Fake News, Telugu
 

01 ఏప్రిల్ నుండి రోడ్డు భద్రతకి సంబంధించి కఠిన నిర్ణయాలు అమలు చేయాలని సుప్రీం కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వలేదు

0

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను 01 ఏప్రిల్ 2021 నుండి రోడ్డు భద్రత కి సంబంధించి కఠిన నిర్ణయాలు అమలు చేయాలనీ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, ఇక నుండి ఆటోల్లో పరిమితిని మించి ఎక్కువ మంది ప్రయాణించే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి  ప్రమాద భీమా గాని లేక ప్రభుత్వ పథకాలు గాని వర్తించవని చెప్తూ ఇంకా ఇలాంటి చాలా కఠిన నిర్ణయాలు గురించి ప్రస్తావించే పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను 01 ఏప్రిల్ 2021 నుండి రోడ్డు భద్రతకి సంబంధించి కఠిన నిర్ణయాలు అమలు చేయాలనీ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

ఫాక్ట్(నిజం): 01 ఏప్రిల్  నుండి రోడ్డు భద్రత కి సంబంధించి కఠిన నిర్ణయాలు అమలు చేయాలనీ సుప్రీం కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వలేదు. ఈ విషయానికి సంబంధించి ఎటువంటి వార్తా కథనాలు కూడా లేవు. పైగా పోస్టులో చెప్తున్న వార్తా పత్రిక గురించి కూడా మాకు ఎటువంటి సమాచారం దొరకలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

రోడ్డు భద్రతకి సంబంధించి  01 ఏప్రిల్ 2021 నుండి పోస్టులో చెప్పినటువంటి కఠిన నిర్ణయాలు అమలు చేయాలనీ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్టు సుప్రీం కోర్టు వెబ్సైటులో గాని లేక వార్త కథనాల్లో గాని మాకు ఎటువంటి సమాచారం దొరకలేదు.  పైగా పోస్టులో చెప్తున్న వార్తా పత్రిక గురించి కూడా మాకు ఎటువంటి సమాచారం లభించలేదు.

సాధారణంగా రోడ్డు ప్రమాదాల భీమా మొదలైన విషయాలు మోటార్ వెహికల్స్ ఆక్ట్,1988 పరిధిలోకి వస్తాయి. ఈ చట్టానికి కొన్ని సవరణలు చేస్తూ 2019లో మోటార్ వెహికల్స్ (అమెండ్మెంట్) ఆక్ట్, 2019 ని తీసుకొచ్చారు. మోటార్ వెహికల్స్ ఆక్ట్ 1988లోని సెక్షన్ 166 రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు పరిహారం కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో వివరించారు. భీమా కంపెనీ చేసిన సెటిల్మెంట్ ఆఫర్ నచ్చని వారు మోటార్ వెహికల్స్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MVCT)లో అప్పీల్ చేసుకోవాలి, 2019లో చేసిన సవరణలో ప్రమాదం జరిగిన ఆరు నెలల్లోపు పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధనను చేర్చారు.

ట్రిబ్యునల్ లో దరఖాస్తు చేసే సమయంలో కింద తెలిపిన డాకుమెంట్స్ ని దరఖాస్తుతో పాటు జత చేయాలి.

  • ఆక్సిడెంట్ కి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ
  • మరణం సంబవించినప్పుడు MLC / పోస్ట్ మార్టం రిపోర్ట్ / డెత్ రిపోర్ట్ కాపీ
  • మరణించిన లేక గాయపడ్డ వారి ఐడెంటిటీ ప్రూఫ్.
  • చికిత్సకు అయిన ఖర్చుల అసలు బిల్లులు మరియు చికిత్సకి సంబంధించిన రికార్డులు.
  • మరణించినవారి విద్యా అర్హతల పత్రాలు (ఏదైనా ఉంటే)
  • ఆక్సిడెంట్ లో గాయపడ్డవారు డిసెబిలిటి సర్టిఫికేట్.
  • మరణించిన / గాయపడిన వారి ఆదాయానికి సంబంధించిన రుజువు (ఇన్కమ్ సర్టిఫికేట్)
  • బాధితుడి వయస్సు దృవీకరణ పత్రాలు.
  • థర్డ్ పార్టీ బీమా పాలసీ యొక్క కవర్ నోట్ (ఏదైనా ఉంటే)

మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం ఆక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు, చనిపోయిన వ్యక్తి కుటుంభానికి ఆక్సిడెంట్ కి కారణమైన వాహన యజమాని లేదా అతనికి భీమా ఇచ్చిన కంపెనీ ఐదు లక్షల రూపాయలు చెల్లించాలి, తీవ్రంగా గాయపడిన కేసుల్లో రెండున్నర లక్షల రూపాయలు చెల్లించాలి. అలాగే సెక్షన్ 163 (A) మోటారు వాహనానికి సంబంధించిన ఏదైనా ప్రమాదంలో శాశ్వత వైకల్యం లేదా మరణం సంభవించినప్పుడు అందించాల్సిన పరిహారం గురించి వివరిస్తుంది. ప్రమాదానికి కారణమైన మోటారు వాహన యజమాని పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఎంత పరిహారం చెల్లించాలన్నది మోటార్ వెహికల్ చట్టంలోని రెండవ షెడ్యూల్‌లోని మల్టి ప్లయర్ టేబుల్ ఆధారంగా MACT నిర్ణయిస్తుంది. 2019లో చేసిన సవరణల ప్రకారం పరిహారం కింద ఇచ్చే మొత్తాన్ని ప్రతీ సంవత్సరం 5% పెంచాలి.

సాధారణంగా కోర్టులు పైన తెలిపిన టేబుల్ పరిగణలోకి తీసుకోని మాత్రమే పరిహారం డిసైడ్ చేయకుండా, ఒక్కోసారి పరిహారం పెంచుతారు కుడా. ఉదాహరణకి ఒక ఆక్సిడెంట్ల లో భార్య భర్తలు ఇద్దరు చనిపోయిన ఘటన కి సంబంధించి భార్య హౌస్ వైఫ్ కాబట్టి, ఎలాంటి ఉద్యోగం చేయట్లేదు కాబట్టి పరిహారం తగ్గించాలని భీమా కంపెనీ ఢిల్లీ హై కోర్ట్ ని ఆశ్రయించగా, ఢిల్లీ హై కోర్ట్  భీమా కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిన సందర్భంలో ఈ తీర్పుని సుప్రీం కోర్టులో బాధితులు అప్పీల్ చేసుకోగా సుప్రీం కోర్టు ఢిల్లీ కోర్ట్ వాదనలను వ్యతిరేకిస్తూ, ఒక హౌస్ వైఫ్ కి పరిహారం ఎలా లెక్కించాలో చెప్తూ, ఈ కేసులో పరిహారాన్ని పెంచి ఇవ్వాలని  జనవరి 2021లో ఇచ్చిన తీర్పు ఇక్కడ చూడొచ్చు.

మోటార్ వెహికల్ చట్టంలోని చాప్టర్ 13లోని సెక్షన్ 177 నుండి 210D వరకు రోడ్డు సేఫ్టీకి సంబంధించిన నేరాలు, పెనల్టీస్ మరియు ప్రొసీజర్ గురించి వివరిస్తాయి. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా బండి నడపడం, చిన్న పిల్లలు బండి నడపడం, రాంగ్ రూట్ లో బండి నడపడం, ఇంకా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మోటార్ వెహికల్స్ రూల్స్ అతిక్రమించినప్పుడు ఎలాంటి శిక్షలు అమలు చేయాలో ఈ సెక్షన్స్ వివరిస్తున్నాయి. ఐతే ఈ సెక్షన్లలో ఎక్కడ కూడా పోస్టులో చెప్పినట్టు తప్పు చేసిన వారికి ప్రభుత్వ పతకాలు రద్దు, భీమా వర్తించకపోవడం వంటి శిక్షల ప్రస్తావన లేదు. కర్ణాటక లో అదుపుతప్పిన లారీ ఒక కారుని గుద్దిన ఘటనలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరిహారం చెల్లించిన కేసుకి సంబంధించి సుప్రీం కోర్టు 2020 ఇచ్చిన తీర్పు ఇక్కడ చూడొచ్చు.

2017లో సుప్రీం కోర్టు ఒక ఆర్డర్ ద్వారా సరైన పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ లేకపోతే భీమా కంపెనీలు ఒక వాహన ఇన్సూరెన్సు రెన్యువల్ చేయకూడదు అని తీర్పు ఇచ్చింది. అయితే దీని మీద స్పష్టత ఇస్తూ ‘ఇన్సూరెన్సు రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అఫ్ ఇండియా (IRDAI)’ ఆగష్టు 2020 లో ఒక సర్కులర్ జారీ చేసింది. సరైన PUC సర్టిఫికెట్ లేని కారణంగా మోటార్ ఇన్సూరెన్సు పాలసీ కింద ఎటువంటి క్లెయిమ్ కూడా తిరస్కరించకూడదు అన్నది ఈ సర్కులర్ సారాంశం.

చివరగా, 01 ఏప్రిల్  నుండి రోడ్డు భద్రత కి సంబంధించి కఠిన నిర్ణయాలు అమలు చేయాలనీ సుప్రీం కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll