Fake News, Telugu
 

డెల్టాక్రాన్ అనేది కోవిడ్-19 వేరియంట్ కాదు

0

‘సైప్రస్ యూనివర్శిటీ వైరాలజీ నిపుణుడు డాక్టర్ లియోండియోస్ కోస్టిక్రిస్ డెల్టాక్రాన్ అనే కొత్త కరోనా వేరియంట్‌ని  గుర్తించారని’ చెప్తున్న పోస్ట్ (ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘సైప్రస్ యూనివర్శిటీ వైరాలజీ నిపుణుడు డాక్టర్ లియోండియోస్ కోస్టిక్రిస్ డెల్టాక్రాన్ అనే కొత్త కరోనా వేరియంట్‌ని  గుర్తించారు.’

ఫాక్ట్ (నిజం): డెల్టాక్రాన్ అనేది ఒక వేరియంట్ కాదు. ఇది కేవలం కరోనా యొక్క డెల్టా మరియు ఓమిక్రాన్ స్ట్రైన్స్ కలిసిన ఒక కొత్త స్ట్రైన్‌ మాత్రమే. డెల్టా, ఓమిక్రాన్ స్ట్రైన్స్ యొక్క జన్యువులు మ్యూటేట్ అవ్వడం వల్ల డెల్టాక్రాన్ ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. డెల్టాక్రాన్ నిజం కాదని, ఇది కేవలం జన్యువుల మ్యూటేషన్ వల్ల ఏర్పడిందని, దీనికి భయపడాల్సిన పనిలేదని WHO నిపుణులు తెలిపారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల సైప్రస్‌లో కరోనా యొక్క డెల్టా మరియు ఓమిక్రాన్ స్ట్రైన్స్ కలిసిన ఒక కొత్త స్ట్రైన్‌ వెలుగులోకి వచ్చింది, దీనికి డెల్టాక్రాన్ అని పిలుస్తున్నారు. సైప్రస్ యూనివర్సిటీ ఈ విషయాన్నీ వెలుగులోకి తీసుకొచ్చింది. సైప్రస్ యూనివర్సిటీలో బయోలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్ లియోండియోస్ కోస్ట్రికిస్ దీనిని గుర్తించినట్టు వార్తా కథనాలు పేర్కొన్నాయి.

ఐతే వైరల్ పోస్టులో చెప్తునట్టు ఇది కొత్త వేరియంట్‌ కాదు. డెల్టా మరియు ఓమిక్రాన్ రెండు స్ట్రైన్స్ యొక్క జన్యువులు మ్యూటేట్ (పరివర్తన) అవ్వడం వల్ల ఈ కొత్త డెల్టాక్రాన్ స్ట్రైన్‌ ఏర్పడిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఒక వ్యక్తికి డెల్టా మరియు ఓమిక్రాన్ వేరియంట్ ఒకేసారి సోకినప్పుడు, ఈ రెండు వేరియంట్ల మధ్య జన్యువులు మ్యూటేట్ అవ్వడం వల్ల ఇలా ఈ రెండు వేరియంట్ల గుణాలున్న స్ట్రైన్‌ ఏర్పడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

ఇంతకుముందు కూడా ఇజ్రాయిల్‌లో ఒక వ్యక్తిలో ఇన్‌ఫ్లుయెంజా మరియు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది, ఐతే ఇలా ఒకేసారి ఈ రెండు ఇన్ఫెక్షన్స్ (“డబుల్ ఇన్ఫెక్షన్” లేదా “కో-ఇన్ఫెక్షన్”) సోకిన కండిషన్‌ని అక్కడి డాక్టర్లు ‘ఫ్లోరోనా’ అంటూ నామకరణం చేసారు. దీనిని కూడా కొందరు ఫ్లోరోనా అనేది కొత్త వేరియంట్ అంటూ వార్తలు రాసారు. ఐతే ఇది కేవలం ఒక కండిషన్ మాత్రమేనని, కొత్త వేరియంట్ కాదని, FACTLY రాసిన కథనం ఇక్కడ చూడొచ్చు.

డెల్టాక్రాన్‌కి సంబంధించిన వార్త వైరల్ అవ్వడంతో, WHO కోవిడ్-19 టెక్నికల్ టీం సభ్యురాలైన డాక్టర్ కృతిక కుప్పల్లి కూడా డెల్టాక్రాన్ నిజం కాదని, దీనికి భయపడాల్సిన పనిలేదని ట్వీట్స్ (ఇక్కడ మరియు ఇక్కడ) ద్వారా తెలిపింది.

కొత్త వేరియంట్లని WHO గుర్తిస్తుంది:

సాధారణంగా కరోనా వేరియంట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తించి, వాటికి పేర్లను నిర్ణయిస్తుంది, గ్రీక్ అక్షరాలతో కూడిన ఒక ఆల్ఫాన్యూమరిక్ పేర్లను కరోనా వైరస్ వేరియంట్లకు కేటాయిస్తూ వచ్చింది. కరోనా వేరియంట్ల పేర్లకు సంబంధించిన పూర్తి సమాచారం WHO వెబ్సైటు చూడొచ్చు. ఐతే ఈ సమాచారంలో డెల్టాక్రాన్ పేరుతో ఎటువంటి కరోనా వేరియంట్ లేదు. దీన్నిబట్టి డెల్టాక్రాన్ అనేది కోవిడ్ వేరియంట్ కాదని స్పష్టంగా అర్ధమవుతుంది.  కోవిడ్ వేరియంట్ల సందేహాలకు సంబంధించిన సమాచారం ఇక్కడ చూడొచ్చు.

చివరగా, డెల్టాక్రాన్ అనేది కోవిడ్-19 వేరియంట్ కాదు, దీనికి భయపడాల్సిన అవసరం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll