Fake News, Telugu
 

దేశంలో హిందువుల జనాభా ఎక్కడైతే తగ్గుతూ ఉంటుందో అక్కడ దేశ రక్షణ తగ్గుతూ వస్తుందని భారత ఆర్మీ చీఫ్ పేర్కొనలేదు

0

దేశంలో హిందువుల సంఖ్య ఎక్కడైతే తగ్గుతూ ఉంటుందో, అక్కడ దేశ రక్షణ తగ్గుతూ వస్తుందని భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు చేశారా అని విచారిస్తూ Factly వాట్సాప్ టిప్-లైన్ (+91 9247052470)కి ఒక మెసేజ్ వచ్చింది. ఇదే మెసేజ్ ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో 2020లో కూడా ఒక పోస్ట్ షేర్ చేశారు. ఇందులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: దేశంలో హిందువుల సంఖ్య ఎక్కడైతే తగ్గుతూ ఉంటుందో అక్కడ దేశరక్షణ తగ్గుతూ వస్తోంది – భారత ఆర్మీ చీఫ్.

ఫాక్ట్ (నిజం): హిందువుల జనాభా తగ్గిన చోట దేశ భద్రత తగ్గుతూ వస్తుందని ప్రస్తుత భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే ఎన్నడూ వ్యాఖ్యలు చేయలేదు. జమ్ము కాశ్మీర్లో కొన్ని ప్రార్ధన ప్రదేశాలను యువతలో తీవ్రవాద ఆలోచనలను పెంపొందించేందుకు కేంద్ర ప్రాంతాలుగా ఉపయోగిస్తున్నారని, కాశ్మీర్లో తీవ్రవాదులకు సహాయం చేస్తున్న వారిని దేశ వ్యతిరేకులుగా పరిగణిస్తామని మాజీ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పలు మార్లు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, 2019లో CAA వ్యతిరేక నిరసనలను బిపిన్ రావత్ ఖండించారు. కానీ, హిందువుల సంఖ్య తగ్గుతూ వస్తున్న ప్రాంతాలలో దేశ భద్రతలు లోపిస్తున్నాయని బిపిన్ రావత్ కూడా ఎప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు దేశంలో హిందూ జనాభా తగ్గుతున్న ప్రాంతాలలో భద్రత లోపిస్తూ వస్తుందని ప్రస్తుత భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే వ్యాఖ్యలు చేశారా? అని ఇంటర్నెట్లో వెతికితే, మనోజ్ పాండే అటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఇంటర్నెట్లో ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదని తెలిసింది. ఒకవేళ భారత ఆర్మీ చీఫ్ అటువంటి వ్యాఖ్యలు చేసివుంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఖచ్చితంగా ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. అయితే, భారత ఆర్మీ చీఫ్ ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టు సోషల్ మీడియాలో 2019 నుండి పోస్టులు పెడుతున్నట్టు తెలిసింది.

జమ్ము కాశ్మీర్లో కొన్ని ప్రార్ధన ప్రదేశాలను యువతలో తీవ్రవాద ఆలోచనలను పెంపొందించడానికి కేంద్ర ప్రాంతంగా వాడుకుంటున్నారని, వీరిని డిరాడికలైజేషన్ క్యాంపులలో ఉంచి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని దివంగత మాజీ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ 2020లో వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్లో తీవ్రవాదులకు సహాయం చేస్తున్న వారిని దేశ వ్యతిరేకులుగా పరిగణిస్తామని అలాగే, CAA వ్యతిరేక నిరసనలను ఖండిస్తూ బిపిన్ రావత్ వ్యాఖ్యలు చేశారు. కానీ, హిందువుల సంఖ్య తగ్గుతూ వస్తున్న ప్రాంతాలలో దేశ భద్రత లోపిస్తుందని బిపిన్ రావత్ కూడా ఎప్పుడూ వ్యాఖ్యలు చేయలేదు.

దేశంలో హిందువుల సంఖ్య ఎక్కడైతే తగ్గుతూ ఉంటుందో అక్కడ దేశరక్షణ తగ్గుతూ వస్తోంది”, అని మొట్టమొదట స్వామి పరిపూర్ణానంద 1947 నాటి ఇండియా పాకిస్థాన్ మ్యాప్‌ని షేర్ చేస్తూ 2019లో ఒక ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టారు.

చివరగా, దేశంలో హిందువుల జనాభా ఎక్కడైతే తగ్గుతూ ఉంటుందో అక్కడ దేశ రక్షణ తగ్గుతూ వస్తుందని భారత ఆర్మీ చీఫ్ పేర్కొనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll