తావించిన అంబానీ మరియు అదానిల కంపెనీలకు సంబంధించి కొన్ని కంపెనీలు/కాంట్రాక్టులు నిజంగానే గతంలో కాంగ్రెస్ హయాంలో మంజూరు కాగా పలు కంపెనీలు గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంజూరు అయ్యాయి. పోస్టులో ప్రస్తావించిన ఒక్కో కంపెనీ గురించి కింద వివరంగా చూద్దాం.
పామాయిల్ వ్యాపారం కోసం అదానీకి లైసెన్స్ : రాజీవ్ గాంధీ – కాంగ్రెస్, సంవత్సరం – 1989
అదానీ యొక్క ‘అదానీ విల్మార్ లిమిటెడ్’ సంస్థ వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం నిర్వహిస్తుంది. ఈ సంస్థ పామాయిల్, గోధుమ పిండి, బియ్యం, పప్పులు, చక్కెర మొదలైన వాటిని ఉత్పత్తి చేస్తుంది. మినిస్ట్రీ అఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ సంస్థ జనవరి 1999లో స్థాపించారు, సంస్థ అహ్మదాబాద్‌లో రిజిస్టర్ అయ్యి ఉంది.
ఐతే 1999లో గుజరాత్ మరియు కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. దీన్నిబట్టి పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు అదానీ పామాయిల్ వ్యాపారం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించలేదని స్పష్టమవుతుంది.
అంబానీకి రిలయన్స్ రిటైల్ లైసెన్స్ : మన్మోహన్ సింగ్ – కాంగ్రెస్, సంవత్సరం – 2005
ఫాషన్, ఫైనాన్స్, ఇన్సురన్స్ మొదలైన రంగాలలో రిలయన్స్ రిటైల్ పేరుతో పలు కంపెనీలు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఈ కంపెనీలు ముంబైలో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి.
ఐతే ఈ కంపెనీలలో మొదటగా రిజిస్టర్ అయ్యింది మాత్రం ‘రిలయన్స్ రిటైల్ లిమిటెడ్’, ఇవి 1998 మరియు 1999లో స్థాపించబడ్డాయి.
ఐతే ఈ కంపెనీలు స్థాపించే సమయానికి మహారాష్ట్ర మరియు కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. దీన్నిబట్టి రిలయన్స్ బీజేపీ హయాంలోనే రిటైల్ రంగంలోకి అడుగు పెట్టిందని అర్ధం చేసుకోవచ్చు. ఐతే రిలయన్స్‌కి చెందిన పలు ఇతర రిటైల్ కంపెనీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు స్థాపించబడ్డాయి.
అంబానీకి 4జి లైసెన్స్ : మన్మోహన్ సింగ్ – కాంగ్రెస్, సంవత్సరం- 2013
వార్తా కథనాల ప్రకారం ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సంస్థకి 2013లో 4G సేవలకు ఏకీకృత లైసెన్స్ పొందింది. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.
అదానీకి కేరళ విజింజం ఓడరేవు : మన్మోహన్ సింగ్, 2013-2014 రాష్ట్ర కమ్యూనిస్ట్ ప్రభుత్వం
జూలై 2015లో అదానీ పోర్ట్స్ కంపెనీ బిడ్డింగ్ ద్వారా కేరళలోని విజింజం ఓడరేవు డెవలప్మెంట్/నిర్వహణ కాంట్రాక్టుని పొందింది. ఆ సమయంలో కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.
ఇకపోతే పోస్టులో చెప్తున్న అతిపెద్ద ఓడరేవు మరియు హైవే కాంట్రాక్టుకి సంబంధించి క్లెయిమ్ స్పష్టంగా లేనందువలన వాటి గురించిన సమాచారం మేము సేకరించలేదు. ఐతే ఈ ఆర్టికల్ మొదట్లో ప్రస్తావించినట్టు పోస్టులో పేర్కొన్న లైసెన్స్/కాంట్రాక్టులు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు మాత్రమే కాకుండా, పలు లైసెన్స్/కాంట్రాక్టులు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పొందాయి.
చివరగా, అంబానీ మరియు అదానీలు ఈ లిస్టులో పేర్కొన్న లైసెన్స్/కాంట్రాక్టులలో కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పొందగా, కొన్ని బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పొందాయి.