Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోను, జనసేన పార్టీకి ఓటు వేసినందుకు వైసీపీ మద్దతుదారులు ఒక వ్యక్తిని కొడుతున్నట్టు షేర్ చేస్తున్నారు

0

“వైసీపీకి ఓటు వెయ్యకుండా జనసేన పార్టీకి ఓటు వేస్తావారా అంటూ అటవీ ప్రాంతంలో తీసుకెల్లి కిరాతంగ కొట్టి చేతులు విరగొట్టిన YSRCP రౌడీలు” అంటూ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) విస్తృతంగా షేర్ చేయబడుతోంది. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్:  జనసేన పార్టీకి ఓటు వేసినందుకు వైసీపీ మద్దతుదారులు ఒక వ్యక్తిని కొడుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోను NTV ఛానల్ 17 నవంబర్ 2020న ఐపిఎల్ డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో రౌడీలు ఒక యువకుణ్ణి కొడుతున్న వీడియో అని ప్రచురించింది. 18 నవంబర్ 2020న ‘ది న్యూస్ మినిట్’ మరియు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్’ వైరల్ వీడియో యొక్క స్క్రీన్ షార్టును ప్రచురిస్తూ, ఇది బెట్టింగ్ వ్యవహారం వల్ల జరిగిన గొడవ కాదు అని, బాధితుడు యుగందర్, శ్రీకాంత్ యొక్క ఇన్నోవా కారు ఆక్సిడెంట్ చేసి అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో శ్రీకాంత్ తన స్నేహితులతో అతన్ని కొట్టించాడు అని తెలిపాయి. ఈ వీడియో గురించి రెండు వేరు వేరు కథనాలు ఉన్నప్పటికీ, ఈ వీడియో 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది కాదని, ఈ వీడియో పాతదని ఈ ఆధారాలను బట్టి స్పష్టమవుతోంది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే వీడియోను NTV ఛానల్ 17 నవంబర్ 2020న “బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేదని యువకున్ని చితకబాదిన రౌడీలు” అనే శీర్షికతో ప్రచురించడం గమనించాం. రాజశేఖర్ అనే వ్యక్తి రోజుకు ఒకరిని హింసిస్తున్నాడు అని, ఐపిఎల్ డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో రౌడీలు ఒక యువకుణ్ణి కొడుతున్న వీడియో ఇది అని, పైగా దీని గురించి పోలీసులకు పిర్యాదు వెళ్లలేదు అంటూ NTV ప్రచురించింది.

దీని గురించి మరింత వెతికితే, 18 నవంబర్ 2020న ‘ది న్యూస్ మినిట్’ వైరల్ వీడియో యొక్క స్క్రీన్ షార్టును ప్రచురిస్తూ ఈ సంఘటన ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2020కి సంబంధించిన బెట్టింగ్‌లో డబ్బు చెల్లించడంలో విఫలమైనందుకు బాధితులపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడని పలు వార్తా ఛానళ్లు తప్పుగా ప్రసారం చేశాయి అని తెలిపింది. అయితే, ‘ది న్యూస్ మినిట్’ ప్రకారం ఏప్రిల్‌ 2020లో ఈ సంఘటన జరిగినప్పటికీ, నెల్లూరు రూరల్ పోలీసులు నవంబర్ 2020 లో కేసు నమోదు చేశారు. బాధితుడు నెల్లూరు నగరంలోని చంద్రబాబు నగర్‌కు చెందిన 22 ఏళ్ల కావేరిపాకం యుగంధర్. మిల్క్ వ్యాన్ డ్రైవర్ అయిన యుగంధర్ తన యజమాని కుటుంబాన్ని ఒంగోలుకు తీసుకెళ్లేందుకు ఏప్రిల్‌లో శ్రీకాంత్ అనే వ్యక్తి నుంచి ఇన్నోవా కారును అద్దెకు తీసుకున్నాడు. నెల్లూరు ఇరగాలమ్మ గుడి సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. యుగంధర్ మరమ్మతులకు డబ్బు చెల్లించలేకపోవడంతో, శ్రీకాంత్ స్నేహితులు రాజశేఖర్ మరియు కిరణ్ అతన్ని హైవే ప్రదేశానికి తీసుకెళ్లి కర్రలతో కొట్టి గాయపరిచారు. యుగందర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చెయ్యటం జరిగినది అని పోలీసులు తెలిపారు.

‘ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్’ కూడా నెల్లూరు రూరల్ డీఎస్పీ పి.హరనాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, యుగందర్, శ్రీకాంత్ యొక్క ఇన్నోవా కారు ఆక్సిడెంట్ చేసి అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో శ్రీకాంత్ తన స్నేహితులతో అతన్ని కొట్టించాడు అని ప్రచురించింది.

అయితే, ఈ వీడియో గురించి రెండు వేరు వేరు కథనాలు ఉన్నప్పటికీ, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది కాదని, ఇది పాతదని ఈ ఆధారాలను బట్టి స్పష్టమవుతోంది.

చివరిగా, సంబంధం లేని పాత వీడియోను, జనసేన పార్టీకి ఓటు వేసినందుకు వైసీపీ మద్దతుదారులు ఒక వ్యక్తిని కొడుతున్నట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll