Fake News, Telugu
 

నిత్యానంద కైలాస దేశానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు లేదు. కాబట్టి ఆ దేశానికి అధికారిక రాయబారులు లేరు

0

పలు నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదురుకొంటున్న నిత్యానంద భారత్ నుండి పారిపోయి సొంతంగా కైలాస దేశాన్ని ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఐతే ఇటీవల జరిగిన ఒక ఐక్యరాజ్య సమితి సమావేశంలో కైలాస దేశానికి సంబంధించిన ప్రతినిధి ప్రియా నిత్యానంద శాశ్వత రాయబారి హోదాలో పాల్గొన్నదన్న వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వార్తని షేర్ చేయడం ద్వారా నిత్యానంద దేశమైన ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ కు ఐక్యరాజ్య సమితి గుర్తించినట్టు అనుకుంటున్నారు. ఈ కథనం ద్వారా ఈ విషయానికి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఐక్యరాజ్య సమితి సమావేశంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధి ప్రియా నిత్యానంద శాశ్వత రాయబారి హోదాలో పాల్గొంది.

ఫాక్ట్(నిజం): నిత్యానంద ఏర్పాటు చేసుకున్న కైలాస దేశానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు లేదు. కాబట్టి కైలాస దేశానికి ఐక్యరాజ్య సమితిలో రాయబారులేవరూ లేరు. ఇటీవల జరిగిన ఒక జనరల్ (సాధారణ) సమావేశంలో ప్రియా నిత్యానంద పాల్గొంది. ఐతే ఇది ఒక సాధారణ సమావేశమని, ఈ సమావేశంలో ఎవరైనా పాల్గొనవచ్చిని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు తెలిపారు. కాకపోతే ప్రియా నిత్యానంద మాట్లాడిన దాన్ని తాము పరిగణలోకి తీసుకోవడం లేదని కూడా వారు స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

అసలు ప్రియా నిత్యానంద ప్రకటించుకున్నట్టు ఆమె కైలాస దేశ రాయబారిగానే ఈ మీటింగ్‌కు హాజారైందా, అసలు ఐక్యరాజ్య సమితి కైలాస దేశాన్ని అధిరికంగా గుర్తించిందా అన్న విషయాలు కింద చూద్దాం.

ఐక్యరాజ్య సమితి కైలాస దేశాన్ని గుర్తించలేదు:

ముందుగా భద్రతా మండలి సిఫార్సు చేసి, ఆ తరవాత జనరల్ అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదం పొందిన తరవాతే ఐక్యరాజ్య సమితి ఒక దేశాన్ని అధికారికంగా గుర్తించి, సభ్యత్వాన్ని అందిస్తుంది. సాధారణంగా ఐక్యరాజ్య సమితితో ఒక దేశం సభ్యత్వం పొందే ప్రక్రియ ఇక్కడ చూడొచ్చు.

ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో మొత్తం 193 సభ్య దేశాలు ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని దేశాలు సభ్యత్వం కాకుండా కేవలం అబ్సర్వర్ హోదా కలిగి ఉన్నాయి. ఐతే నిత్యానంద ప్రకటించుకున్న ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ దేశాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించలేదు. సభ్యత్వ దేశాల లిస్టులో కైలాస దేశ పేరు కూడా లేదు. కాబట్టి కైలాస దేశానికి ఐక్యరాజ్య సమితి సభ్యత్వ సమావేశాల్లో పాల్గొనే అనుమతి లేదు.

మరి కైలాస రాయబారి పాల్గొన్నది ఏ సమావేశంలో ?

ఇటీవల 24 ఫిబ్రవరి 2023 నాడు జెనీవాలో 19వ ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కుల కమిటీ (CESCR) సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ప్రియా నిత్యానంద అనే ఒక మహిళ తనని తాను ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ శాశ్వత రాయబారిగా ప్రకటించుకుంటూ ప్రసంగించింది.

స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు అనే అంశంపై జరిగిన ఇలాంటి ఒక సాధారణ సమవేశంలో ప్రియా నిత్యానంద పాల్గొన్నది. ఐతే ప్రియా నిత్యానంద ఈ సమావేశంలో పాల్గొన్నది అధికారిక హోదాలో కాదు, ఇది ఒక జనరల్ (సాధారణ) సమావేశం. సాధారణంగా ఈ సమావేశానికి ఎవరైనా హాజరు కావచ్చు. అలాగే ప్రశ్నలు అడగడం మరియు సలహాలు అందించడం కూడా చేయవచ్చు.

పోస్టులో షేర్ చేసిన వార్త ఈ విషయానికి సంబంధించిందే. ఈ సమావేశంలో మాట్లాడుతూ నిత్యానందను భారత దేశం వేధిస్తోందని ఆరోపించింది కూడా.

ప్రియా నిత్యానంద మాట్లాడిన విషయాలను UN పరిగణలోకి తీసుకోలేదు:

ప్రియా నిత్యానంద ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొన్న దానికి సంబంధించి వివరణ కోరుతూ ఇండియా టుడే, UN అధికారులను సంప్రదించగా, ప్రియా నిత్యానంద మాట్లాడిన విషయాలను తాము పరిగణలోకి తీసుకోవట్లేదని, ఇది కేవలం ఒక జనరల్ (సాధారణ) సమావేశం అని, ఇందులో ఎవరైనా మాట్లాడవచ్చు, ప్రశ్నలు అడగవచ్చు అని  వారు తెలిపారు.

మహిళల పట్ల వివక్ష నిర్మూలనకు సంబంధించి కైలాస ప్రతినిధులు వ్రాత పూర్వకంగా సమర్పించింది కూడా తాము ప్రచురించబోమని తెలిపినట్టు కూడా ఇండియా టుడే రాసుకొచ్చింది.

పైగా పలు దేశాలలో ఏర్పాటు చేసిన స్వచంద సంస్థల ద్వారా నిత్యానంద ప్రతినిధులు ఐక్యరాజ్య సమావేశాలలోకి ప్రవేశిస్తున్నారని ఇండియా టుడే అనుమానం వ్యక్తం చేసింది.

చివరగా, నిత్యానంద ఏర్పాటు చేసుకున్న కైలాస దేశానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు లేదు. కాబట్టి ఆ దేశానికి అధికారిక రాయబారులు లేరు.

Share.

About Author

Comments are closed.

scroll