Fake News, Telugu
 

భారత సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఈ నిధిలోని విరాళాలు ఖర్చు చేయరు

0

ఆర్మీ వెల్ఫేర్ ఖాతాకు ప్రజలు నేరుగా నిధులను విరాళంగా ఇవ్వగలిగే బ్యాంకు ఖాతాను మోదీ ప్రభుత్వం తెరిచింది. ఇది భారత సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేయడానికి మరియు యుద్ధ ప్రమాదాలకు సౌకర్యాలు కల్పించడానికి ఉపయోగపడుతుంది అని ఒక పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: భారత సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేయడానికి మోదీ ప్రభుత్వం ఈ బ్యాంకు ఖాతాను తెరిచింది.

ఫాక్ట్: ఇండియన్ ఆర్మీ, భారత ప్రభుత్వం/ రక్షణ మంత్రిత్వ శాఖ తరఫున సాయుధ దళాల యుద్ధ క్షతగాత్రుల సంక్షేమ నిధి (Armed Forces Battle Casualties Welfare Fund) పేరుతో ఒక ఖాతాను నడుపుతుంది. ఈ నిధిలో అందుకున్న విరాళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యొక్క బాటిల్ క్యాజువాలిటీస్ (యుద్ధ క్షతగాత్రులు), వారి తక్షణ బంధువులు మరియు డిపెండెంట్లకు ఆర్ధిక సహాయం చెల్లించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. భారత సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఈ నిధులు ఖర్చు చేయరు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పొస్ట్‌లో ఉన్న “Armed Forces Battle Casualties Welfare Fund” గురించి వెతికినప్పుడు ఇండియన్ ఆర్మీ వెబ్సైటులో సమాచారం లభించింది. ‘ఇండియన్ ఆర్మీ, భారత ప్రభుత్వం/ రక్షణ మంత్రిత్వ శాఖ తరఫున సాయుధ దళాల యుద్ధ క్షతగాత్రుల సంక్షేమ నిధి (Armed Forces Battle Casualties Welfare Fund) పేరుతో ఒక ఖాతాను నడుపుతుంది; ఇది ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళంలోని యుద్ధ క్షతగాత్రుల కుటుంబాలకు విరాళాన్ని స్వీకరిస్తుంది. ఈ నిధిలో అందుకున్న విరాళాలు ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ యొక్క బాటిల్ క్యాజువాలిటీస్, వారి తదుపరి బంధువులు మరియు డిపెండెంట్లకు ఆర్ధిక సహాయం చెల్లించడానికి ఉపయోగించబడతాయి.’ అని అందులో తెలిపారు. కానీ, భారత సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేయడానికి తెరిచిన బ్యాంకు ఖాతా అని ఇందులో లేదు.

అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ – ఇండియన్ ఆర్మీ, వారి ట్విట్టర్ పోస్ట్ ద్వారా, ‘Armed Forces Battle Casualties Welfare Fund’ గురించి వస్తున్న సోషల్ మీడియా రిపోర్ట్స్ తప్పు అని చెప్పారు. భారత సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఈ ఖాతాను తెరిచినట్టు వస్తున్న రిపోర్టులో నిజంలేదని స్పష్టం చేసారు.

సియాచిన్ లో ఫిబ్రవరి 2016లో జరిగిన సంఘటన తరువాత యుద్ధ క్షతగాత్రుల కుటుంబాలకు సహాయం అందించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ముందుకు వచ్చిన తరువాత రక్షణ మంత్రిత్వ శాఖ మాజీ సైనికసంక్షేమ విభాగం (ఈ ఎస్ డబ్ల్యు) కింద Armed Forces Battle Casualties Welfare Fund ఏర్పాటు చేయబడింది. ఈ ఫండ్ నుంచి ఇచ్చే మొత్తం ఇంతముందు ఇచ్చేదానికి అదనంగా ఇస్తారు.

ఈ నిధిని చారిటబుల్ ఎండోమెంట్స్ చట్టం, 1890 కింద రూపొందించారు. డబ్బు డిపాజిట్ చేయడానికి ప్రజల కొరకు న్యూఢిల్లీలోని సిండికేట్ బ్యాంక్ (ప్రస్తుతం కెనరా బ్యాంకు) యొక్క సౌత్ బ్లాక్ బ్రాంచీలో నెంబరు 90552010165915 ఉన్న బ్యాంకు ఖాతా ప్రారంభించబడింది.

మరణించిన సాయుధ దళాల కుటుంబాలకు ఎటువంటి సహాయం అందిస్తున్నారని పార్లమెంట్లో ప్రశ్న అడిగినప్పుడు, Armed Forces Battle Casualties Welfare Fund గురించి కూడా ప్రస్తావించారు. కానీ, ఈ ఫండ్‌ను వేరొక పనికోసం వాడినట్టు ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు.

చివరగా, భారత సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఈ నిధిలోని విరాళాలు ఖర్చు చేయరు.

Share.

About Author

Comments are closed.

scroll