Fake News, Telugu
 

ఇటీవల బెంగళూరులో జరిగిన మహిళ హత్య సంఘటనను తప్పుడు లవ్ జిహాద్ కోణంతో షేర్ చేస్తున్నారు

0

“హిందూ మహిళను ఆమె ముస్లిం బాయ్‌ఫ్రెండ్ హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా చేసి, ఫ్రిజ్‌లో ఉంచాడు” అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక ఫోటో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ పోస్టు ఇటీవల బెంగళూరులో జరిగిన మహాలక్ష్మి అనే మహిళ హత్య కేసు నేపథ్యంలో షేర్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక ముస్లిం వ్యక్తి బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళ శరీరాన్ని ముక్కలుగా చేసి, ఫ్రిజ్‌లో ఉంచాడు.

ఫాక్ట్(నిజం): ఇటీవల బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళ హత్య సంఘటనను తప్పుడు లవ్ జిహాద్ కోణంతో షేర్ చేస్తున్నారు. హత్యకు గురైన మహిళ భర్త, ఆమెకు మలికైన అష్రఫ్‌తో అక్రమ సంబంధం ఉందని మరియు అష్రఫ్ ఆమెను హత్య చేశాడు అని ఆరోపించాడు . కానీ, అష్రఫ్‌ను పోలీసులు విచారించిన తర్వాత విడుదల చేశారు, అతడికి ఈ హత్యతో సంబంధం లేదని పోలీసులు తెలిపారు. ఇక, బెంగళూరు మహిళ హత్య కేసులో ప్రధాన అనుమానితుడు ముక్తి రంజన్ రాయ్ ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఆత్మహత్య స్థలంలో అతడు హత్య చేశానని అంగీకరించిన మరణ నోట్ కూడా దొరికింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, పలు రిపోర్ట్స్ లభించాయి (ఇక్కడ, మరియు ఇక్కడ). ఈ రిపోర్ట్స్ ప్రకారం, హత్యకు గురైన మహిళ భర్త తన భార్యకు అష్రఫ్‌ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని ఆరోపించాడు. దీనివల్ల, పెళ్లి అయిన 9 నెలల తర్వాత వీరు వేరుగా ఉండడం ప్రారంభించారు. అష్రఫ్ ఆమెను హత్య చేశాడు అని దాస్ ఆరోపించాడు. అనంతరం పోలీసులు అష్రఫ్‌ను విచారించారు, కానీ విచారణ అనంతరం అష్రఫ్‌కు ఈ హత్యతో ఎటువంటి సంబంధం లేదని తేలిందని పోలీసులు వివరించారు.  

మా పరిశోధనలో, బెంగళూరు పోలీసులు బాధితురాలికి సహోద్యోగి అయిన ముక్తిరంజన్ ప్రతాప్ రాయ్‌ను ఆమె హత్యకు ప్రధాన అనుమానితుడిగా గుర్తించినట్టు ఒక రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం కోసం వెతికినప్పుడు 27 సెప్టెంబర్ 2024న ANI ద్వారా ప్రచురించబడిన ఒక యూట్యూబ్ వీడియోకు దారి తీసాయి, ఇందులో బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానంద ప్రెస్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. కమిషనర్ ఆఫీస్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, బెంగళూరు మహిళ హత్య కేసులో ప్రధాన అనుమానితుడు ముక్తి రంజన్ రాయ్ ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడని కమిషనర్ దయానంద చెప్పారు. ఆత్మహత్య జరిగిన ప్రదేశంలో ఒక నోట్ కూడా దొరికింది.

ఒడిశా పోలీసులు కూడా ముక్తి రంజన్ రాయ్ వదిలిన ఆత్మహత్య నోట్‌లో, ఆయన బాధితురాలిని హత్య చేసినట్లు అంగీకరించినట్లు స్పష్టం చేశారు.

చివరిగా, ఇటీవల జరిగిన బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళ హత్య సంఘటనను తప్పుడు లవ్ జిహాద్ కోణంతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll