బాబాసాహెబ్ అంబేడ్కర్ జన్మదినం ఏప్రిల్ 14 ను ‘విశ్వ విజ్ఞాన దివస్’ గా జరుపు కోవాలని ఐక్యరాజ్య సమితి (UN) ప్రకటించినట్టు చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అంబేడ్కర్ జన్మదినం ఏప్రిల్ 14 ను ‘విశ్వ విజ్ఞాన దివస్’ గా ప్రకటించిన ఐక్యరాజ్య సమితి.
ఫాక్ట్: ఏప్రిల్ 14 ను ‘విశ్వ విజ్ఞాన దివస్’ గా ఐక్యరాజ్య సమితి ప్రకటించినట్టు ఎక్కడా కూడా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి పాటించే అంతర్జాతీయ రోజులు మరియు వారాల లిస్టులో కూడా ఏప్రిల్ 14 న ‘విశ్వ విజ్ఞాన దివస్’ పేరు లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ఏప్రిల్ 14 ను ‘విశ్వ విజ్ఞాన దివస్’ గా ఐక్యరాజ్య సమితి ప్రకటించినట్టు ఎక్కడా కూడా ఎటువంటి అధికారిక సమాచారం లభించలేదు. ఒకవేళ నిజంగానే ఐక్యరాజ్య సమితి అలా ప్రకటిస్తే, అన్నీ ప్రముఖ వార్తాసంస్థలు ఆ విషయం గురించి ప్రచురించేవి. అయితే, ఇలాంటి పోస్టులే 2017 నుండి ఇంటర్నెట్ లో షేర్ చేయబడుతున్నట్టు తెలిసింది.
ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి పాటించే అంతర్జాతీయ రోజులు మరియు వారాలను వారి వెబ్సైటులో చూడగా, ఆ లిస్టులో కూడా ఏప్రిల్ 14 న ‘విశ్వ విజ్ఞాన దివస్’ పేరు లేదు.
‘విశ్వ విజ్ఞాన దివస్’ యొక్క ఆంగ్ల అనువాదం “World Science Day” గా వస్తుంది. అయితే, ‘World Science Day for Peace and Development’ రోజును నవంబర్ 10న ప్రతి సంవత్సరం జరుపుతారని ఐక్యరాజ్య సమితి వెబ్సైటులో చదవొచ్చు. దానికీ, అంబేడ్కర్ కి ఎటువంటి సంబంధంలేదు.
2016 లో మొదటి సారిగా ఐక్యరాజ్య సమితి లో బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని జరుపుకున్నట్టు ‘ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి’ వెబ్సైటులోని ప్రెస్ రిలీజ్ లో చదవొచ్చు. ఆ తరువాతి సంవత్సరాల్లో కూడా అంబేడ్కర్ జయంతిని ఐక్యరాజ్య సమితి లో జరుపుకున్నట్టు ఇక్కడ (2017), ఇక్కడ (2018), మరియు ఇక్కడ (2019) చూడవొచ్చు. కానీ, పోస్ట్ లో చెప్పిన ‘విశ్వ విజ్ఞాన దివస్’ గురించి మాత్రం ఎక్కడా సమాచారం లేదు. అయితే, అంబేడ్కర్ జయంతిని ‘Knowledge Day’ గా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టు 2017 లో ‘ది హిందూ’ వార్తాపత్రిక రిపోర్ట్ చేసింది.
చివరగా, బాబాసాహెబ్ అంబేడ్కర్ జన్మదినం ఏప్రిల్ 14 ను ‘విశ్వ విజ్ఞాన దివస్’ గా ఐక్యరాజ్య సమితి ఇప్పటివరకైతే ప్రకటించలేదు.