Fake News, Telugu
 

312 సంవత్సరాల అనంతరం చంద్రుడు, శని గ్రహాలు దగ్గరగా వస్తున్నాయన్న వార్తలో నిజం లేదు

0

312 సంవత్సరాల అనంతరం ఈ రోజు చంద్రుడు, శని గ్రహాలు అతి చేరువలో దర్శనమిస్తున్నాయని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 312 సంవత్సరాల అనంతరం ఈ రోజు చంద్రుడు, శని గ్రహాలు అతి చేరువలో దర్శనమిస్తున్నాయి.

ఫాక్ట్ (నిజం): 13 జూలై 2021న ప్రత్యేకించి వీనస్ మరియు మార్స్ గ్రహాలు ఒకదాని వైపు మరొకటి కదులుతూ సమీప దూరంలో ఉంటాయని నాసా తెలిపింది. పైగా ఈ రెండు గ్రహాలు చంద్రుడికి దగ్గరగా కనిపిస్తాయని కూడా తెలిపింది. ఈమధ్య కాలంలో చంద్రుడు మరియు శని గ్రహాలు దగ్గరికి రాబోతున్నట్టు ఎటువంటి సమాచారం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ పోస్టుని 13 జూలై 2021న పోస్టు చేసారు, కాబట్టి ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్ లో వెతకగా, ఈ వారం మొత్తం వీనస్ (శుక్రుడు), చంద్రుడు, మార్స్ (అంగారకుడు) దగ్గరగా కనిపిస్తాయని CNN ఒక వార్తా కథనంలో పేర్కొంది. ఈ విషయానికి సంబంధించి మరొక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.

వీనస్, మార్స్ ఒకదాని వైపు మరొకటి కదులుతూ, 13 జూలై 2021న ఈ రెండు గ్రహాలు సమీప దూరంలో ఉంటాయని, ఇలా దగ్గరగా రావడాన్ని ప్లానెటరీ కన్జక్షన్ అంటారని నాసా తెలిపింది. ఐతే నిజానికి ఈ రెండు గ్రహాలు చాలా దూరం ఉంటాయి, కాని భూమి నుండి చూసిన వారికి మాత్రం ఈ రోజు ఆ రెండు గ్రహాలు దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయని నాసా తెలిపింది. పైగా ఈ రెండు గ్రహాలు నెలవంక చంద్రుడికి దగ్గరగా కనిపిస్తాయని తెలిపింది. ఐతే ఇలా 312 సంవత్సరాల అనంతరం జరుగుతున్నట్టు NASA గాని లేక ఇతర వార్తా కథనాలు గాని ఎక్కడ కూడా చెప్పలేదు.

ఐతే ఈ వారంలో గాని లేక ఈ నెలలో గాని ప్రత్యేకించి చంద్రుడు, శని గ్రహాలు దగ్గరికి రాబోతున్నట్టు ఎటువంటి సమాచారం లేదు. నాసా గ్రహాల సంచారాన్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది, నాసా వెబ్సైటులో ఈ గ్రహాల సంచారాన్ని చూడొచ్చు. ఐతే ఈ ట్రాకింగ్ సమాచరంలో కూడా శని గ్రహం చంద్రుడి దగ్గరికి వస్తున్నట్టు ఎటువంటి సమాచరం లేదు. ఇదే వార్త 2018 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. కాబట్టి ఈ వార్తలో నిజం లేదని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, 312 సంవత్సరాల అనంతరం చంద్రుడు మరియు శని గ్రహాలు దగ్గరగా వస్తున్నాయన్న వార్తలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll