Fake News, Telugu
 

IUML పార్టీ జెండాని ఒక మత సంస్థ భారత దేశానికి వ్యతిరేకంగా సైన్యాన్ని తయారుచేస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు

0

భారత దేశాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని కేరళ ముస్లింలు కార్లకి, భవనాలకి అలాగే, ధరించే వస్త్రాలకు పచ్చ రంగు పూసుకొని ఉద్యమిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. PFI సంస్థ భారత దేశానికి వ్యతిరేకంగా సైన్యాన్ని తయరుచేస్తుందని మరికొంతమంది ఈ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. భారత దేశంలో ముస్లిం మరియు క్రైస్తవ ఆధిపత్యం పెరగడానికి బౌద్ధ గురువు అశోకుడు సూచించిన శాంతి మార్గమే కారణమని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత దేశాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని కేరళ ముస్లింలు కార్లకి, భవనాలకి అలాగే, ధరించే వస్త్రాలకు పచ్చ రంగు పూసుకొని ఉద్యమిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం):  పోస్టులో షేర్ చేసిన ఫోటోలలో కనిపిస్తున్న భవనం, కారు అలాగే, పచ్చ రంగు వస్త్రాలు ధరించిన యువకులు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీకి సంబంధించినవారని తెలిసింది. IUML అనేది కేరళ రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ పార్టీ. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ పోస్టులో షేర్ చేసిన వేర్వేరు ఫోటోలకు సంబంధించిన వివరాలని ఒక్కొక్కటిగా తెలుసుకొందాం.

ఫోటో-1:

పోస్టులో షేర్ చేసిన ఫోటో కనీసం 2015 ఫిబ్రవరి నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ ఫోటోలో యువకుల చేతిలో పట్టుకున్నది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ జెండా అని తెలిసింది. IUML అనేది కేరళ రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ పార్టీ. IUML పార్టీ జెండాకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ చూడవచ్చు. IUML కార్యకర్తలు నిర్వహించిన ఈ ర్యాలీకి సంబంధించి మరెటువంటి సమాచారం మాకు లభించలేదు.  

ఫోటో-2:

భారత దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కేరళలో ముస్లిం సైన్యాన్ని తయరుచేస్తుందని ఈ ఫోటోపై తెలిపారు.  పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలతో పోలి ఉన్న ఫోటోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ యూత్ వింగ్ ఫేస్బుక్ పేజీ 15 అక్టోబర్ 2012 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. ‘ముస్లిం యూత్ వింగ్ పచ్చ సైన్యం, ముస్లిం లీగ్ జిందాబాద్’, అని ఈ పోస్టు వివరణలో తెలిపారు. ముస్లిం యూత్ వింగ్ కార్యకర్తలు నిర్వహించిన ఈ పెరేడ్‌కు సంబంధించి IUML పబ్లిష్ చేసిన మరికొన్ని ఫోటోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఈ ఫోటోకి సంబంధించిన మరింత స్పష్టత కోసం ‘The Quint’ న్యూస్ సంస్థ IUML పార్టీ జనరల్ సెక్రటరీ PK ఫెరోజ్‌ని సంప్రదించింది. “ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకులు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వాలంటీర్ వింగ్ సభ్యులు. ఈ యువకులు పార్టీ నిర్వహించే సామాజిక మరియు సహాయ కార్యక్రమాలలో పాల్గొంటారు”, అని PK ఫెరోజ్‌ ‘The Quint’ వార్తా సంస్థకు తెలిపారు.

ఫోటో-3:

ఈ ఫోటోలో పచ్చ రంగు కారుపై ఉన్నది పాకిస్థాన్ జాతీయ జెండా అని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ఈ కారుపై తగిలించినది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ జెండా అని స్పష్టం చేస్తూ ఫ్యాక్ట్ లీ ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ కారుపై MLA అని రాసి ఉండటాన్ని బట్టి, ఇది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ కేరళ శాసనసభ్యుడి కారు అయి ఉండవచ్చని చెప్పవచ్చు. 

ఫోటో-4:

ఈ ఫోటోలో కనిపిస్తున్నది కేరళ వయనాడ్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయమని పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. కాని, ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఈ ఫోటోలో కనిపిస్తున్నది కేరళ కనహాన్గడ్‌లోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ కార్యాలయం అని తెలిసింది. ఈ ఫోటోకి సంబంధించిన పూర్తి స్పష్టతనిస్తూ ఫ్యాక్ట్ లీ ఇదివరకు ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. 

IUML పార్టీ జెండాను పాకిస్థాన్ జాతీయ జెండాగా చిత్రీకరిస్తు తమ పార్టీ పై ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని IUML ‘05 ఏప్రిల్ 2019’న ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ వివరాల ఆధారంగా IUML పార్టీకి సంబంధించిన ఫోటోలని కేరళ ముస్లింలు భారత దేశాన్ని ఇస్లాం దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూన్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

IUML పార్టీ జెండాకు సంబంధించి సోషల్ మీడియాలో షేర్ చేసిన మరికొన్ని అవాస్తవ ప్రచారాలకు సంబంధించి ఫాక్ట్ లీ ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, IUML పార్టీ జెండాకు సంబంధించిన పాత ఫోటోలని కేరళ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) సంస్థ భారత దేశానికి వ్యతిరేకంగా సైన్యాన్ని తయారుచేస్తుందని షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll