ఇతర దేశాలతో పోల్చినప్పుడు కేవలం భారతదేశంలో అక్రమ వలసదారులపై ఎలాంటి శిక్షలకు సంబంధించిన నిబంధనలు లేవంటూ ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: భారతదేశంలో అక్రమ వలసదారులపై ఎలాంటి శిక్షాపరమైన నిబంధనలు లేవు.
ఫాక్ట్: ఫారినర్స్ యాక్ట్, 1946, ది పాస్‌పోర్ట్ (ఎంట్రీ ఇంటూ ఇండియా) యాక్ట్, 1920 మరియు ఫారినర్స్ (ట్రిబ్యునల్స్) ఆర్డర్, 1964 వంటి చట్టాలలో అక్రమ వలసదారులతో వ్యవహరించే కొన్ని చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లు, వలసదారులపై విధించే శిక్షాపరమైన నిబంధనలు ఉన్నాయి. ఈ చట్టాల నిబంధనల ప్రకారం కొంతమంది అక్రమ వలసదారులను అధికారులు నిర్బంధించడం లేదా బహిష్కరించడం వంటివి జరిగినట్టు నివేదికలు కూడా ఉన్నాయి. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
ఫారినర్స్ యాక్ట్, 1946, ది పాస్‌పోర్ట్ (ఎంట్రీ ఇంటూ ఇండియా) యాక్ట్, 1920 మరియు ఫారినర్స్ (ట్రిబ్యునల్స్) ఆర్డర్, 1964 వంటి చట్టాలు అక్రమ వలసదారులతో వ్యవహరించే కొన్ని చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లు.
ఈ చట్టాలు పాస్‌పోర్ట్‌లు ఉన్న వ్యక్తులకు ప్రవేశాన్ని కల్పిస్తుండగా, అక్రమ వలసదారుల విషయంలో ఈ చట్టాలు కొన్ని శిక్షలను సూచించినట్టు తెలుస్తుంది. దేశంలోకి ప్రవేశించే అక్రమ వలసదారులపై విధించిన శిక్షా నిబంధనలకు సంబంధించిన వివరాలు – ఈ చట్టాల క్రింద రూపొందించబడినవి – క్రింద చూడొచ్చు.
ది పాస్‌పోర్ట్ (ఎంట్రీ ఇంటూ ఇండియా) యాక్ట్, 1920:
దేశంలోకి ప్రవేశించే అక్రమ వలసదారులను ఉద్దేశించి రూపొందించిన తొలి చట్టాలలో ఇది ఒకటి. ఈ చట్టం భారతదేశంలోకి ప్రవేశించే వ్యక్తి పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండాలనే నిబంధనలను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది.
ఇంకా, ఈ చట్టం కింద రూపొందించబడిన ఏవైనా నిబంధనలకు వ్యతిరేకంగా జరిపిన చర్యలకు శిక్షాపరమైన నిబంధనలు చట్టంలో ఉన్నాయి. అంతేకాకుండా, పాస్‌పోర్ట్ లేకుండా ప్రవేశించిన ఎవరినైనా భారతదేశం నుండి తొలగించే అధికారాన్ని ఈ చట్టం ప్రభుత్వానికి ఇస్తుంది.
ఫారినర్స్ యాక్ట్, 1946:
ఈ చట్టం మొదట వచ్చిన ఫారినర్స్ యాక్ట్, 1940ను రీప్లేస్ చేసింది; ప్రభుత్వం విదేశీయులతో వ్యవహరించడానికి గల అధికారాలను ఈ చట్టం కలిగి ఉంది. భారతదేశంలోకి విదేశీయుల ప్రవేశాన్ని నిషేధించడం మరియు నియంత్రించడం కోసం నిబంధనలను రూపొందించడంలో ఈ చట్టం ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది.
ఇంకా, చట్టంలోని ఏదైనా నిబంధనలను ఉల్లంఘించిన సందర్భంలో జైలు శిక్ష మరియు జరిమానాలు మొదలైన శిక్షలను చట్టం అందిస్తుంది. అంతేకాకుండా, అతను/ ఆమె అక్రమ వలసదారులు కాదనే రుజువు భారం వ్యక్తిపై ఉంటుంది, అధికారులపై కాదు.
ఫారినర్స్ (ట్రిబ్యునల్స్) ఆర్డర్, 1964:
ఫారినర్స్ (ట్రిబ్యునల్స్) ఆర్డర్, 1964, ది ఫారినర్స్ యాక్ట్, 1946లోని సెక్షన్ 3 ప్రకారం రూపొందించబడింది. భారతదేశంలో అక్రమంగా ఉంటున్న వ్యక్తి విదేశీయుడా కాదా అని నిర్ణయించే అధికారం ఈ ట్రిబ్యునల్‌లకు ఉంది. అప్పీళ్లను పరిష్కరించడంలో, ఈ ట్రిబ్యునల్‌లకు సివిల్ కోర్టుకు సమానమైన అధికారాలు ఉంటాయి.
ఫారినర్స్ (ట్రిబ్యునల్స్) ఆర్డర్, 1964కి 2019 సవరణలు భారతదేశంలో అక్రమంగా ఉంటున్న వ్యక్తి విదేశీయుడా కాదా అని నిర్ణయించడానికి, ట్రిబ్యునల్‌లను ఏర్పాటు చేయడానికి, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలోని జిల్లా మేజిస్ట్రేట్‌లకు కూడా అధికారం ఇచ్చింది.
పైన పేర్కొన్న చట్టాలు భారతదేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిపై శిక్షాపరమైన చర్యలు తీసుకోవడానికి అధికారాలు ఇస్తుంది. పైన పేర్కొన్న చట్టపరమైన నిబంధనలను గుర్తు చేస్తూ దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న విదేశీ పౌరులను అదుపులోకి తీసుకుని, వెనక్కి పంపించాలని కోరుతూ 2017లో హోం మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శులందరికీ పంపిన సర్క్యులర్‌ను ఇక్కడ చూడవచ్చు.
భారతదేశంలోని వివిధ నగరాల్లో పైన పేర్కొన్న చట్టాల ప్రకారం అక్రమ వలసదారులను నిర్బంధించడం మరియు శిక్షాపరమైన పరిణామాలకు గురి చేయడం వంటి అనేక సందర్భాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు.
చివరగా, భారతదేశంలో కూడా అక్రమ వలసదారులపై శిక్షాపరమైన నిబంధనలు ఉన్నాయి.