Fake News, Telugu
 

కశ్మీరీ మహిళ వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఆమె తన కశ్మీరీ శాశ్వత నివాస హోదా కోల్పోదు

0

‘ఒక కశ్మీరీ మహిళ వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఆ అమ్మాయి తన కశ్మీరీ పౌరసత్వాన్ని కోల్పోతుంది. కానీ, అదే కశ్మీరీ మహిళ పాకిస్తాన్ వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఆ పాకిస్తాన్ వ్యక్తికి కశ్మీరీ పౌరసత్వం లభిస్తుంది’  అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక కశ్మీరీ మహిళ వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఆమె తన కశ్మీరీ పౌరసత్వాన్ని కోల్పోతుంది; ఒక కశ్మీరీ మహిళ పాకిస్తాన్ వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఆ పాకిస్తాన్ వ్యక్తికి కశ్మీరీ పౌరసత్వం లభిస్తుంది’.

ఫాక్ట్ (నిజం): గతంలో ఆర్టికల్ 35A ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన మహిళ ఆ రాష్ట్రానికి వెలుపల వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, ఆ మహిళ యొక్క భర్త మరియు వారి పిల్లలకు జమ్మూ కాశ్మీర్ లో శాశ్వత నివాస ధృవీకరణ సర్టిఫికేట్ (డోమిసైల్ స్టేటస్) పొందే వీలుండదు. ఆ వ్యక్తి భారత్ లోని ఇతర రాష్ట్రాలకు చెందినవాడైనా లేక పాకిస్తాన్ కి చెందినవాడైనా అతనికి కాశ్మీర్ లో డోమిసైల్ స్టేటస్ లభించేది కాదు. 2002లో జమ్ముకాశ్మీర్ హైకోర్టు రాష్ట్రంలో శాశ్వత నివాస ధృవీకరణ సర్టిఫికేట్ కలిగిన వ్యక్తి యొక్క కూతురు శాశ్వత నివాస ధృవీకరణ సర్టిఫికేట్ లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ మహిళ రాష్ట్ర శాశ్వత నివాస హోదాని (డోమిసైల్ స్టేటస్) కోల్పోదని తీర్పు చెప్పింది. శాశ్వత నివాస ధృవీకరణ సర్టిఫికేట్ (డోమిసైల్ స్టేటస్) కలిగిన మహిళ ఆ స్టేటస్ లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, తను ఆ డోమిసైల్ స్టేటస్ కోల్పోయే అవకాశం లేదు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల 20 జూలై 2021న జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆ రాష్ట్ర నివాస ధృవీకరణ పత్రం (డోమిసైల్ స్టేటస్) పొందడానికి రూపొందించిన J&K grant of domicile certificate (procedure) rules, 2020కి కొన్ని సవరణలు చేస్తూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన వారు (డోమిసైల్ స్టేటస్ కలిగిన వారు) ఆ రాష్ట్రానికి వెలుపల వ్యక్తులను (భార్య/భర్త) వివాహం చేసుకుంటే, ఇక నుండి వారికి కూడా ఆ రాష్ట్ర నివాస ధృవీకరణ సర్టిఫికేట్ (డోమిసైల్ స్టేటస్) పొందే అవకాశాన్ని ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం కల్పిస్తుంది. ఐతే పోస్టులోని వీడియోలో ఈ విషయాన్ని వివరించే నేపథ్యంలోనే పైన క్లెయిమ్ లో తెలిపిన వ్యాఖ్యలు చేసారు. పైగా వీడియోలో  డోమిసైల్ స్టేటస్ అనే పదానికి బదులు పౌరసత్వం అనే పదాన్ని వాడారు, సాదారణంగా భారత దేశంలో కేవలం ఒకటే పౌరసత్వం ఉంటుంది, ప్రత్యేకంగా రాష్ట్ర పౌరసత్వం అంటూ ఏమి ఉండదు. ఐతే డోమిసైల్ స్టేటస్ కి సంబంధించి వీడియోలో చేసిన క్లెయిమ్స్ కి సంబంధించిన వివరణ కింద చూడొచ్చు.

కశ్మీరీ మహిళ వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఆమె తన కశ్మీరీ పౌరసత్వాన్ని కోల్పోతుంది:

ఇంతకు ముందు జమ్మూ కాశ్మీర్ లో అమలులో ఉండే చట్టంలోని ఆర్టికల్ 35A ప్రకారం రాష్ట్రానికి చెందిన మహిళ ఆ రాష్ట్రానికి వెలుపల వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, ఆ మహిళ భర్త మరియు వారి పిల్లలకు జమ్మూ కాశ్మీర్ లో శాశ్వత నివాస ధృవీకరణ సర్టిఫికేట్ (డోమిసైల్ స్టేటస్) పొందే వీలుండేది కాదు. కాని జమ్మూ కాశ్మీర్ కి చెందిన పురుషులు ఆ రాష్ట్రానికి వెలుపల వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, ఆ వ్యక్తి యొక్క భార్య మరియు వారి పిల్లలకు కూడా జమ్మూ కాశ్మీర్ లో శాశ్వత నివాస ధృవీకరణ సర్టిఫికేట్ (డోమిసైల్ స్టేటస్) పొందొచ్చు. ఐతే ఈ నిబంధన యొక్క రాజ్యాంగభద్దతిని ప్రశ్నిస్తూ 2002లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టులో కేసు (State and others vs Dr Susheela Sawhney and others) దాఖలైంది. ఐతే ఈ విషయంపై విచారణ జరిపిన కోర్టు ఇక నుండి జమ్మూకాశ్మీర్ లో శాశ్వత నివాస ధృవీకరణ సర్టిఫికేట్ కలిగిన వ్యక్తి యొక్క కూతురు శాశ్వత నివాస ధృవీకరణ సర్టిఫికేట్ లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ మహిళ రాష్ట్ర శాశ్వత నివాస హోదాని కోల్పోదని స్పష్టం చేసింది.

కశ్మీరీ మహిళ పాకిస్తాన్ వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఆ పాకిస్తాన్ వ్యక్తికి కశ్మీరీ పౌరసత్వం లభిస్తుంది:

జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం అయ్యే సమయంలో అప్పటి కాశ్మీర్ రాజు రాజా హరి సింగ్ మరియు భారత ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందాలలో కేవలం కాశ్మీరీ పురుషుడు రాష్ట్రంలో శాశ్వత నివాస హోదాలేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి సంక్రమించే శాశ్వత నివాస హోదా గురించి మాత్రమే ప్రస్తావించారు.

కాబట్టి ఇంతకు ముందున్న ఆర్టికల్ 35A ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన మహిళ ఆ రాష్ట్రానికి వెలుపల వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, ఆ మహిళ యొక్క భర్త మరియు వారి పిల్లలకు జమ్మూ కాశ్మీర్ లో శాశ్వత నివాస ధృవీకరణ సర్టిఫికేట్ (డోమిసైల్ స్టేటస్) పొందే వీలుండదు. ఆ వ్యక్తి భారత్ లోని ఇతర రాష్ట్రాలకు చెందినవాడైనా లేక పాకిస్తాన్ కి చెందినవాడైనా అతనికి కాశ్మీర్ లో డోమిసైల్ స్టేటస్ లభించేది కాదు.

2002లో హైకోర్టు తీర్పు కూడా కశ్మీరీ మహిళ డోమిసైల్ స్టేటస్ గురించి మాత్రమే ప్రస్తావించిందే గాని కశ్మీరీ మహిళ డోమిసైల్ స్టేటస్ లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తి మరియు వారి పిల్లల యొక్క డోమిసైల్ స్టేటస్ గురించి ప్రస్తావించలేదు. కాబట్టి ఇప్పటి వరకు  కశ్మీరీ మహిళని పెళ్లి చేసుకున్న వ్యక్తికి కాశ్మీర్ లో శాశ్వత నివాస హోదా (డోమిసైల్ స్టేటస్) పొందే వీలుండేది కాదు.

ఐతే ఈ ఆర్టికల్ ప్రారంభంలో చెప్పినట్టు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 20 జూలై 2021న విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా వారికీ కూడా కాశ్మీర్ లో శాశ్వత నివాస హోదా పొందే అవకాశాన్ని కల్పించారు. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కాశ్మీర్ లో అమలులో ఉన్న చట్టలుగాని లేక ప్రస్తుత చట్టాలు (J&K grant of domicile certificate (procedure) rules, 2020 & THE JAMMU AND KASHMIR REORGANISATION ACT, 2019) ఏవీ కూడా కశ్మీరీ మహిళ పెళ్లి చేసుకొనే అబ్బాయి యొక్క పౌరసత్వం గురించి ప్రస్తావించలేదు.

చివరగా, కశ్మీరీ మహిళ వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఆమె తన కశ్మీరీ శాశ్వత నివాస హోదా కోల్పోదు.

Share.

About Author

Comments are closed.

scroll