Fake News, Telugu
 

ఎడిట్ చేసిన వీడియోని హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేయొద్దని కౌశిక్ రెడ్డి చెప్తున్నట్టు షేర్ చేస్తున్నారు

0

టీఆర్ఎస్ పార్టీలో ఇటీవల చేరిన పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ ప్రాంత ప్రజలను టిఆర్ఎస్ పార్టీకి ఓటేయొద్దని చెప్పినట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. కౌశిక్ రెడ్డి ‘10TV’ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, హుజురాబాద్ ప్రాంత ప్రజలను టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవద్దని, ఈటెల రాజేందర్ గెలుస్తే మన ప్రజలకు, హుజురాబాద్ అభివృద్ధికి లాభమని చెప్పినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.      

క్లెయిమ్: హుజురాబాద్ ప్రాంత ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయోద్దని కౌశిక్ రెడ్డి ‘10TV’ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. కౌశిక్ రెడ్డి ‘10TV’ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, హుజురాబాద్ ప్రాంత ప్రజలను టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెల్పించాలని కోరారు. వచ్చే రెండు సంవత్సరాలలో ఒకవేళ హుజురాబాద్‌ని అభివృద్ధి చేయకుంటే, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేయొద్దని కౌశిక్ రెడ్డి తెలిపారు. 2021లో జరుగబోయే హుజురాబాద్‌లో అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేయొద్దని కౌశిక్ రెడ్డి ఎక్కడా చెప్పలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం ‘10TV’ న్యూస్ సంస్థ యూట్యూబ్ ఛానల్లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘10TV’ న్యూస్ సంస్థ 21 జూలై 2021 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలోని 2:45 నిమిషాల దగ్గర కౌశిక్ రెడ్డి, “ఈ ఒక్క సారి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెల్పించండి. రెండు సంవత్సరాలలో మేము హుజురాబాద్‌ని అభివృద్ధి చేయకుంటే, 2023 ఎన్నికలలో హుజురాబాద్ ప్రాంతంలో మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకండి. రాజేందర్ గెలుస్తే రాజేందర్‌కి లాభం అదే, టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మన ప్రజలకు లాభం, హుజురాబాద్ అభివృద్ధికి లాభం.”, అని తెలిపారు. పోస్టులో షేర్ చేసిన వీడియోని, కౌశిక్ రెడ్డి ‘10TV’ ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యాఖ్యలని ఎడిట్ చేస్తూ రూపొందించారు.

హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కౌశిక్ రెడ్డి ‘10TV’ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూ వీడియోని ఇక్కడ చూడవచ్చు. కౌశిక్ రెడ్డి ‘TV5’ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా, రెండు సంవత్సరాలలో హుజురాబాద్‌ని అభివృద్ధి చేయకుంటే, 2023 ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకూడదని ప్రజలకు తెలిపారు. కాని, 2021లో జరుగబోయే హుజురాబాద్‌లో అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేయొద్దని కౌశిక్ రెడ్డి ఎక్కడా చెప్పలేదు. కౌశిక్ రెడ్డి ఒకవేళ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు న్యూస్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. కాని, ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఇంటర్నెట్‌లో ఎటువంటి వార్తలు లేవు.

చివరగా, ఎడిట్ చేసిన వీడియోని హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేయొద్దని కౌశిక్ రెడ్డి చెప్తున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll