పార్వతీ దేవికి ప్రతిరూపమైన, మరణం లేని ఒక నాలుగు కాళ్ళ అరుదైన పక్షి అని చెప్తున్న ఒక జీవి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పక్షి పేరు హైకూ అని, ఇది నేపాల్ దేశంలోని మంచు కొండల్లో ఉంటుందని చెప్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: వీడియోలో ఉన్న ఈ పక్షి పేరు హైకూ, ఇది పార్వతి దేవికి ప్రతిరూపం.
ఫాక్ట్(నిజం): ఇది నిజమైన పక్షి కాదు, ఇది ఒక బొమ్మ. Calyn McLeod అనే ఆర్టిస్ట్ దీన్ని తయారు చేసారు. దీని పేరు ‘Cloud Antelope’, హైకూ కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వీడియోలో ఉన్న పక్షి గురించి మరింత సమాచారం పొందడానికి, అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసాము. 2014లో Fruit-Bat-Phoenix అనే ఫేస్‌బుక్ పేజీలో అప్లోడ్ చేసిన ఒక పోస్టులో ఈ పక్షి యొక్క ఫోటో దొరికింది.
Fruit-Bat-Phoenix ఫేస్‌బుక్ పేజీలో వైరల్ వీడియోలో చెప్తున్న హైకూ వంటి అనేక జంతువుల ఫోటోలు ఉన్నాయి. కానీ, ఇవన్నీ ఆర్ట్ వర్క్స్, చిన్న చిన్న శిల్పాలు, వీటిని Calyn McLeod అనే ఆర్టిస్ట్ తయారు చేసారు. వీటిని తాను fruitbatphoenix.com అనే వెబ్సైటులో అమ్ముతారు.
తన వెబ్సైటులో హైకూ అని చెప్పబడుతున్న ఫోటో కోసం వెతకగా, ఇది తాను తయారు చేసిన ‘Cloud Antelope’ అనే బొమ్మ అని తెలిసింది. ఆమె,ఈ బొమ్మ గురించి తన వెబ్సైటులో రాస్తూ ఈ బొమ్మను కొన్ని యూట్యూబ్ వీడియోల్లో, వైరల్ ఫేస్‌బుక్ పోస్టులలో తప్పుగా వాడారని, ఇది తన సృష్టి అని చెప్పారు.
చివరిగా, హైకూ అని చెప్పబడుతున్న ఈ నాలుగు కాళ్ళ పక్షి నిజమైంది కాదు, ఇది ఒక ఆర్టిస్ట్ తయారుచేసిన ‘Cloud Antelope’ బొమ్మ.