Fake News, Telugu
 

బీజేపీ ప్రభుత్వంలో రైతులు, దళితులు, నిరుద్యోగ యువత, కూలీలు, బాధలు పడుతున్నారని బాలీవుడ్ నటుడు నానా పటేకర్ వ్యాఖ్యానించినట్టు ఆధారాలు లేవు

0

మొత్తానికి బీజేపీకి ఎవరు ఓటేస్తున్నారు? రైతులు అల్లాడుతున్నారు, దళితులు ఆందోళన, నిరుద్యోగ యువత ఆందోళన, కూలీలు, విద్యార్థులు అసంతృప్తి, జీఎస్టీ కారణంగా అల్లాడిపోయారు”, అని బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఇటీవల బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బీజేపీ ప్రభుత్వంలో రైతులు, దళితులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న బాధలను, జీఎస్టీ వల్ల ప్రజలకు జరిగిన నష్టాన్ని గురుంచి చెప్తూ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ చేసిన వ్యాఖ్యలు.

ఫాక్ట్ (నిజం): బాలీవుడ్ నటుడు నానా పటేకర్ బీజేపీకి వ్యతిరేకంగా ఇటువంటి వ్యాఖ్యలేవీ మీడియా ఇంటర్వ్యూలలో గాని, తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో గాని చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.     

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించి కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, బీజేపీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటుడు నానా పటేకర్ అటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఇంటర్నెట్లో మాకు ఎటువంటి సమాచారం దొరకలేదు. ఒకవేళ నానా పటేకర్ బీజేపీకి వ్యతిరేకంగా ఇటీవల అటువంటి వ్యాఖ్యలు చేసివుంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసేవి.

బీజేపీ ప్రభుత్వంలో దేశంలో రైతులు, దళితులు, నిరుద్యోగ యువత బాధలు ఎదుర్కొంటున్నారని, జీఎస్టీ వల్ల ప్రజలు నష్టపోతున్నారని నానా పటేకర్ తన అధికార సోషల్ మీడియా పేజీలలో ఎటువంటి ట్వీట్ లేదా పోస్ట్ పెట్టలేదు.

2018లో రైతులు ఎదురుకుంటున్న కష్టాలను లేవనెత్తుతూ అలాగే, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో కాంగ్రెస్ ముఖ్యపాత్ర పోషించిందని నానా పటేకర్ వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులు ఎదురుకుంటున్న కష్టాల గురించి నానా పటేకర్ పలు సార్లు మీడియా దగ్గర ప్రస్తావించారు.  

నానా పటేకర్ పేరుతో రూపొందించిన పలు ఫేక్ ట్విట్టర్ అక్కౌంట్లు దేశంలో నిరుద్యోగం, రైతులు ఎదురుకుంటున్న కష్టాలను ఉద్దేశిస్తూ మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఇదివరకు, నానా పటేకర్ పేరుతో ఉన్న ఫేక్ ట్విట్టర్ అక్కౌంట్లు పెట్టిన ట్వీట్లకు సంబంధించి పలు ఫాక్ట్-చెక్ సంస్థలు ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి.

బీజేపీ దేశంలో నిరుద్యోగం మరియు ఇతర ప్రధానమైన అంశాలను పట్టించుకోకుండా ప్రజలను డైవర్ట్ చేయడానికి వీర్ సావర్కర్‌ను ఉపయోగిస్తున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత నానా పాటోలె ఇటీవల మీడియాతో పేర్కొన్నారు. అంతేకాదు, వచ్చే ఎన్నికలలో బ్యాలట్లు లేదా ఈవీఎంలలో ఏ పద్దతి ఉపయోగించినా బీజేపీ గెలువలేదని నానా పాటోలె వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ నేత నానా పాటోలె, నానా పటేకర్ కాదు.

చివరగా, బీజేపీ ప్రభుత్వంలో రైతులు, దళితులు, నిరుద్యోగ యువత, కూలీలు బాధలుపడుతున్నారని  బాలీవుడ్ నటుడు నానా పటేకర్ వ్యాఖ్యలు చేసినట్టు ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll