Fake News, Telugu
 

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఆహుబ్ ఖాన్ అనే వ్యక్తి తన సొంత కూతురిని హైదరాబాద్‌లో పెళ్ళి చేసుకున్నాడని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఆహుబ్ ఖాన్ అనే వ్యక్తి తన సొంత కూతురిని హైదరాబాద్‌లో పెళ్ళి చేసుకున్నాడని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తన సొంత కూతురిని హైదరాబాద్‌లో పెళ్ళి చేసుకున్న తెలంగాణ కాంగ్రెస్ లీడర్ ఆహుబ్ ఖాన్.

ఫాక్ట్: ‘తన సొంత కూతురిని హైదరాబాద్‌లో పెళ్ళి చేసుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఆహుబ్ ఖాన్’ అనే వార్తలో వాస్తవం లేదు. వైరల్ పోస్టుతో పాటు షేర్ చేస్తున్న న్యూస్ క్లిప్పింగ్ ఒక పాత, సంబంధం లేని వార్తకు సంబంధించింది. ఆ వార్తని టైమ్స్ ఆఫ్ ఇండియా 2007లోనే ప్రచురించింది. దీని ప్రకారం, పశ్చిమ బెంగాల్లో జల్పైగురిలో అఫాజుద్దిన్ అలీ అనబడే వ్యక్తి తన కూతురిని పెళ్ళి చేసుకొని, ఆమెను గర్భవతి చేసాడు. ఈ సంఘటన పాతది, మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది, హైదరాబాద్‌లో కాదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ పోస్టుతో పాటు ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ న్యూస్ ఆర్టికల్ చదివితే, అందులో ఎక్కడా కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు అని గానీ, ఆహుబ్ ఖాన్ అని గానీ లేదు. కీ-వర్డ్స్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వెతకగా, ఆ ఆర్టికల్ టైమ్స్ ఆఫ్ ఇండియా 2007లోనే ప్రచురించినట్టు చూడొచ్చు. పశ్చిమ బెంగాల్లో జల్పైగురిలో అఫాజుద్దిన్ అలీ అనబడే వ్యక్తి తన కూతురిని పెళ్ళి చేసుకొని ఆమెను గర్భవతి చేసాడు. అతను పెళ్ళి చేసుకున్నపుడు తన భార్య ప్రథమ సాక్షి అని రిపోర్ట్ కూడా చేసారు. ఈ సంఘటన పాతది, మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది, హైదరాబాద్‌లో కాదు.

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఆహుబ్ ఖాన్ అని ఆన్‌లైన్‌లో వెతకగా, అటువంటి వ్యక్తి ఒకరు ఉన్నట్టు మాకు ఎటువంటి సమాచారం లభించలేదు. 2020 సంవత్సరంలో మాత్రం, సోషల్ మీడియాలో తారున్నం ఖాన్ అనే మహిళ తన నాన్న ఆయుబ్ ఖాన్ ను పెళ్ళి చేసుకుంటున్నానని వేళాకోళంగా షేర్ చేసినప్పుడు అది నిజమే అనుకొని కొంత మంది షేర్ చేసారు.

ఆ క్లెయిమ్ తప్పని అప్పట్లో లాజికల్ ఇండియన్ ఒక ఫాక్ట్-చెక్ ఆర్టికల్ రాసింది. ఆయుబ్ ఖాన్ అబ్బాయితో వారు మాట్లాడినప్పుడు వైరల్ క్లెయిమ్ నిజం కాదని తేల్చి చెప్పాడు. అసలు వాళ్ళ నాన్న కొద్ది సంవత్సరాలుగా జైలులో ఉన్నాడని; మరియు అతనికి అందరూ కొడుకులే అని చెప్పాడు. ఆయుబ్ ఖాన్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్, 2018లో కాంగ్రెస్ టికెట్ మీద బహదూర్‌పురా నుండి పోటీ చేస్తా అని చెప్పాడు, కానీ చేయలేదు.  

చివరగా, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఆహుబ్ ఖాన్ అనే వ్యక్తి తన సొంత కూతురిని హైదరాబాద్‌లో పెళ్ళి చేసుకున్నాడని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. 

Share.

About Author

Comments are closed.

scroll