మోదీ హాయాంలో ఎటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించకపోగా, అత్యధికంగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయడం జరిగిందని అర్ధంవచ్చేలా నెహ్రు సమయం నుండి ఇప్పటి వరకు ఉన్న వివిధ ప్రధాన మంత్రుల హాయాంలలో స్థాపించిన మరియు అమ్మిన ప్రభుత్వ రంగ సంస్థల వివరాలను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మోదీ హాయాంలో ఎటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించకపోగా, అత్యధికంగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయడం జరిగింది.
ఫాక్ట్ (నిజం): నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్న 2014-2019 కాలంలో వివిధ మంత్రిత్వ శాఖల కింద 63 ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించబడ్డాయి. 1991లో పి.వి. నరసింహా రావు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రవేశ పెట్టిన కొత్త ఆర్ధిక విధానం ద్వారా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాని విక్రయించడం మొదలు పెట్టారు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విషయంలో అంతకుముందున్న ప్రభుత్వాల విదానాలను 1991 తర్వాతి ప్రభుత్వాల విధానాలతో పోల్చడం కరెక్ట్ కాదు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించడానికి మరియు అమ్మేయడానికి చాలా తేడా ఉంది. 2004-14 మధ్య మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో 42 సార్లు వాటాలు విక్రయించడం జరగగా, 2014-21 మధ్య మోడీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో 133 సార్లు వాటాలు విక్రయించడం జరిగింది, ఐతే ఇది కేవలం వాటాలు విక్రయించడమే కాని పోస్టులో చెప్తున్నట్టు పూర్తిగా అమ్మేయడం కాదు, దీన్నిబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించడాన్ని అమ్మేయడం అని తప్పుగా అర్ధం చెసుకున్నట్టు తెలుస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
1948లో పరిశ్రమలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాలని తీర్మానించారు. ప్రభుత్వాలు ముఖ్యంగా ఆరు ప్రాథమిక రంగాలలో పరిశ్రమల స్థాపనలో బాధ్యత వహిస్తాయని, మిగిలిన పారిశ్రామిక రంగాలలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఐతే 1991లో పి.వి. నరసింహా రావు ప్రవేశ పెట్టిన కొత్త ఆర్ధిక విధానం ద్వారా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాని విక్రయించడం మొదలు పెట్టారు. ఐతే పోస్టులో చెప్పినట్టు మోదీ హాయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏమి స్థాపించలేదన్న మాట నిజం కాదు ఎందుకంటే మోదీ ప్రధానమంత్రిగా ఉన్న 2014-2019 కాలంలో వివిధ మంత్రిత్వ శాఖల కింద 63 ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించబడ్డాయి. కాబట్టి పోస్టులో పేర్కొన్నట్టు మోదీ హాయాంలో ఎటువంటి సంస్థలు స్థాపించబడలేదన్న వాదన కరెక్ట్ కాదు.
సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయడం వల్ల పోటితత్వాన్ని పెంపొందించి తద్వారా సంస్థ పనితీరు పెంచడానికి, ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించడానికి, ప్రభుత్వ స్పెండింగ్ కెపాసిటీ పెంచడానికి, సామాజిక రంగాల్లో ఖర్చు చేయడానికి కావలసిన డబ్బును సేకరించడానికి మొదలైన కారణాల వల్ల ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలు విక్రయిస్తుంటాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించడానికి మరియు అమ్మేయడానికి చాలా తేడా ఉంది. సాధారణంగా ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాని మూడు రకాలుగా విక్రయిస్తారు.
- సంస్థల్లోని కొంత వాటాని విక్రయించడం, ఈ పద్దతిలో మెజారిటీ వాటా (51% కన్నా ఎక్కువ) తమ వద్దే ఉంచుకోవడం ద్వారా సంస్థ యొక్క నిర్వహణ మరియు నియంత్రణకి సంబంధించిన అధికారాలు తమ వద్దే ఉంచుకుంటాయి, దీనిని మైనారిటీ డిసిన్వేస్ట్మెంట్ అంటారు, ఉదాహారణకి 1991 నుండి చాలా ప్రభుత్వాలు పలు కారణాల వల్ల వివిధ PSUల్లో మైనారిటీ వాటాని విక్రయిస్తూ వచ్చాయి, దీనికి సంబంధించిన సమాచారం ఇక్కడ చూడొచ్చు.
- సంస్థల్లోని మెజారిటీ వాటాని విక్రయించడం, ఈ పద్దతిలో సంస్థల్లోని కొంత వాటాని తమ వద్దే ఉంచుకొని ఎక్కువ శాతం వాటాని విక్రయిస్తుంటారు, దీనిని మెజారిటీ డిసిన్వేస్ట్మెంట్ మరియు స్ట్రాటజిక్ డిసిన్వేస్ట్మెంట్ అని కూడా అంటారు. ఉదాహారణకి 2017-18లో హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థకి చెందిన 51.11% షేర్లను మరొక సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైస్ కి విక్రయించారు.
- మూడో పద్దతిలో సంస్థలోని పూర్తి వాటాని విక్రయించడం ద్వారా సంస్థపై అధికారాన్ని కొనుగోలుదరులకి బదలాయిస్తుంది, దినిని పూర్తి డిసిన్వేస్ట్మెంట్ లేదా ప్రైవేటీకరణ అని అంటారు.
1991-92 సంవత్సరంలో ప్రైవేటీకరణ కారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించడం మొదలై ఆ సంవత్సరం 31 PSUల్లో ప్రభుత్వ వాటాలు విక్రయించడం ద్వారా రూ. 3038 కోట్లు సేకరించారు. 1991-92 నుండి 2020-21 కాలంలో వివిధ ప్రభుత్వాలు మొత్తం 306 సార్లు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించడం ద్వారా రూ. 5,05,633.38 కోట్లు సమకూర్చుకున్నారు. ఐతే 1991 కన్నా ముందు డిసిన్వేస్ట్మెంట్ కి సంబంధించి అధికారిక పాలసీ ఏది లేని కారణంగా ప్రభుత్వ సంస్థల ప్రైవేటికరణ విషయంలో అంతకు ముందున్న ప్రభుత్వ విధానాలను ఆ తర్వాతి ప్రభుత్వాల విధానాలను పోల్చడం కరెక్ట్ కాదు.
పైన తెలిపిన వివిధ పద్దతుల్లో 2004-14 మధ్య మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో 42 సార్లు వాటాలు విక్రయించడం జరగగా, 2014-21 మధ్య మోదీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో 133 సార్లు వాటాలు విక్రయించడం జరిగింది. ఐతే ఇది కేవలం వాటాలు విక్రయించడమే (చాలా వరకు మైనారిటీ షేర్స్ మాత్రమే) కాని పోస్టులో చెప్తున్నట్టు పూర్తిగా అమ్మేయడం కాదు. దీన్నిబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించడాన్ని అమ్మేయడం అని తప్పుగా అర్ధం చెసుకున్నట్టు తెలుస్తుంది.
ఇటీవల ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్ లో రెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మరియు ఒక ఇన్సురన్స్ కంపెనీలో వాటాలు విక్రయించబోతున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపిన నేపథ్యంలో మరియు కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో వాటాలు విక్రయించడానికి నిర్ణయించిన నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
చివరగా, మోదీ ప్రభుత్వం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో కేవలం వాటాలు విక్రయించింది, పూర్తిగా అమ్మేయలేదు.