ఇటీవల, 23 సెప్టెంబర్ 2024న, న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) నిర్వహించిన ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో, ఐక్యరాజ్యసమితి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వంటి ప్రపంచ సంస్థలలో సంస్కరణలు తీసుకురావాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్ శాశ్వత సభ్యత్వం మరియు వీటో (veto power) అధికారాన్ని పొందిందని పేర్కొంటూ పలు పోస్టులు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ). ఈ వార్తలో ఎంత నిజముందో నిర్థారించాలని కోరుతూ మా వాట్సాప్ టిప్‌లైన్‌కు (+91 9247052470) కూడా పలు అభ్యర్ధనలు వచ్చాయి. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.
క్లెయిమ్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం మరియు వీటో అధికారం లభించింది.
ఫాక్ట్(నిజం): ఐక్యరాజ్యసమితి వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో వీటో అధికారంతో భారతదేశానికి ఇంకా శాశ్వత సభ్యత్వం లభించలేదు. అలాగే, ఇటీవల భారతదేశానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో శాశ్వత సభ్యత్వం లేదా వీటో అధికారం లభించినట్లు తెలిపే ఎటువంటి విశ్వసనీయమైన ఆధారాలు లేవు. ప్రస్తుతం, కేవలం ఐదు దేశాలు-చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్ (UK) మరియు అమెరికా (US) మాత్రమే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో శాశ్వత సభ్యులుగా ఉన్నాయి, ఈ శాశ్వత సభ్యులకు మాత్రమే వీటో అధికారం ఉంది. ఇటీవల జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) యొక్క 79వ సెషన్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, ఫ్రాన్స్ మరియు UK ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చడానికి తమ మద్దతును తెలిపాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇటీవల భారతదేశానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో శాశ్వత సభ్యత్వం, వీటో అధికారం లభించిందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, భారతదేశానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో శాశ్వత సభ్యత్వం లేదా వీటో అధికారం లభించినట్లు తెలిపే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. ఒకవేళ అటువంటి పరిణామం జరిగి ఉంటే, ఖచ్చితంగా పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి.
తదుపరి మేము ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లభించిందా? అని తెలుసుకోవడానికి మేము ఐక్యరాజ్యసమితి యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాము. UN వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, భారతదేశం ఇంకా UNSCలో శాశ్వత సభ్యత్వం పొందలేదు మరియు వీటో అధికారం కలిగి లేదు. ప్రస్తుతం, కేవలం ఐదు దేశాలు -చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్ (UK) మరియు అమెరికా (US) మాత్రమే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో శాశ్వత సభ్యులుగా ఉన్నాయి, ఈ శాశ్వత సభ్యులకు మాత్రమే వీటో అధికారం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఐదు శాశ్వత సభ్య దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకోబడిన పది మంది తాత్కాలిక (నాన్ -పర్మనెంట్) సభ్యులను కలిగి ఉంటుంది. ప్రస్తుతం, అల్జీరియా, ఈక్వెడార్, గయానా, జపాన్, మాల్టా, మొజాంబిక్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సియెర్రా లియోన్, స్లోవేనియా మరియు స్విట్జర్లాండ్‌లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక (నాన్ -పర్మనెంట్) సభ్యులుగా ఉన్నాయి. అలాగే మేము సెప్టెంబరు 2024కు సంబంధించి ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలకు యొక్క ఎజెండాను కూడా పరిశీలించాము, ఇందులో UNSC సంస్కరణలు లేదా ఏదైనా కొత్త దేశాలను UNSCలో శాశ్వత సభ్యులుగా చేర్చడం లేదా వీటో అధికారాన్ని మంజూరు చేయడం గురించి ప్రస్తావించలేదు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). దీన్ని బట్టి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో వీటో అధికారంతో కూడిన శాశ్వత సభ్యత్వం భారత్‌కు ఇంకా లభించలేదని స్పష్టమవుతోంది.
UNSCలో వీటో అధికారం(Veto power) అనగా:
UNSC యొక్క శాశ్వత సభ్యులైన చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్ (UK), మరియు అమెరికాకు(US) మాత్రమే ‘వీటో పవర్ ‘ అని పిలిచే ప్రత్యేక ఓటింగ్ అధికారాన్ని కలిగి ఉన్నాయి. 15 మంది సభ్యుల కలిగి ఉన్న భద్రతా మండలిలో ఈ ఐదుగురు శాశ్వత సభ్యులలో ఎవరైనా UNSCలో తీసుకున్న ఏదైనా తీర్మానం లేదా నిర్ణయంకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లయితే, ఆ తీర్మానం లేదా నిర్ణయం ఆమోదించబడదు. శాశ్వత సభ్యుడు ప్రతిపాదిత తీర్మానంతో పూర్తిగా ఏకీభవించనప్పటికీ, దానిని వీటో చేయకూడదనుకుంటే, వారు ఓటింగ్ కు దూరంగా ఉండవచ్చు, అలాంటి సందర్భాలలో తొమ్మిది అనుకూలమైన ఓట్లు వస్తే తీర్మానాన్ని ఆమోదిస్తారు (ఇక్కడ). ఈ ఐదుగురు శాశ్వత సభ్య దేశాలు వివిధ సమయాల్లో తమ వీటో అధికారాన్ని వినియోగించుకున్నాయి.
ఇటీవల న్యూయార్క్ నగరంలో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) యొక్క 79వ సెషన్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, ఫ్రాన్స్ మరియు UK ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చడానికి తమ మద్దతును తెలిపాయని పలు వార్త కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ).
26 సెప్టెంబర్ 2024న UN జనరల్ అసెంబ్లీ 79వ సెషన్‌లో జరిగిన చర్చలో UK ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ ప్రసంగిస్తూ, “UNSCలో శాశ్వత ఆఫ్రికన్ ప్రాతినిధ్యాన్ని చూడాలనుకుంటున్నాము, అలాగే బ్రెజిల్, ఇండియా, జపాన్ మరియు జర్మనీలను శాశ్వత సభ్యులుగా చేర్చడానికి మద్దతును ఇస్తున్నాము” అని తెలిపారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).
25 సెప్టెంబర్ 2024న UN జనరల్ అసెంబ్లీ యొక్క 79వ సెషన్‌లో ప్రసంగిస్తూ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భద్రతా మండలి కూర్పును విస్తరించడానికి ఫ్రాన్స్ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. జర్మనీ, జపాన్, భారతదేశం మరియు బ్రెజిల్ లను UNSCలో శాశ్వత సభ్యులుగా ఉండాలని ఆయన పేర్కొన్నారు (ఇక్కడ , ఇక్కడ).
23 సెప్టెంబర్ 2024న న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్‌లో నిర్వహించిన ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, భారతదేశం, జపాన్ మరియు జర్మనీలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా చేర్చడానికి అమెరికా మద్దతు ఇస్తుందని తెలిపారు (ఇక్కడ).
చివరగా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం, వీటో అధికారం ఇంకా లభించలేదు.