చైనా రోబోల నాట్య విన్యాస దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. చైనా దేశంలో తయారు చేసిన రోబోలు అక్కడి శాస్త్రీయ నృత్యాన్ని షాంఘైలోని డిస్నీ ల్యాండ్‌లో ప్రదర్శించినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: చైనా రోబోలు నాట్య విన్యాసం చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): వీడియోలో నృత్యం చేస్తున్నది ప్రొఫెషనల్ ఫిగర్ స్కేటర్లు, చైనా రోబోలు కావు. ‘Ice Age Professional’s Cup’ టీవీ షోలో రష్యా ఫిగర్ స్కేటర్ అలెక్స్ టిఖోనోవ్, అమెరికా ఐస్ డాన్సర్ నోమి లాంగ్‌తో కలిసి ఈ ప్రదర్శన ఇచ్చారు. ఈ వీడియోతో చైనా దేశానికి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఇంటర్నేషనల్ ఫిగర్ స్కేటింగ్ క్లబ్ తమ ఫేస్బుక్ పేజిలో షేర్ చేసినట్టు తెలిసింది. ‘Ice Age’ టీవీ షోలో రష్యా ఫిగర్ స్కేటర్ అలెక్సే టిఖోనోవ్, అమెరికా ఐస్ డాన్సర్ నోమి లాంగ్‌తో కలిసి ప్రదర్శన ఇస్తున్న దృశ్యాలని ఈ పోస్టులో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన నృత్య వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, 2012లో ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని అలెక్సే టిఖోనోవ్ తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసినట్ట తెలిసింది. ‘Ice Age Professional’s Cup’ షోలో నోమి లాంగ్‌తో కలిసి ఇచ్చిన ప్రదర్శన దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు.
అలెక్సే టిఖోనోవా రష్యా దేశానికి చెందిన ఒక ప్రముఖ ఫిగర్ స్కేటర్. అలెక్సే టిఖోనోవా తన భార్య పెట్రోవా టిఖోనోవాతో కలిసి పలు టీవీ షోలలో పెయిర్ స్కేటింగ్ ప్రదర్శన ఇచ్చాడు. ఆ ప్రదర్శన వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ‘Maria Petrova Alexey Tikhonov’ అధికారిక ఫేస్బుక్ పేజిలో అలెక్సే టిఖోనోవా ఇచ్చిన మరికొన్ని ప్రదర్శన వీడియోలని చూడవచ్చు.
అలాగే, నోమి లాంగ్ అమెరికా దేశానికి చెందిన ఒక ప్రముఖ ఫిగర్ స్కేటర్ మరియు ఐస్ డాన్సర్. నోమి లాంగ్ ఇచ్చిన పలు ఫిగర్ స్కేటింగ్ ప్రదర్శనలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. అమెరికా నేషనల్ ఐస్ ఛాంపియన్‌షిప్ ఐదు సార్లు గెలిచిన నోమి లాంగ్, 2002 ఒలింపిక్స్లో కూడా పోటి చేసింది. నోమి లాంగ్ ఇన్స్టాగ్రామ్ పేజిలలో ఆమె ఇచ్చిన మరికొన్ని ప్రదర్శన వీడియోలని చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలో నృత్యం చేస్తున్నది ప్రొఫెషనల్ ఫిగర్ స్కేటర్లని, చైనా రోబోలు కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, ప్రొఫెషనల్ ఫిగర్ స్కేటర్లు చేసిన ఒక నృత్య ప్రదర్శన వీడియోని చైనా రోబోలు నృత్యం చేస్తున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.