Fake News, Telugu
 

కారు అద్దంపై కోడిగుడ్లు పడ్డాక, వైపర్, నీటితో శుభ్రం చేయాలని ప్రయత్నిస్తే నల్లటి పొర ఏర్పడదు

0

రాత్రి సమయంలో కారు నడిపేటప్పుడు కారు అద్దంపై కోడిగుడ్లు పడితే కారు ఆపవద్దు. అంతేకాక, వైపర్ ఆన్ చేసి నీటితో కారు అద్దం శుభ్రం చేయాలని ప్రయత్నించవొద్దు. అలా ప్రయత్నిస్తే కోడిగుడ్డులోని రసాయనాలు నీటితో కలిసి అద్దంపై నల్లటి పొర ఏర్పడుతుంది. అంతా చీకటిగా తయారయి బయట ఏమీ కనపడదు. కారు ఆపవలసి వస్తుంది. అప్పుడు దోపిడీ దొంగలు దాడి చేస్తారు’, అని తెలంగాణ పోలీసులు హెచ్చరికలు జారీ చేసారని చెప్తూ, ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కారు నడిపేటప్పుడు అద్దంపై కోడిగుడ్లు పడితే కారు ఆపవద్దు, వైపర్ మరియు నీటితో శుభ్రం చేయాలని ప్రయత్నిస్తే కనపడకుండా అంతా చీకటిగా అవుతుందని హెచ్చరికలు జారీ చేసిన తెలంగాణ పోలీసులు.

ఫాక్ట్: పోస్ట్‌లోని హెచ్చరికను తెలంగాణ పోలీసులు జారీ చేసినట్టు ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారం లభించలేదు. వివిధ దేశాల్లో ఇలాంటి పోస్ట్‌ కనీసం 2009 నుండి షేర్ అవుతున్నట్టు తెలిసింది. కారు అద్దంపై కోడిగుడ్లు పడ్డాక, వైపర్ ఇంకా నీటితో కారు అద్దం శుభ్రం చేయాలని ప్రయత్నించినప్పుడు పోస్ట్‌లో చెప్పినట్టు కనపడకుండా అంతా చీకటిగా అవదు, నల్లటి పొర ఏర్పడదు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇలాంటి తెలుగు పోస్ట్‌ కనీసం 2017 నుండి ఇంటర్నెట్‌లో షేర్ అవుతున్నట్టు తెలిసింది. అంతేకాదు, 2017లో ‘ఆంధ్రజ్యోతి’ మరియు 2018లో ‘జీ న్యూస్’ వారు ఈ విషయం పై ఆర్టికల్స్ రాసినట్టు తెలిసింది. అయితే, పోస్ట్‌లోని హెచ్చరికను తెలంగాణ పోలీసులు జారీ చేసినట్టు ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారం లభించలేదు. ఈ విషయం గురించి తెలంగాణ పోలీసులకు FACTLY మెసేజ్ చేసింది. వారి నుండి సమాధానం వచ్చిన తర్వాత ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

వివిధ దేశాల్లో ఇలాంటి పోస్ట్‌ కనీసం 2009 నుండి షేర్ అవుతున్నట్టు తెలిసింది. పోస్ట్‌లో చెప్పింది తప్పు అంటూ ‘స్నోప్స్’ సంస్థ 2009లో ప్రచురించిన అర్టికల్‌ని ఇక్కడ చదవొచ్చు. కారు అద్దంపై కోడిగుడ్లు పడితే, వైపర్ మరియు నీటితో కారు అద్దం శుభ్రం చేయాలని ప్రయత్నించినప్పుడు పోస్ట్‌లో చెప్పినట్టు కనపడకుండా అంతా చీకటిగా అవదు అని, నల్లటి పొర ఏర్పడదని తెలిసింది.

అంతేకాదు, కారు అద్దంపై కోడిగుడ్లు పడ్డాక వైపర్ ఇంకా నీటిని ఉపయోగిస్తే, కనపడకుండా ఏమీ అవదని స్వయంగా చేసి చూపించిన ‘Nexus Auto’ అనే యూట్యూబ్ ఛానల్ వారి వీడియోని ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, పోస్ట్‌లోని హెచ్చరికను తెలంగాణ పోలీసులు జారీ చేసినట్టు ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారం లభించలేదు. అంతేకాదు, కారు అద్దంపై కోడిగుడ్లు పడ్డాక, వైపర్ ఇంకా నీటితో శుభ్రం చేయాలని ప్రయత్నిస్తే కనపడకుండా అంతా చీకటిగా అవదు, నల్లటి పొర ఏర్పడదు.

Share.

About Author

Comments are closed.

scroll