Fake News, Telugu
 

‘బాబా రోడు షా’ మేళాకు సంబంధించిన వీడియోని కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమంలో రైతులు మద్యం కోసం ఎగబడుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమంలో రైతులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 05 సెప్టెంబర్ 2021 నాడు  ముజఫర్‌నగర్‌లో ‘కిసాన్ మహాపంచాయత్’ ద్వారా నిరసన తెలిపిన నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: ‘కిసాన్ మహాపంచాయత్’ కార్యక్రమంలో రైతులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, పంజాబ్ రాష్ట్రం కౌంకే కలాన్ గ్రామంలో 06 సెప్టెంబర్ 2021 నాడు జరుపుకున్న ‘బాబా రోడు షా జి’ మేళాకు సంబంధించిన దృశ్యాలని చూపిస్తుంది. ఈ వీడియో కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమానికి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.   

పోస్టులో షేర్ చేసిన వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై స్పష్టతనిస్తూ కొందరు యూసర్లు ట్వీట్లు పెట్టినట్టు తెలిసింది. ‘బాబా రోడు షా జి’ మేళాకు సంబంధించిన వీడియోని కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమంలో రైతులు మద్యం కోసం ఎగబడుతున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్నట్టుగా ఈ ట్వీట్‌లో తెలిపారు.

పోస్టులో షేర్ చేసిన వీడియోలో రెండు వేర్వేరు వీడియో క్లిప్పులు ఉండటాన్ని మనం గమనించవచ్చు. పై వివరాల ఆధారంగా ఈ వీడియో క్లిప్పులకు సంబంధించిన వివరాలని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

వీడియో క్లిప్-1:

ఈ వీడియో క్లిప్పులోని దృశ్యాలని గుగూల్‌లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక యూసర్ తన ఫేస్బుక్ పేజిలో షేర్ చేస్తూ, ‘బాబా రోడు షా జి’ మేళాలో విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తున్న దృశ్యాలని తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలోని కౌంకే కలాన్ అనే గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ ‘బాబా రోడు షా జి’ మేళా జరుపుకుంటారు. 06 సెప్టెంబర్ 2021 నాడు జరిగిన ‘బాబా రోడు షా జి’ మేళా కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వీడియోని ‘PunjabLive1.com’ న్యూస్ ఛానల్ పబ్లిష్ చేసింది. పోస్టులో షేర్ చేసిన వీడియో క్లిప్‌లోని ఒక వ్యక్తి, ఈ వీడియోలో కూడా కనిపించడాన్ని మనం గమనించవచ్చు. ‘బాబా రోడు షా జి’ మేళాకు సంబంధించి షేర్ చేసిన మరొక వీడియోలో కూడా ఈ వ్యక్తి కనిపిస్తుండటాన్ని బట్టి, ఈ వీడియో ‘బాబా రోడు షా జి’ మేళాకు సంబంధించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

వీడియో క్లిప్-2:

ఈ వీడియో క్లిప్‌లోని దృశ్యాలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే వీడియోని సోషల్ మీడియాలో ‘బాబా రోడు షా జి’ మేళాకు సంబంధించిన వీడియోగా షేర్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఇవే దృశ్యాలతో పోలి ఉన్న వీడియోని ‘Daily News Punjab’ ఛానల్ 07 సెప్టెంబర్ 2021 నాడు పబ్లిష్ చేసింది. ఈ వీడియోలోని దృశ్యాలు ‘బాబా రోడు షా జి’ మేళాకు సంబంధించినవని వీడియో వివరణలో స్పష్టంగా తెలిపారు.

ఈ వీడియోని కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమానికి జత చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటంతో, సందీప్ సింగ్ అనే ఒక  స్వతంత్ర జర్నలిస్ట్, ఈ వీడియో పై స్పష్టత కొరకు కౌంకే కలాన్ గ్రామ ప్రజలను ఇంటర్వ్యూ చేసారు.  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో 06 సెప్టెంబర్ 2021 నాడు జరిగిన ‘బాబా రోడు షా జి’ మేళాకు సంబంధించిందని కౌంకే కలాన్ గ్రామ ప్రజలు సందీప్ సింగ్‌కు స్పష్టం చేసారు. ఈ ఇన్వెస్టిగేషన్ వీడియోలో కనిపిస్తున్న భవనలు మరియు బస్సు పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలతో పోలి ఉన్నాయి. అంతేకాదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ‘బాబా రోడు షా జి’ మేళాకు సంబంధించిందని ‘Jan Shakti News Punjab’ న్యూస్ ఛానల్ స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమానికి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా,  ‘బాబా రోడు షా జి’ మేళాకు సంబంధించిన వీడియోని కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమంలో రైతులు మద్యం కోసం ఎగబడుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll