Fake News, Telugu
 

2014కు ముందు దేశంలో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న జనాభా శాతం అని షేర్ చేస్తున్న ఈ గణాంకాలు తప్పు

0

దేశ జనాభాలో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారి శాతం ఇప్పుడు 47 అని, 2014కు ముందు కేవలం 4.7 శాతం జనాభా మాత్రమే ఇంటర్నెట్ ఉపయోగించేవారని సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: దేశ జనాభాలో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారి శాతం 2014కు ముందు 4.7 శాతం ఉంటే, ఇప్పుడు 47 శాతానికి పెరిగింది.

ఫాక్ట్ (నిజం): 2014కు ముందు భారతదేశంలో 238.71 మిలియన్ల జనాభా ఇంటర్నెట్ ఉపయోగించేవారని  ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా’ (TRAI) తమ రిపోర్టులో తెలిపింది. అంటే, దేశ జనాభాలో (138 కోట్లు) 17.3 శాతం మంది 2014కు ముందు ఇంటర్నెట్ ఉపయోగించేవారని స్పష్టమయ్యింది. TRAI ఇటీవల రిలీజ్ చేసిన ‘ది ఇండియన్ టెలికాం పెర్ఫార్మన్స్ ఇండికేటర్ ఏప్రిల్-జూన్ 2021’ రిపోర్టులో దేశంలో ప్రస్తుతం 833.71 మిలీయన్ల జనాభా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని తెలిపింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా’ (TRAI) వెబ్సైటులో వెతికితే, భారత దేశంలో 2014కు ముందు మరియు ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్ల వివరాలు లభించాయి. 2014 ఏప్రిల్ నెలలో TRAI రిలీజ్ చేసిన ‘ది ఇండియన్ టెలికాం సర్వీస్ పెర్ఫార్మన్స్ ఇండికేటర్’ రిపోర్ట్ ప్రకారం, 2014కు ముందు, అంటే 2013 డిసెంబర్ నెల వరకు దేశంలోని 238.71 మిలియన్ల జనాభా ఇంటర్నెట్ ఉపయోగించేవారని తెలిపింది. దీన్ని బట్టి, 2014కు ముందు దేశ జనాభాలో (138 కోట్లు) 17.3 శాతం మంది ఇంటర్నెట్ ఉపయోగించేవారని స్పష్టమయ్యింది.

2014 మార్చ్ నెల వరకు అంటే, నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపి ప్రభుత్వం ఏర్పాటుకు కొన్ని రోజుల ముందు వరకు, భారత దేశంలోని 251.59 మిలియన్లు జనాభా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని TRAI రిపోర్ట్ చేసింది. దీన్ని బట్టి, నరేంద్ర మోదీ భారత ప్రధానిగా ఎన్నికైన సమయానికి దేశంలోని సుమారు 18.23 శాతం జనాభా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని TRAI రిపోర్ట్ ద్వార తెలిసింది.

2015లో జియో నెట్వర్క్ ప్రారంభం తర్వాత దేశంలో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య ఘననీయంగా పెరిగిందని పలు న్యూస్ సంస్థలు రిపోర్ట్ చేసాయి. TRAI ఇటీవల రిలీజ్ చేసిన ‘ది ఇండియన్ టెలికాం సర్వీస్ పెర్ఫార్మన్స్ ఇండికేటర్ ఏప్రిల్-జూన్ 2021’ రిపోర్టులో, దేశంలో ప్రస్తుతం 833.71 మిలియన్ల జనాభా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని తెలిపింది. అంటే, దేశ జనాభాలో పస్తుతం 60.41 శాతం మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని స్పష్టమయ్యింది. ఈ వివరాల ఆధారంగా, పోస్టులో తెలుపుతున్న ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య తప్పని చెప్పవచ్చు.  

చివరగా, భారత దేశంలో 2014కు ముందు మరియు ప్రస్తుతం ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న జనాభా శాతం అని షేర్ చేస్తున్న ఈ గణాంకాలు తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll