Fake News, Telugu
 

ప్రధాని మోదీని కించపరుస్తూ మార్ఫింగ్ చేసిన ఫోటోని గుజరాత్ పోలీస్ అధికారి సునీతా యాదవ్ ట్వీట్ చేయలేదు.

0

సూరత్ లో రాత్రి కర్ఫ్యూని ఉల్లంఘించి, తనను బెదిరించిన గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి కొడుకుని ఎదుర్కున్న గుజరాత్ పోలీస్ కానిస్టేబుల్ సునీత యాదవ్ (‘LR ఆఫీసర్’), తన ట్విట్టర్ అకౌంట్ లో ప్రధాని మోదీని కించపరుస్తూ మార్ఫింగ్ చేసిన ఫోటో ట్వీట్ చేసిందని చెప్తూ కొన్ని ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. అంతేకాదు, ఎంఎల్ఏ కొడుకుకి నీతులు చెప్పిన సునీత యాదవ్ తన తండ్రి కారుకు ‘పోలీస్’ బోర్డు ఎందుకు పెట్టిందని ప్రశ్నిస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్:  ప్రధాని మోదీని కించపరుస్తూ మార్ఫింగ్ చేసిన ఫోటోని ట్వీట్ చేసిన గుజరాత్ పోలీస్ కానిస్టేబుల్ సునీతా యాదవ్.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటోలో ఉన్న ట్వీట్ చేసినది సునీతా యాదవ్ కాదు. అది తన పేరుతో ఉన్న ఒక ‘పేరడీ’ అకౌంట్. ఆ ట్విట్టర్ అకౌంట్ ఇప్పుడు లేదు. అంతేకాదు, తనకు అసలు ట్విట్టర్ అకౌంట్ లేదని చెప్తూ సునీతా యాదవ్ తన ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన ట్వీట్ గురించి వెతకగా, ఆ ట్వీట్ చేసిన అకౌంట్ ఇప్పుడు లేనట్టు తెలుస్తుంది. అయితే, ఆ అకౌంట్ తీసేయక ముందు అది ఒక ‘పేరడీ’ అకౌంట్ అని ఆ అకౌంట్ యొక్క ప్రొఫైల్ లో రాసి ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ప్రొఫైల్ కి సంబంధించిన కొన్ని ఆర్కైవ్డ్ ట్వీట్లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

తనకు అసలు ట్విట్టర్ అకౌంట్ లేదని చెప్తూ సునీతా యాదవ్ తన ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అంతేకాదు, ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడుతూ తన పేరు మీద ఉన్నవి ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు అని వీడియోలో 31 నిమిషాల దగ్గర తెలిపింది.

తన తండ్రి కారుకు ‘పోలీస్’ బోర్డు పెట్టిందని కూడా పోస్ట్ లో ఉంది. అయితే, అది వాస్తవమే. ఆ కారు రిజిస్ట్రేషన్ ‘మదన్ లాల్’ పేరు మీద ఉంది. ఫేస్బుక్ లైవ్ లో ఈ విషయం పై కూడా తను 39 నిమిషాల దగ్గర మాట్లాడింది. ఆ కార్ వాళ్ళదే అని, తన తండ్రి తనతో ఉన్నాడని, అలా ‘పోలీస్’ బోర్డు పెట్టుకోవడం తప్పేనని, అయితే అలా చాలా మంది పెట్టుకుంటారని తను కూడా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అలా పెట్టుకుందని చెప్పింది.

చివరగా, ప్రధాని మోదీ ని కించపరుస్తూ మార్ఫింగ్ చేసిన ఫోటోని గుజరాత్ పోలీస్ అధికారి సునీతా యాదవ్ ట్వీట్ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll