Fake News, Telugu
 

భారత్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ మీడియా ముందు ఏడ్చాడన్నది కల్పిత వార్త

0

ఇటీవల టర్కీ, సిరియాలో భూకంపం సంభవించిన నేపథ్యంలో భారత్ ఈ రెండు దేశాలకు సహాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టర్కీ అధ్యక్ష్యుడు ఎర్డోగాన్ భారత్ చేసిన సహాయానికి మీడియా ముందు ఏడ్చాడని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. హిందువులకు, మోదీకు చెడు చేద్దామనుకున్నా మాకు మొదట భారత్ సహాయం చేసిందని, దీనికి సిగ్గుపడుతున్నానంటూ ఎర్డోగాన్ అన్నట్టు ఈ పోస్టులో చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్న దానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: టర్కీ అధ్యక్ష్యుడు ఎర్డోగాన్, భారత్ అందించిన భూకంప సహాయానికి మీడియా ముందు ఏడ్చాడు.

ఫాక్ట్(నిజం): ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో భారత్ టర్కీలో సహాయ కార్యక్రమాన్ని అందిస్తూ ఉంది. ఐతే భారత సహాయానికి స్వయంగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కృతజ్ఞతలు తెల్పినట్టు గానీ లేక పోస్టులో చెప్తున్నట్టు భారత సహాయానికి మీడియా ముందు ఏడ్చినట్టు గానీ ఎటువంటి ఆధారాలు లేవు. ఇది కల్పిత వార్త. కాకపోతే భారతదేశంలోని టర్కీ రాయబారి భారత్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. భారత్‌ అందించిన సహాయానికి ధన్యవాదాలు తెలుపుతూ టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ భారత్‌ను ‘దోస్త్’ అని సంబోధించాడు కూడా. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటివల టర్కీ మరియు సిరియాలో భూకంపం సంభవించిన నేపథ్యంలో భారత్ టర్కీకి సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. ఇందులో భాగంగా భారత్ ఈ రెండు దేశాలకు భారత్ సహాయ బృందాలను పంపింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా సహాయ సామాగ్రి, వైద్య బృందాలు, NDRF సహాయ బృందాలతో కూడిన  సీ-17 విమానాలను భారతదేశం పంపించింది. ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో భారత్ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ విషయానికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

భారత్ చేసిన సహయానికి టర్కీ కృతజ్ఞతలు తెలిపింది. భారత్ అందించిన సహాయానికి ధన్యవాదాలు తెలుపుతూ టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ భారత్‌ను ‘దోస్త్’ అని సంబోధించాడు. భారత్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ అనేక ట్వీట్స్ చేసాడు. ఈ విషయానికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే భారత సహాయానికి స్వయంగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కృతజ్ఞతలు తెల్పినట్టు గానీ లేక పోస్టులో చెప్తున్నట్టు భారత సహాయానికి మీడియా ముందు ఏడ్చినట్టు గానీ ఎటువంటి ఆధారాలు లేవు. ఒకవేళ నిజంగా ఇలా జరిగి ఉంటే మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది. కానీ, మాకు అలాంటి కథనాలేవి లభించలేదు.

భూకంపం సంభవించిన తరవాత మొదటిసారి చేసిన ప్రసంగంలో గానీ, లేక భూకంపాల బాధిత ప్రజలను పరామర్శించినప్పుడు మీడియా ముందు మాట్లాడినప్పుడు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) గాని భారత్‌కు కృతజ్ఞతలు చెప్తూ ఏడవలేదు. దీన్నిబట్టి పోస్టులో చెప్తున్నది పూర్తి కల్పితమని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, భారత్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ మీడియా ముందు ఏడ్చాడన్నది కల్పితం.

Share.

About Author

Comments are closed.

scroll