Fake News, Telugu
 

రెడ్లు, ముస్లింల ఓట్లు నాకు అవసరం లేదు అని ఈటల రాజేందర్ అనలేదు

0

హుజురాబాద్ లో అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో ‘రెడ్లు, ముస్లింల ఓట్లు నాకు అవసరం లేదు’ అని ఈటల రాజేందర్ అన్నట్టు ప్రచురించిన ఒక వార్తా పత్రిక క్లిప్ ని  షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రెడ్లు, ముస్లింల ఓట్లు నాకు అవసరం లేదు – ఈటల రాజేందర్.

ఫాక్ట్ (నిజం): ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు వార్తా సంస్థలు ఏవీ కూడా రిపోర్ట్ చేయలేదు. ఈ న్యూస్ పేపర్ క్లిప్ పూర్తి వెర్షన్ ప్రకారం ఈ కథనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో 29 జూన్ 2021న ప్రచురించినట్టు ఉంది, కాని నిజానికి  ఆంధ్రజ్యోతి పత్రికలో 29 జూన్ 2021న ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు గాని లేదా ఈ ఫోటో గాని ప్రచురించలేదు. దీన్ని బట్టి ఈ క్లిప్ ని డిజిటల్ గా తయారు చేసినట్టు అర్ధం చేసుకోవచ్చు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు వార్తా సంస్థలు ఏవి కూడా రిపోర్ట్ చేయలేదు. ఒకవేళ ఈటల రాజేందర్ నిజంగానే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే వార్తా పత్రికల్లో వచ్చేది, కాని అటువంటి వార్తా కథనాలేవి మాకు కనిపించలేదు.

పోస్టులో పత్రికా క్లిప్ యొక్క పూర్తీ వెర్షన్ ఒక బ్లాగ్ లో షేర్ చేసారు, ఈ బ్లాగ్ లోని క్లిప్ ప్రకారం, ఈ కథనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో 29 జూన్ 2021న ప్రచురించినట్టు ఉంది, కాని నిజానికి  ఆంధ్రజ్యోతి పత్రికలో 29 జూన్ 2021న ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు గాని లేదా ఈ ఫోటో గాని ప్రచురించలేదు.

ఐతే పోస్టులోని క్లిప్ లో ఉన్న ఫోటో 08 జూన్ 2021న ఈటల రాజేందర్ హుజూరాబాద్ లోని కమలాపూర్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు తీసింది. ఇదే ఫోటోని పలు వార్తా సంస్థలు తమ కథనాలలో ప్రచురించాయి, ఈ కథనాలు ఇక్కడ  మరియు ఇక్కడ చూడొచ్చు, ఐతే ఈ ప్రెస్ మీట్ లో ఈటల రాజేందర్ పోస్టులో చెప్పిన వ్యాఖ్యలు చేసినట్టు ఈ కథనాలలో ఎక్కడ కూడా రాయలేదు. ఆ రోజు కమలాపూర్ లో జరిగిన ఈటల రాజేందర్ పర్యటన సంబంధించిన వార్తా కథనాలలో (ఇక్కడ మరియు ఇక్కడ) కూడా ఆయన ఇలా అన్నట్టు రాయలేదు.

ఈ ప్రెస్ మీట్ కి సంబంధించిన వీడియో ఇక్కడ చూడొచ్చు, ఈ వీడియోలో ఎక్కడ కూడా ఈటల రాజేందర్ పోస్టులో చెప్పిన వ్యాఖ్యలు చేయలేదు. దీన్నిబట్టి, కమలాపూర్ లో ప్రెస్ తో మాట్లాడినప్పటి ఫోటోని ఆధారంగా పోస్టులోని క్లిప్ ని డిజిటల్ గా మార్ఫ్ చేసి తయారు చేసినట్టు అర్ధం చేసుకోవచ్చు. ఇలాగే మరొక వార్తా పత్రిక క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఐతే ఈ పేపర్ క్లిప్ లు అన్ని ఫేక్ అని, ప్రజలు ఇవి నమ్మవద్దని ఈటల రాజేందర్ తన ట్విట్టర్ ఎకౌంటులో పోస్టు చేసారు.

చివరగా, రెడ్లు మరియు ముస్లింల ఓట్లు నాకు అవసరం లేదు అని ఈటల రాజేందర్ అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll