ఇటీవల జరిగిన 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP ఓడిపోయిన విషయం తెలిసిందే. ఐతే ఎన్నికల్లో YSRCP ఓట్లు గల్లంతు అయ్యాయని, బీజేపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ EVMలను ట్యాంపరింగ్ చేసి గెలిచారని అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ వీడియోలో సాంకేతిక నిపుణుడు హరిప్రసాద్ మాట్లాడుతూ EVMలలో ఉన్న లోపాల గురించి వివరించాడు (ఇక్కడ & ఇక్కడ). ఈ వీడియోలో చెప్తున్నదాని ప్రకారంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందంటూ క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వాదనలో నిజమెంతుందో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల జరిగిన 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో EVM ట్యాంపరింగ్ వల్ల YSRCP ఓట్లు గల్లంతు అయ్యాయని సాంకేతిక నిపుణుడు హరిప్రసాద్ వివరిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఇటీవల జరిగిన 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP ఓడిపోయిన తరవాత ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని గానీ లేక ట్యాంపరింగ్ జరిగిందని గానీ ఎవరూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం షేర్ అవుతన్న వీడియో 2019 ఎన్నికలకు సంబంధించింది. ఆ ఎన్నికల సమయంలో EVMల పనితీరుపై ఎన్నికల సంఘంతో జరిగిన భేటీలో TDP తరపున సాంకేతిక నిపుణుడు హరిప్రసాద్ పాల్గొన్నప్పటిది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇటీవల జరిగిన 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP ఓడిపోయిన తరవాత ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని గానీ లేక ట్యాంపరింగ్ జరిగిందని గానీ ఎవరూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయలేదు, ఇలాంటి రిపోర్ట్స్ కూడా ఏవి లేవు. కాగా ప్రస్తుతం షేర్ అవుతన్న వీడియో 2019 ఎన్నికలకు సంబంధించింది.
ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోకు సంబంధించిన సమాచారం కోసం గూగుల్‌లో వెతకగా సాంకేతిక నిపుణుడు హరిప్రసాద్ మీడియాతో మాట్లాడిన ఈ విషయాలను రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం 2019 ఎన్నికల సమయంలో విపక్ష పార్టీలు EVMల పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘంతో చర్చలు జరిపాయి. ఈ క్రమంలో TDP తమ వాదన వినిపించేందుకు హరిప్రసాద్ అనే సాంకేతిక నిపుణుడిని ఈసీ వద్దకు టీడీపీ పంపింది (ఇక్కడ & ఇక్కడ).
ఈ క్రమంలోనే VVPATలో ఓటర్ స్లిప్ 7 సెకన్లు చూపించాల్సి ఉండగా, 3 సెకన్లు మాత్రమే చూపించిందన్న వాదనను హరిప్రసాద్ ఎన్నికల సంఘం ముందు ఉంచారు. ఐతే ఎన్నికల సంఘం ఈ విషయం అతనితో చర్చించబోమని తెలిపింది. ఇదే విషయాన్ని ఆయన మీడియాకు వివరించారు. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో ఆ సందర్భానికి సంబంధించిందే.
ఈ వీడియోలో ఒక సందర్భంలో తాను TDP పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడుతో ఇద్దరం ఎన్నికల సంఘాన్ని కలిసినట్టు చెప్తాడు, దీన్నిబట్టి కూడా ఈ వీడియో ప్రస్తుత ఎన్నికలకు సంబంధించింది కాదని స్పష్టమవుతుంది.
చివరగా, 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP ఓట్లు గల్లంతు అయ్యాయని సంబంధంలేని పాత వీడియోను షేర్ చేస్తున్నారు.