కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 1947 నుండి 1977 వరకు ముస్లిం నాయకులు మాత్రమే కేంద్ర విద్యా శాఖ మంత్రులుగా పనిచేసారు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. పోస్టులో తెలిపిన ముస్లిం నాయకుల కారణంగానే అక్బర్, బాబర్, ఔరంగజేబ్ లని కీర్తిస్తూ పాఠ్య పుస్తకాలు ప్రచురించబడినట్టు క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 1947 నుండి 1977 మధ్యలో ముస్లిం నాయకులు మాత్రమే కేంద్ర విద్యా శాఖ మంత్రులుగా పనిచేసారు.
ఫాక్ట్ (నిజం): 1947 నుండి 1977 వరకు కాంగ్రెస్ పాలనలో తొమ్మిది మంది నాయకులు విద్యా శాఖ మంత్రులుగా పనిచేసారు. వీరిలో నలుగురు ముస్లిం మతానికి చెందిన వారు కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కి సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతికితే, 1947 నుండి 1977 వరకు విద్యా శాఖ మంత్రులుగా పనిచేసిన నాయకుల జాబితా Ministry of Education వెబ్సైటులో దొరికింది. 1947 నుండి 1977 వరకు తొమ్మిది మంది కేంద్ర విద్యా శాఖ మంత్రులుగా పనిచేసినట్టు ఈ వెబ్సైటు ద్వార తెలిసింది. వారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ (1947-58), Dr. K.L. శ్రిమాలి (1958-63), హుమాయున్ కబీర్ (1963), M.C. చాగ్ల (1963-66), ఫఖ్రుద్ధిన్ అలీ అహ్మద్ (1966-67), Dr. త్రిగుణ సేన్ (1967-69), Dr. V.K.R.V. రావు (1969-71), సిద్ధార్థ శంకర్ రాయ్ (1971-72) మరియు S. నురుల్ హసన్ (1972-79) అని తెలిసింది. 1947 నుండి 1977 వరకు విద్యా శాఖా మంత్రులుగా పనిచేసిన ఈ నాయకుల వివరాలని ‘Council of Ministers 1947-2015’ డాక్యుమెంట్ లో కూడా చూడవచ్చు. ఈ తొమ్మిది మంది నాయకులలో నలుగురు ముస్లిం మతానికి చెందిన వారు కాదు.
ముస్లిం మతంతో సంబంధం లేని ఆ నలుగురు నాయకులు Dr. K.L. శ్రిమాలి, Dr. త్రిగుణ సేన్, Dr. V.K.R.V. రావు మరియు సిద్ధార్థ శంకర్ రాయ్ ల వివరాలని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. పాఠ్య పుస్తకాలలో అక్బర్, బాబర్, ఔరంగజేబ్ జీవిత చరిత్రలని ప్రచురించడానికి 1947 నుండి 1977 మధ్య విద్యా శాఖ మంత్రులుగా పనిచేసిన అయిదుగురు ముస్లిం నాయకులు కారణమని ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు దొరకలేదు.
చివరగా, 1947 నుండి 1977 మధ్యలో కేంద్ర విద్యా శాఖ మంత్రులుగా పనిచేసిన నాయకులందరూ ముస్లిం మతానికి చెందిన వారు కాదు.