Fake News, Telugu
 

రిక్షా నడుపుతూ జీవనంసాగిస్తున్న ముస్లిం అబ్బాయిని లక్నో పోలీసులు కొట్టి చంపారు అనే వార్తలో నిజం లేదు; అతను బతికే ఉన్నాడు

0

“రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్న ముస్లిం అబ్బాయిని లక్నో పోలీసులు కొట్టి చంపారు” అంటూ వీడియో  ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, అచేతనంగా ఉన్న యువకుడిని ఒక పోలీసు తన భుజాలపై మోసుకెళ్లడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్న ముస్లిం అబ్బాయిని లక్నో పోలీసులు కొట్టి చంపారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో అపస్మారక స్థితిలో కనిపిస్తున్న యువకుడు చనిపోలేదు, అతను బతికే ఉన్నాడు. 08 మార్చి 2025న లక్నో నగరంలోని మహానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిషాత్‌గంజ్ కూడలి వద్ద ఆక్రమణల నివారణ కార్యక్రమంలో పోలీసులు నూర్ అహ్మద్‌ అనే ఈ-రిక్షా డ్రైవర్‌ను కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయిండని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. లక్నో పోలీసుల దాడిలో ఈ-రిక్షా డ్రైవర్ నూర్ చనిపోయాడని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని, అలాగే ఇప్పటికే 18 మందిపై కేసులు నమోదు చేసినట్లు 09 మార్చి 2025న లక్నో పోలీసుల తెలిపారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నఒక ముస్లిం అబ్బాయిని లక్నో పోలీసులు కొట్టి చంపారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికగా, 08 మార్చి 2025న, లక్నోలో పోలీసుల లాఠీ ఛార్జ్ కారణంగా ఒక ఈ-రిక్షా డ్రైవర్ స్పృహ కోల్పోయాడు అని పలు మీడియా సంస్థలు  ప్రచురించిన పలు వార్తాకథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 08 మార్చి 2025న ఉదయం 11:30 గంటల ప్రాంతంలో లక్నోలోని మహానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిషాత్‌గంజ్ కూడలి వద్ద ఆక్రమణల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆ ప్రాంతాన్ని పోలీసులు ఖాళీ చేస్తుండగా, పోలీసులకు, నూర్ అనే ఈ-రిక్షా డ్రైవర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం పెరగడంతో  పోలీసులు నూర్ అహ్మద్‌ను తీవ్రంగా కొట్టారని, పోలీసులు తీవ్రంగా కొట్టడంతో నూర్ స్పృహ తప్పి పడిపోయిండని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని, దీంతో పోలీసుల చర్యను ఖండిస్తూ ప్రజలు, తోటి డ్రైవర్లు నిరసనకు దిగారు అని ఈ కథనాలు పేర్కొన్నాయి.

10 మార్చి 2025న ‘నవభారత్ టైమ్స్’ ప్రచురించిన వార్తాకథనం ప్రకారం,  08 మార్చి 2025న లక్నో నగరంలోని మహానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిషాత్‌గంజ్ కూడలి వద్ద నూర్ అహ్మద్‌ను అనే ఈ-రిక్షా డ్రైవర్‌ను కొట్టాడనే ఆరోపణలపై కానిస్టేబుల్ జగపాల్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసుల దాడిలో ఈ-రిక్షా డ్రైవర్ చనిపోయాడని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన 18 మందిపై BNS సెక్షన్లు 196, 221, 353(2), 61(2), 352, 7 కింద కేసు నమోదు చేశారు.

లక్నో పోలీసుల దాడిలో నూర్ అనే ఈ-రిక్షా డ్రైవర్ చనిపోయాడని సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ కాగా, 09 మార్చి 2025న లక్నో పోలీసులు తమ అధికారిక X(ట్విట్టర్)లో స్పందిస్తూ, ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని, ఈ-రిక్షా డ్రైవర్ చనిపోయాడని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పోలీసుల లాఠీ ఛార్జ్ కారణంగా స్పృహ కోల్పోయిన ఈ-రిక్షా డ్రైవర్ నూర్ మహ్మద్ కు 10 మార్చి 2025న సమాజ్ వాదీ పార్టీ ఆర్థిక సహాయం అందించింది (ఇక్కడ).

చివరగా, ఈ వీడియోలో అపస్మారక స్థితిలో కనిపిస్తున్న నూర్ అహ్మద్ అనే యువకుడు చనిపోలేదు, అతను బతికే ఉన్నాడు.

Share.

About Author

Comments are closed.

scroll