భారీ సంఖ్యలో ముస్లింలు కవాతు చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ముస్లింల జనాభా పెరిగిపోతుందని చెప్పే ఉద్దేశంలో ఈ ఫోటోను ‘ఇది ముస్లిం దేశం కాదు, లండన్ పరిస్తితి’ అనే కాప్షన్‌తో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: లండన్‌లో భారీ సంఖ్యలో ముస్లింలు కవాతు చేస్తున్న ఫోటో.
ఫాక్ట్(నిజం): జూన్ 2017లో లండన్‌లో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన వారి స్మారకార్ధం అక్కడి దావూదీ బోహ్రా ముస్లిం కమ్యూనిటీ సభ్యులు ఒక స్మారక సభ నిర్వహించారు. ఈ ఫోటో ఆ సందర్భానికి సంబంధించిందే. ఐతే ఈ ఫోటోను తప్పుగా అర్ధం చేసుకొని, ముస్లింల జనాభా పెరిగిపోతుందనే ఉద్దేశంలో షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో చెప్తున్నట్టు భారీ సంఖ్యలో ముస్లింలు కవాతు చేస్తున్న ఫోటో లండన్‌కు సంబంధించిందే అయినప్పటికి ఈ ఫోటోను సందర్భరహితంగా షేర్ చేస్తున్నారు.
ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫోటోను జూన్ 2017లో రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం ఈ ఫోటో లండన్‌లోని దావూదీ బోహ్రా ముస్లిం కమ్యూనిటీ సభ్యులు లండన్ బ్రిడ్జి & బోరో మార్కెట్‌లో జరిగిన ఉగ్రదాడి బాధితుల స్మారకార్థం లండన్‌లోని పాటర్స్ ఫీల్డ్స్ పార్క్‌లో జరిగిన స్మారక సభలో పాల్గొన్నప్పుడు తీసింది.

అంతకు ముందు 03 జూన్ 2017లో లండన్ బ్రిడ్జి & బోరో మార్కెట్ ప్రాంతాలలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు చనిపోయినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి.
ఈ దాడిలో చనిపోయిన వారి స్మారకార్ధమే ముస్లింలు ఒక స్మారక సభ నిర్వహించారు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్న మరొక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. పైగా ఈ దాడులు చేసిన నిందితుల అంత్యక్రియల ఇస్లామిక్ పద్దతిలో నిర్వహించబోమని ఇమామ్‌లు తీర్మానించారు.

చివరగా, లండన్‌లో ఉగ్రదాడిలో మరణించిన వారి స్మారకార్ధం దావూదీ బోహ్రా ముస్లింలు నిర్వహించిన సభకు సంబంధించిన ఫోటోను సందర్భరహితంగా షేర్ చేస్తున్నారు.