Fake News, Telugu
 

ముహర్రం వేడుకల పాత వీడియోను ఎడిట్ చేసి బీహార్లో ముస్లింలు హింసకు పిలుపునిచ్చినట్లుగా తప్పుగా షేర్ చేస్తున్నారు

0

బీహార్లో కొందరు ముష్కరుల భీతి గొలిపే ప్రదర్శన అని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో కొందరు పొడవాటి కత్తులతో ఒక ఊరేగింపు చెయ్యటం చూడవచ్చు. బీహార్లో ముస్లింలు కత్తులతో ప్రదర్శన చేస్తూ హిందువులకు వ్యతిరేకంగా హింసకు పిలుపునిచ్చినట్టు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. అసలు ఈ వీడియో వెనుక నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: బీహార్లో ముస్లింల కత్తులతో ప్రదర్శన చేస్తూ హిందువులకు వ్యతిరేకంగా హింసకు పిలుపునిచ్చారు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో బీహార్లోని దేహరి, బారా పత్తర్ లో జరిగిన ఒక ముహర్రం వేడుకలది. 2017 నుండి ఈ వీడియో ఇంటర్నెట్లో ఉంది, ఇది ఇటీవల జరిగిన కార్యక్రమం కాదు. ఈ వీడియోలో హిందువులకు వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలు చేయలేదు. కావున, వీడియోలో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియోలో కుడి ప్రక్కన ‘MAH Factory’ అని ఉండటం గమనించి ఇంటర్నెట్లో దాని గురించి వెతకగా, MAH Factory-Muharam అనే పేరుతో ఉన్న ఓ యూట్యూబ్ ఛానల్ లభించింది. ఈ ఛానెల్లో 2020లో అప్లోడ్ చేసిన ఒక వీడియో 27 సెకన్ల దెగ్గరనుండి వైరల్ వీడియోతో సరిపోతుంది.

‘Nare Takbeer + Hatho Me Talwar | Only Talwar | Muharram Dehri on Sone Muharram’ అనే టైటిల్ ఉన్న ఈ వీడియో గురించి మరింత సమాచారం పొందటానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతుకగా, నవంబర్ 2017లో అప్లోడ్ చేసిన రెండు యూట్యూబ్ వీడియోలు లభించాయి (ఇక్కడ మరియు ఇక్కడ ). వీటిల్లో ఒకటి వైరల్ వీడియో యొక్క పూర్తి వెర్షన్. ఇందులో వైరల్ వీడియోలో మాదిరిగా ఎటువంటి పాట లేదు. సహజంగా వీడియో రికార్డు చేసినప్పుడు వచ్చే శబ్దాలు ఈ వీడియోలో ఉన్నాయి, అవి వీడియోలో యాక్షన్ తో సరిపోతున్నాయి. ‘Dehri on sone muharram barah patthar 2017’ అని వీడియో టైటిల్ ఉంది. దేహరి ఆన్ సోనే గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఇది బీహార్లోని ఒక పట్టణం అని తెలిసింది.

వీడియోలో 1:33 సెకెన్ల దెగ్గర కామధేను స్వీట్స్ అనే సైన్ బోర్డు ఉన్న షాప్ ఒకటి కనిపించింది. ఇది బీహార్లోని దేహరిలోని రాజపుతానా మొహల్లాలో ఉన్నట్లు గూగుల్ మాప్స్ ద్వారా తెలిసింది. అసలు బీహార్లో ఇటువంటి ప్రదర్శన ఏమైనా ఇటీవల జరిగిందా అని తెలుసుకోవటానికి ఇంటర్నెట్లో వెతికి చూడగా, ఎటువంటి వార్త కథనాలు లభించలేదు.

చివరిగా, ముహర్రం వేడుకలకు సంబంధించిన ఒక పాత  వీడియోను బీహార్లో ఇటీవల హిందువులకి వ్యతిరేకంగా ముస్లింలు హింసకు పిలుపునిచ్చినట్లుగా తప్పుగా షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll