2017లో డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరైన ప్రజల ఫోటోని ఇప్పటి జో బైడెన్ ప్రమాణస్వీకారానికి హాజరైన ప్రజల ఫోటోతో పోలుస్తూ జో బైడెన్ ఎన్నికపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి చాలా మంది ప్రజల హాజరుకాగా, జో బైడెన్ ప్రమాణస్వీకారానికి ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరుకాలేదు.
ఫాక్ట్ (నిజం): కోవిడ్-19 యొక్క ప్రత్యేక పరిస్థితుల మేరకు జో బైడెన్ ప్రమాణస్వీకారానికి ఎక్కువమందిని అనుమతించకూడదని అమెరికన్ సెనెట్ యొక్క Joint Congressional Committee on Inaugural Ceremonies తీర్మానించింది. అందువల్లనే ఈ సారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎక్కువ మంది ప్రజలు హాజరుకాలేదు. కరోనా కారణంగా ఈసారి జో బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించట్లేదని తెలుపుతూ చాలా వార్తా కథనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వార్తకి సంబంధించి సమాచారం కోసం గూగుల్ లో వెతకగా పోస్టులో షేర్ అవుతున్న ఫోటోలు జో బైడెన్ మరియు ట్రంప్ ప్రమాణస్వీకారానికి చెందినవేనని తెలిసింది. ఐతే అమెరికన్ సెనెట్ యొక్క Joint Congressional Committee on Inaugural Ceremonies మెడికల్ నిపుణులను సంప్రదించి కోవిడ్-19 యొక్క ప్రత్యేక పరిస్థితుల మేరకు జో బైడెన్ ప్రమాణస్వీకారానికి ఎక్కువమందిని అనుమతించకూడదని తీర్మానించింది. సాధారణంగా అమెరికన్ కాంగ్రెస్ సభ్యులకు 2,00,000 టికెట్లను నియోజకవర్గాలలో పంపిణి చేయడానికి ఇస్తారు. కాని ఈ సంవత్సరం కార్యక్రమానికి హాజరయ్యే జనాల సంఖ్యని తగ్గించడానికి ఒక్కొకరికి తమతో పాటు ఇంకోక్కరిని మాత్రమే అనుమతించారు.
కోవిడ్-19 కారణంగా ఈ సారి జో బైడెన్ ప్రమాణస్వీకారానికి ఎక్కువమందిని అనుమతించట్లేదని తెలుపుతూ వాషింగ్టన్ పోస్ట్ మరియు అల్ జజీరా వార్తా కథనాలు ప్రచురించాయి. వీటన్నిటి బట్టి ఈ సంవత్సరం కోవిడ్-19ని దృష్టిలో ఉంచుకొని జో బైడెన్ ప్రమాణస్వికారానికి కావాలనే తక్కువమందిని అనుమతించారని చెప్పొచ్చు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై వైరల్ అయిన ఫేక్ న్యూస్ ని డీబంక్ చేస్తూ FACTLY రాసిన కథనాలు ఇక్కడ చూడొచ్చు.
చాలా అనుకోని సంఘటనల తరవాత అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
చివరగా, కోవిడ్-19ని దృష్టిలో ఉంచుకొని జో బైడెన్ ప్రమాణస్వీకారానికి కావాలనే తక్కువమందిని అనుమతించారు.