Fake News, Telugu
 

అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం ఆ రోజును సెలవు దినంగా ప్రకటించిందన్న వార్త నిజం కాదు

0

22 జనవరి 2024 నాడు అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట జరుగనున్న విషయం తెలిసిందే, ఐతే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బ్రిటన్ ప్రభుత్వం 22 జనవరి 2024ను సెలవు దినంగా ప్రకటించిందని చెప్తున్న వార్త ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని బ్రిటన్ ప్రభుత్వం 22 జనవరి 2024ను సెలవు దినంగా ప్రకటించింది.

ఫాక్ట్(నిజం): రామాలయ ప్రాణప్రతిష్ట రోజును బ్రిటన్‌ సెలవు దినంగా ప్రకటించలేదు. బ్రిటన్ ప్రభుత్వం సెలవు ప్రకటించినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట స్వాగతిస్తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సంస్థలు వెల్లడించాయి. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పూజలు/వేడుకలు జరుపుకోనున్నట్టు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే బ్రిటన్‌లోని హిందూ సంస్థలు కూడా రామాలయ ప్రాణప్రతిష్టను స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నాయి. బ్రిటన్ పార్లమెంట్‌లో జై శ్రీరామ్ నినాదాలు చేసారని కూడా వార్తలు రిపోర్ట్ అయ్యాయి.

ఐతే ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలో చెప్తున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం 22 జనవరి 2024ను సెలవు దినంగా ప్రకటించలేదు. ఒకవేళ ఇలా జరిగి ఉంటే మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కానీ మాకు అలాంటి కథనాలేవి కనిపించలేదు. బ్రిటన్‌లో అమలులో ఉన్న బ్యాంక్ హాలిడేస్ లిస్టు ఇక్కడ చూడొచ్చు. ఈ లిస్టులో 22 జనవరి రోజున సెలవు/ప్రాముఖ్యత గానీ లేవు. దీన్నిబట్టి పోస్టులో చెప్తున్నట్టు రామాలయ ప్రాణప్రతిష్ట రోజును బ్రిటన్‌ సెలవు దినంగా ప్రకటించలేదని అర్ధంచేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా దేశంలోని పలు రాష్ట్రాలు రామాలయ ప్రాణప్రతిష్ట రోజును సెలవు దినంగా ప్రకటించగా, కొన్ని రాష్ట్రాలు హాఫ్ డే ప్రకటించాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకల నిమిత్తం ఆ రోజు అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే ప్రకటించింది.

చివరగా, అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం 22 జనవరి 2024ను సెలవు దినంగా ప్రకటించిందన్న వార్త నిజం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll