Fake News, Telugu
 

ఉదయపూర్‌లో జరిగిన వివాహిత ప్రేమకథకు సంబంధించిన ఈ ఘటనలో లవ్‌ జిహాద్‌ కోణం లేదు

0

ఇన్ని రోజులు పెళ్లి కాని అమ్మాయిలనే టార్గెట్ చేసిన లవ్ జీహాద్ ఇప్పుడు పెళ్లై పిల్లలున్న ఆడవారిని సైతం టార్గెట్ చేసిందంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. పెళ్ళైన హిందూ మహిళ ముస్లిం వ్యక్తితో వెళ్ళిపోతుండడంతో ఆ మహిళ ఇద్దరు కూతుళ్ళు ఆమెను వెళ్ళొద్దని ఎలా ఏడుస్తున్నారో చుడండి అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. వీడియోలో ఇద్దరు అమ్మాయిలు ఒక మహిళను పట్టుకొని ఎడుస్తుండడం చూడొచ్చు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: పెళ్ళైన హిందూ మహిళ ఒక ముస్లిం వ్యక్తితో వెళ్ళిపోతున్న లవ్ జీహాద్ ఘటనకు సంబంధించిన వీడియో.

ఫాక్ట్(నిజం): పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఈ ఘటనకు సంబంధించి లవ్ జిహాద్ కోణం ఏది లేదు. ఈ ఘటనలో మహిళ మరియు ఆమె ప్రేమించిన వ్యక్తి ఇద్దరు హిందువులే. ఇదే విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. పైగా పోలీసుల కథనం ప్రకారం ప్రస్తుతం ఆ మహిళ తన భర్త మరియు పిల్లలతోనే ఉంటుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం ఈ వీడియోలో చూపిస్తున్న ఘటన రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలోని సాలుంబర్ ప్రాంతంలో జరిగింది.

కథనాల ప్రకారం పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ఒక మహిళ మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది (court marriage). ఆ తరవాత తన మాజీ భర్తతో తమకు ప్రాణహాని ఉందని జిల్లా SPకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు ఆ మహిళ మాజీ భర్తను పిలిపించగా, అతను తన ఇద్దరు కూతుళ్ళతో అక్కడి వచ్చాడు.

ఈ సందర్భంలోనే ఇద్దరు కూతుళ్ళు ఆ మహిళను వెళ్ళిపోవొద్దంటూ ఆమెపై పడి ఏడ్చారు. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది ఈ దృశ్యాలే. ఐతే ఈ కథనాలేవి ఈ ఘటనలో లవ్ జీహాద్ కోణం ఉన్నట్టు రిపోర్ట్ చేయలేదు. ఈ ఘటనను రిపోర్ట్ చేసిన మరి కొన్ని వార్తా కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే ఈ ఘటనకు సంబంధించి వివరాల కోసం FACTLY, సాలుంబర్ CO సుధా పలావత్‌ను సంప్రదించగా, ఈ ఘటనలో లవ్ జిహాద్ కోణం లేదని, ఇద్దరు ఒకే మతానికి చెందినవారని స్పష్టం చేసారు.

Aaj Tak పోలీసులను సంప్రదించి రిపోర్ట్ చేసిన వివరాల ప్రకారం ఆ మహిళ పేరు దీపికా చౌబీసా, మరియు ఆమె ప్రేమించిన వ్యక్తి పేరు లక్కీ చౌదరి, ఇద్దరూ హిందువులే. పైగా ప్రస్తుతం ఆ మహిళ తన భర్త మరియు పిల్లలతో ఉంటుందని స్పష్టం చేసారు. వీటన్నిటిబట్టి, ఘటనకు సంబంధించి పోస్టులో చెప్తున్నది పూర్తిగా అవాస్తవం అని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, ఉదయపూర్‌లో జరిగిన వివాహిత ప్రేమకథకు సంబంధించిన ఈ ఘటనలో లవ్‌ జిహాద్‌ కోణం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll