Fake News, Telugu
 

కర్ణాటకలో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులు ఖాళీ స్తంభంపై కాషాయ జెండాని ఎగురవేశారు; జాతీయ జెండా స్థానంలో కాదు

0

కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో హిజాబ్ అనుకూల, వ్యతిరేక నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జరిగిన నిరసనలలో భాగంగా కొందరు విద్యార్థులు జాతీయ జెండాని తీసేసి దాని స్థానంలో కాషాయ జెండా ఎగురవేసినట్టు చెప్తూ, దీనికి సంబంధించి ఒక వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ ఘటనకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటకలో విద్యార్థులు జాతీయ జెండా తీసేసి దాని స్థానంలో కాషాయ జెండా ఎగురవేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): శివమొగ్గలోని గవర్నమెంట్ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులు ఖాళీ స్తంభంపై కాషాయ జెండాని ఎగురవేశారు. విద్యార్థులు జాతీయ జెండాని తొలగించలేదు. ఇదే విషయం జిల్లా ఎస్పీ మరియు కాలేజీ ప్రిన్సిపాల్ స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

కర్ణాటకలోని పలు ప్రాంతాలలో హిజాబ్ అనుకూల, వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శివమొగ్గ, బాపూజీ నగర్‌లోని గవర్నమెంట్ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయ కండువా ధరించి నిరసన తెలుపుతున్న విద్యార్థులు కాషాయ జెండా ఎగురవేశారు.

ఐతే ఈ ఘటనను కొన్ని వార్తా సంస్థలు ‘విద్యార్థులు జాతీయ జెండా తీసేసి, దాని స్థానంలో కాషాయ జెండాని ఎగురవేసినట్టు’ రిపోర్ట్ చేసాయి.ఇలాంటి రిపోర్టుల వల్ల సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయ్యుండొచ్చు.

ఐతే శివమొగ్గ ఎస్పీ బీఎం లక్ష్మీప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. స్తంభంపై జాతీయ జెండా లేదని, విద్యార్థులు కాషాయ జెండాని ఖాళీ స్తంభంపై ఎగరేసారని, తరువాత వారు దానిని స్వయంగా తొలగించారని ఆయన అన్నారు.

పలువురు జర్నలిస్టులు కాలేజీ ప్రిన్సిపాల్‌ను సంప్రదించి, విద్యార్థులు కాషాయ జెండాని ఖాళీ స్తంభంపై ఎగురవేశారని స్పష్టం చేసారు. అలాగే స్తంభంపై జాతీయ జెండాని 26 జనవరి రోజునే తొలగించినట్టు ప్రిన్సిపాల్ స్పష్టం చేసినట్టు రిపోర్ట్ చేసారు. ఇండియా టుడే కూడా మొదట విద్యార్థులు జాతీయ జెండా తీసేసి కాషాయ జెండాని ఎగురవేసినట్టు రిపోర్ట్  చేయగా, ఆ తరవాత అలాంటిదేమీ లేదని, ఖాళీ స్తంభంపైనే కాషాయ జెండా ఎగరేసారని రిపోర్ట్ చేసింది.

పలు ఫాక్ట్-చెకింగ్ సంస్థలు (ఇక్కడ మరియు ఇక్కడ) కాలేజీ ప్రిన్సిపాల్ మరియు లోకల్ జర్నలిస్టులను సంప్రదించిగా, వారు కూడా నిరసన చేస్తున్న విద్యార్థులు ఖాళీ స్థంభంపైనే కాషాయ జెండాని ఎగురవేసినట్టు స్పష్టం చేసారు.

ఘటనా స్థలంలో ఉన్నవారు చెప్తున్నదాని ప్రకారం విద్యార్థులు ఖాళీ స్థంభంపైనే కాషాయ జెండాని ఎగురవేసినట్టు కొన్ని వార్తా కథనాలు ప్రచురించాయి. వీటన్నిటిబట్టి పోస్టులో చెప్తునట్టు విద్యార్థులు జాతీయ జెండా తొలగించి దాని స్థానంలో కాషాయ జెండా ఎగురవేశారన్న వాదన తప్పని స్పష్టమవుతుంది.

చివరగా, కర్ణాటకలో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులు ఖాళీ స్తంభంపై కాషాయ జెండాని ఎగురవేశారు, జాతీయ జెండా స్థానంలో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll