కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సెక్యూరిటీ సిబ్బంది లేకుండా ఆటోలో వెళ్లి ఒక కాకా హోటల్లో తృప్తిగా తన డబ్బులతో భోజనం చేసిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ముఖ్యమంత్రి పర్యటనకి వస్తున్నారంటే ట్రాఫిక్ నియంత్రణ పేరుతో గంటల కొద్ది ప్రజలను ఇబ్బంది పెట్టే ఈ కాలంలో, పినరయి విజయన్ ఒక సామాన్య వ్యక్తిలా నడుచుకోవడం హర్షించ దగ్గ విషయమని ఈ పోస్టులో తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సెక్యూరిటీ సిబ్బంది లేకుండా ఆటోలో వెళ్లి ఒక కాకా హోటల్లో తృప్తిగా తన డబ్బులతో భోజనం చేసిన దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో, 2017లో కేరళ సచివాలయ సిబ్బందితో కలిసి పినరయి విజయన్ ఓనం సాంప్రదాయ విందు ‘ఓనసాడ్య’ను ఆరగిస్తున్న దృశ్యాలని చూపిస్తుంది. ఈ విందు కార్యక్రమాన్ని కేరళ సచివాలయ సిబ్బంది వారు నిర్వహించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వతంత్రంగా ఆటోలో వెళ్లి ఒక కాకా హోటల్లో భోజనం చేసినట్టు మాకు ఎటువంటి సమాచారం దొరకలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియోని ‘టైమ్స్ అఫ్ ఇండియా’ సంస్థ 25 ఆగష్టు 2017 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేరళ సచివాలయ సిబ్బందితో కలిసి ఓనం సాంప్రదాయ విందు ‘ఓనసాడ్య’ను ఆరగిస్తున్న దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. ఈ విందు కార్యక్రమాన్ని కేరళ సచివాలయ సిబ్బంది వారు నిర్వహించినట్టు ‘టైమ్స్ అఫ్ ఇండియా’ రిపోర్ట్ చేసింది.
ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ 2017లో పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ మరియు వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కేరళ సచివాలయ సిబ్బంది నిర్వహించిన విందు కార్యక్రమంలో పినరయి విజయన్ భోజనం చేస్తున్న దృశ్యాలని ఈ న్యూస్ రిపోర్టులలో కూడా తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వతంత్రంగా ఆటోలో వెళ్లి ఒక కాకా హోటల్లో భోజనం చేసినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ ఇప్పటివరకు రిపోర్ట్ చేయలేదని తెలిసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోని 2017లో కేరళ సచివాలయ సిబ్బంది వారు ఇచ్చిన ఓనం పండగ విందు కార్యక్రమంలో తీసారని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, కేరళ సచివాలయ సిబ్బంది ఇచ్చిన ఓనం విందులో పినరయి విజయన్ భోజనం చేస్తున్న పాత ఫోటోని ఇప్పుడు తప్పుగా షేర్ చేస్తున్నారు.