Fact Check, Fake News, Telugu
 

2022-23 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన కేటాయింపులంటూ షేర్ చేస్తున్న ఈ గణాంకాలకు ఆధారాలు లేవు

0

ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు 36 వేల కోట్లు కేటాయించిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బడ్జెట్‌లో తెలంగాణకు ఏ రూపంలో ఎంత కేటాయించారనేది కూడా ప్రస్తావించారు, ఉదాహరణకి, తెలంగాణకు జీఎస్‌టీ పరిహారం కింద రూ. 2379 కోట్లు, కేంద్ర పన్నుల వాటా కింద రూ. 17,165 కోట్లు మొదలైన వివిధ రూపాలలో కేటాయించినట్టు పేర్కొన్నారు. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్న దాంట్లో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్‌లో జీఎస్‌టీ పరిహారం, కేంద్ర పన్నుల వాటా, విపత్తుల నిర్వహణ సహాయం మొదలైన రూపాలలో తెలంగాణకు 36 వేల కోట్లు కేటాయించింది.

ఫాక్ట్ (నిజం): 2022-23 బడ్జెట్‌లో జీఎస్‌టీ పరిహారం, కేంద్ర పన్నుల వాటా, విపత్తుల నిర్వహణ సహాయం మొదలైన అంశాలకు సంబంధించి నికరంగా అన్ని రాష్ట్రాలకు కలిపి ఎంత ఖర్చు చేయబోతున్నారో పేర్కొన్నారే తప్ప, తెలంగాణ రాష్ట్రానికి వివిధ రూపాలలో ఇంత ఖర్చు చేయబోతున్నట్టు పేర్కొనలేదు. ఐతే ఈ నిధులు రాష్ట్రాలకు చెందాల్సిన హక్కులలో భాగంగానే వస్తాయి. రాజ్యాంగం ద్వారా లేదా పార్లమెంట్‌లో చేసిన చట్టాల ద్వారా రాష్ట్రాలకు ఈ నిధులలో వాటా ఉంటుంది. ఈ కేటాయింపులలో ప్రత్యేకత ఏమి లేదు. ప్రతీ ఏడాది కేంద్రం ఈ నిధులు రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే. పోస్టులో పేర్కొన్న మిగతా అంశాలకు సంబంధించి బడ్జెట్‌లో నికరంగా అన్ని రాష్ట్రాలకు కలిపి కేటాయింపులు జరిగాయి కాని ప్రత్యేకంగా రాష్ట్రాల వారి కేటాయింపులు జరపలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

సాధారణంగా కేంద్ర ప్రభుత్వం తమకు వివిధ రూపాలలో వచ్చే ఆదాయం( రెవెన్యూలో) రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తుంటుంది. కేంద్ర పన్నులలో వాటా, సెంట్రల్ స్కీంలకి సంబంధించిన నిధులు, గ్రాంట్లు, లోన్స్ మొదలైన రూపాలలో కేంద్ర ప్రభుత్వం తమ రెవెన్యూ నుండి రాష్ట్రాలకు నిధులు బదలాయిస్తుంటుంది. ఐతే రాజ్యాంగం ద్వారా లేదా పార్లమెంట్‌లో చేసిన చట్టాల ద్వారా రాష్ట్రాలకు ఈ నిధులలో వాటా ఉంటుంది. ఈ నిధులు రాష్ట్రాలకు రాజ్యాంగబద్దంగా సంక్రమించిన హక్కుగా భావించాల్సి ఉంటుంది. ఈ కేటాయింపులలో ప్రత్యేకత ఏమి లేదు, ప్రతీ ఏడాది కేంద్రం ఈ నిధులు రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే. ప్రతీ సంవత్సరం కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి జీతాలు, పెన్షన్లు మొదలైన వాటికి ఎలాగైతే ఖర్చు చేస్తారో, అలాగే రాష్ట్రాలకు ఇలా నిధులు కేటాయిస్తుంటుంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ నిధులు రాష్ట్రాలకు వస్తుంటాయి. అయితే, వాటిలో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు.

ప్రతీ సంవత్సరం తమ రెవెన్యూ నుండి రాష్ట్రాలకు ఇచ్చే వాటా కాకుండా, రాష్ట్రాలలో మౌలిక సదుపాయాల కల్పనకు, పలు స్కీంల అమలు, వివిధ అభివృద్ధి ప్రాజెక్ట్లు మొదలైన వాటి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రత్యేకంగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులు తమ రెవెన్యూ నుండి కాకుండా కాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ కింద కొన్ని సార్లు కేటాయిస్తుంది. ఇలా ఏదైనా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధి ప్రాజెక్ట్‌ల కోసం కాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ కింద నిధులు కేటాయిస్తే, అప్పుడు దానిని ఆ రాష్ట్రానికి బడ్జెట్‌లో చేసిన కేటాయింపుగా పరిగనించొచ్చు. అంతేకాని ప్రతీ సంవత్సరం తమ హక్కులో భాగంగా కేంద్రం నుండి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాని, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు ప్రకారం వచ్చే నిధులను బడ్జెట్‌లో కేటాయింపులుగా పరిగణించలేము.

పోస్టులో తెలంగాణకు వివిధ రూపాలలో (జీఎస్‌టీ పరిహారం, కేంద్ర పన్నులలో వాటా, మొదలైన) కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించిందన్న విషయానికి సంబంధించి కింద వివరంగా చూద్దాం.

జీఎస్‌టీ పరిహారం :

2017లో 101వ రాజ్యాంగ సవరణ చేస్తూ వస్తూ సేవల పన్నుల (GST) చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఐతే ఈ చట్టం అమలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోయే ఆదాయాన్ని ఐదు సంవత్సరాల వరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని, ఇందుకు గాను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారాన్ని చెల్లిస్తుందని పేర్కొంటూ చట్టంలో ఒక నిబంధనను పొందుపరచారు.

ఇందులో భాగంగానే ప్రతీ సంవత్సరం బడ్జెట్‌లో రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారాన్ని కేటాయిస్తూ వస్తుంది. వస్తు సేవల పన్ను అనేది ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కాబట్టి దాన్ని రెవెన్యూ రసీదుల కింద మరియు రాష్ట్రాలకు పరిహారాన్ని రెవెన్యూ వ్యయం కింద చూపిస్తారు. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, జీఎస్‌టీ పరిహారం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క రాజ్యాంగ బాధ్యత. ఒకవేళ వస్తు సేవల పన్నుల (GST) చట్టం ప్రవేశపెట్టక పోయి ఉంటే ఆ ఆదాయం రాష్ట్రాలకే చెంది ఉండేవి, కాబట్టి ఇవి రాష్ట్రాలకు ప్రత్యేకంగా కేటాయించినవి కావు.

కేంద్ర పన్నులలో వాటా:

రాష్ట్రాల మధ్య అసమానతలు తొలగించేందుకు కేంద్ర నుండి రాష్ట్రాలకు వనరులను బదిలీ చేసేలా భారత రాజ్యాంగం కొన్ని సదుపాయాలను పొందపరిచింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు వనరులు బదిలీ చేసే పద్దతులను కూడా రాజ్యాంగంలో ప్రస్తావించారు. ఐతే ఈ వనరులను ఏ పద్ధతిలో, ఏ రూపంలో చేయాలనే ప్రతిపాదనలు సూచించేందుకు ఆర్టికల్ 280 కింద ఫైనాన్స్ కమిషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఇది ఒక రాజ్యాంగ బద్దమైన సంస్థ. రాష్ట్రపతి ప్రతీ ఐదు సంవత్సరాల కొకసారి దీనిని ఏర్పాటు చేస్తారు. రాష్ట్రాలకు వనరులను బదిలీ చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత.

ఫైనాన్స్ కమిషన్ ప్రతిపాదనలు, సిఫార్సులు తప్పనిసరి అమలు చేయాల్సిన అవసరం లేనప్పటికీ, సాధారణంగా చాలా వరకు ప్రతిపాదనలను పూర్తి స్థాయిలో లేదా కొన్ని సవరణలతో ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర బడ్జెట్‌లో కేంద్రం పన్నుల వాటా అంటూ ఒక పద్దు ఉంటుంది, కాని ఇది ప్రత్యేకమైన కేటాయింపు కాదు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా రాష్ట్రాలకు పన్నులలో వాటా ఇవ్వాల్సిందే.

విపత్తుల నిర్వహణ సహయం:

2005లో చేసిన విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 48 (1) కింద విపత్తు నిర్వహణ కోసం  సాధారణ రాష్ట్రల వద్ద అందుబాటులో ఉండే స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF)లో 75% కేంద్రం కేటాయించాలి, మిగతా 25% రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తాయి. అదే స్పెషల్ క్యాటేగిరి రాష్ట్రాలకు 90% కేంద్రం కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వాలు 10% రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తాయి.

ఈ చట్టం ప్రకారం ప్రతీ సంవత్సరం విపత్తు నిర్వహణ కోసం రాష్ట్రలకు నిధులు కేటాయిస్తారు. ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వాల హక్కు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు నిధులు అందించడం కేంద్రం యొక్క బాధ్యత.

గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధులు:

1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో గ్రామ పంచాయతీలకు నిధులు అందిస్తుంది. ఐతే పంచాయతీలకు గ్రాంట్లు అందించడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, చట్టం ద్వారా రాజ్యాంగంలో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.

అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ ప్రతిపాదనల మేరకు మున్సిపాలిటీలకు వివిధ పనులకు గ్రాంట్ల రూపంలో నిధులు అందిస్తుంది. ఐతే కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు కచ్చితంగా గ్రాంట్లు ఇవ్వాలనే బాధ్యత ఏమి లేదు.

ఇకపోతే పైన పేర్కొన్న జీఎస్‌టీ పరిహారం, విపత్తుల నిర్వహణ సహయం మొదలైన విషయాలకు సంబంధించి 2022-23 బడ్జెట్‌లో అన్ని రాష్ట్రాలకు కలిపి నికరంగా ఎంత ఖర్చు చేయబోతున్నారో పేర్కొన్నారే తప్ప ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించారో పేర్కొనలేదు. కాబట్టి పోస్టులో చెప్తునట్టు తెలంగాణకి ఒక్కో రూపంలో ఇంత కేటాయించారనడానికి ఆధారాలు లేవు. పోస్టులో ప్రస్తావించిన మిగతా అంశాల గురించి కింద చూద్దాం.

ట్రైబల్ యూనివర్సిటీలకు 40 కోట్లు:

2014లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విడిపోయే సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో  పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు 2022-23 బడ్జెట్‌లో 40 కోట్ల రూపాయలను కేటాయించారు. ఐతే బడ్జెట్‌లో రెండు రాష్ట్రాలకు కలిపి ఈ మొత్తాన్ని కేటాయించగా, ఏ రాష్ట్రానికి ఎంత అనే విషయం స్పష్టం చేయలేదు.

అగ్రికల్చర్ పెర్ఫార్మన్స్ ఇన్సెంటివ్:

ఇటీవల ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించి అగ్రికల్చర్ పెర్ఫార్మన్స్ ఇన్సెంటివ్ కింద నిధులు కేటాయించినట్టు ఎటువంటి సమాచారం లేదు. కాబట్టి అగ్రికల్చర్ పెర్ఫార్మన్స్ ఇన్సెంటివ్ కింద నిధులు కేటాయించారన్న వాదనలో నిజం లేదు.

మెట్రో సిటీ హైదరాబాద్‌కు ప్రత్యేక కేటాయింపు:

హైదరాబాద్‌లోని పలు కేంద్ర విద్యా సంస్థలకు బడ్జెట్‌లో కొంత నిధులు కేటాయించారు. దేశంలోని పలు నగరాలలోని మెట్రో ట్రైన్‌కి సంబంధించి కేటాయింపులు జరిగిన, హైదరాబాద్ మెట్రోకి మాత్రం ఎటువంటి కేటాయింపులు జరగలేదు.

స్టేట్ స్పెసిఫిక్ హెల్త్ గ్రాంట్:

బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి గ్రాంట్స్ రూపం నిధులు కేటాయించినప్పటికీ, ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించారన్నది పేర్కొనలేదు. కాబట్టి తెలంగాణ 891 కోట్ల గ్రాంట్లు కేటాయించారన్న దానికి ఆధారాలు లేవు.

కేంద్ర ప్రాయోజిత పథకాలు (CSS):

2022-23 బడ్జెట్‌లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి పలు పథకాల కింద అన్ని రాష్ట్రాలకు కలిపి నికరంగా ఎంత ఖర్చు చేయబోతున్నారో పేర్కొన్నారే తప్ప తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి ఇంత ఖర్చు చేయబోతున్నట్టు పేర్కొనలేదు. కాబట్టి పోస్టు చేస్తున్న వాదనకి ఆధారాలు లేవు.

చివరగా, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన కేటాయింపులంటూ షేర్ చేస్తున్న ఈ గణాంకాలకు సరైన ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll