Fake News, Telugu
 

బీఫ్ ఎగుమతులకు సంబంధించి ఈ వ్యాఖ్యలు 2012లో కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మోదీ చేసాడు

0

ఒకవైపు దేశంలో గోమాంసం తింటున్న వారిపై/ గోమాంసాన్ని విక్రయిస్తున్న వారిపై బీజేపీ/RSS/VHP దాడి చేస్తుంటే, సాక్షాత్తు మన దేశ ప్రధానమంత్రి, బిజెపి/RSS నాయకుడు నరేంద్ర మోదీ గోమాంసం ఎగుమతుల్లో ప్రపంచంలోనే  మనం No.1గా ఎదిగామని గర్వంగా ప్రకటిస్తున్నాడని అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో మోదీ పింక్ విప్లవం మరియు బీఫ్ ఎగుమతుల గురించి మాట్లాడుతూ కనిపిస్తాడు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ప్రధానమంత్రి మోదీ గోమాంసం ఎగుమతుల్లో ప్రపంచంలోనే మనం No.1గా ఎదిగామని గర్వంగా ప్రకటిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ క్లిప్ మోదీ 2012లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పింక్ విప్లవానికి (మాంసం ఉత్పత్తుల అభివృద్ది) సంబంధించి అప్పటి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విదానాలను విమర్శిస్తూ చేసినది. ఐతే ఈ ప్రసంగంలోని కొంత భాగాన్ని మాత్రమే ఎడిట్ చేసి మోదీ ఇప్పుడు గర్వంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు షేర్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం దేశం నుండి జరుగుతున్న మాంసం(గేదె) ఎగుమతులను పరిశీలిస్తే, మోదీ ప్రధానమంత్రి అయ్యాక భారతదేశం నుండి మాంసం(గేదె) ఎగుమతులు పెరిగాయి. అత్యధికంగా గేదె మాంసం ఎగుమతి చేసే టాప్-10 దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తూ వస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియోలో మోదీ పింక్ విప్లవం మరియు బీఫ్ ఎగుమతుల గురించి మాట్లాడుతున్న విషయం నిజమే అయినప్పటికీ, ఈ ప్రసంగం మోదీ 2012లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది. పైగా ఈ ప్రసంగంలో మోదీ అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని బీఫ్ ఎగుమతుల అంశంలో విమర్శిస్తున్నాడు.

అక్టోబర్ 2012లో  అహ్మదాబాద్‌లో జరిగిన జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JITO) యొక్క నాల్గవ వార్షిక సాధారణ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వ ఆశయాలు/అమలు చేస్తున్న విధానాలను విమర్శించే క్రమంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేసారు.

మోదీ ప్రసంగిస్తూ ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న UPA ప్రభుత్వానికి శ్వేత విప్లవం/హరిత విప్లవం ముఖ్యం కాదని, కేవలం పింక్ విప్లవం (మాంసం ఉత్పత్తుల అభివృద్ది) మాత్రమే ముఖ్యమని విమర్శించాడు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో పింక్ విప్లవం తీసుకురావాలని చూస్తుందని అంటూ ఈ సంవత్సరం బీఫ్ ఎగుమతుల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం గర్వంగా ప్రకటించుకుందని ఎద్దేవా చేసారు.

ఈ సమావేశంలో మోదీ చేసిన పూర్తి ప్రసంగాన్ని ఇక్కడ చూడొచ్చు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మోదీ చేసిన ఈ ప్రసంగాన్ని మీడియా రిపోర్ట్ చేసిన కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

దీన్నిబట్టి మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాంసం ఎగుమతులకు సంబంధించి అప్పటి కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ చేసిన ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్ చేసి మోదీ ప్రధానమంత్రి అయ్యాక బీఫ్ ఎగుమతుల గురించి గర్వంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసాడని తప్పుగా షేర్ చేస్తున్నట్టు అర్ధం చేసుకోవచ్చు.

మాంసం ఎగుమతుల్లో ప్రస్తుతం భారత్ స్థానం:

బీఫ్ ఎగుమతులకు సంబంధించి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, భారత దేశంలో అమలులో ఉన్న ఎగుమతుల పాలసీ ప్రకారం బీఫ్ (ఆవు,దూడ,ఎద్దు) మాంసాల ఎగుమతులపై నిషేధం ఉంది (ఇక్కడ మరియు ఇక్కడ). ప్రస్తుతం బీఫ్ పేరుతో జరిగేది గేదె మాంసం ఎగుమతులు మాత్రమే, ఆవు మాంసం కాదు.

ఇకపోతే మోదీ ప్రధానమంత్రి అయ్యాక భారతదేశం నుండి మాంసం(గేదె) ఎగుమతులు పెరిగాయి. అత్యధికంగా గేదె మాంసం ఎగుమతి చేసే టాప్-10 దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తూ వస్తుంది. Agricultural and Processed Food Products Export Development Authority (APEDA) ప్రకారం 2018-19 సంవత్సరంలో గేదె మాంసం ఉత్పత్తిలో భారతదేశం 1వ స్థానంలో ఉంది.

ఎగుమతులకు సంబంధించిన తాజా APEDA డేటా ప్రకారం 2020లో గేదె మాంసం ఎగుమతి చేసే దేశాలలో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది. డాలర్ విలువలో పోల్చుకుంటే 2020 మరియు 2021లో భారత్ గేదె మాంసం ఎగుమతుల్లో నాలుగు మరియు ఆరో స్థానంలో నిలిచింది. దీనికి  సంబంధించిన కథనాలు ఇక్కడ చూడొచ్చు.

ఐతే అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా భారత్ పలు సార్లు టాప్-10 దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఉదాహారణకు 2012 మరియు 2013 సంవత్సరాలలో గేదె మాంసం ఎగుమతుల్లో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

చివరగా, బీఫ్ ఎగుమతులకు సంబంధించి మోదీ ఈ వ్యాఖ్యలు 2012లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసాడు.

Share.

About Author

Comments are closed.

scroll