Fake News, Telugu
 

ఆ వీడియో సికింద్రాబాద్ లోని తుకారాం గేట్ దగ్గర మొసలి కనిపించినప్పుడు తీసినది కాదు

0

ఒక మొసలి వంతెన పైన ఉన్నప్పుడు కొంతమంది అధికారులు దాన్ని పట్టుకుంటున్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ఆ మొసలిని సికింద్రాబాద్ లోని తుకారాం గేట్ దగ్గర కనుగొన్నారు అంటూ చాలా మంది ఆరోపిస్తున్నారు . అది ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : ఒక మొసలి సికింద్రాబాద్ లోని తుకారాం గేట్ దగ్గర కనిపించినప్పుడు తీసిన వీడియో.

ఫాక్ట్ (నిజం): నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం దూదిగాం వద్ద ఉన్న జాతీయ రహదారి-44 పైకి ఒక మొసలి వచ్చినప్పుడు తీసిన వీడియో అది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

పోస్టులో ఉన్న వీడియో ని ‘ఇన్విడ్’ ప్లగిన్ లో అప్లోడ్  చేసినప్పుడు, దానికి సంబంధించిన చాలా కీఫ్రేమ్స్ వచ్చాయి. వాటిని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఒక కీఫ్రేమ్ ‘Sakshi’ పత్రిక వారు ప్రచురించిన ఒక కథనం లో దొరికింది. ఆ కథనంలో అదే సమయంలో తీసిన అలాంటి వీడియోనే మరొక్క దాన్ని చూడవచ్చు. ఆ కథనం ప్రకారం- ‘నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం దూదిగాం వద్ద జాతీయ రహదారి 44 పైకి పెద్ద మొసలి వచ్చింది. అప్రోచ్‌ రోడ్డు వంతెనపై వరకు వెళ్లి దిగువకు దిగే ప్రయత్నంలో వేలాడుతూ అలాగే ఉండి పోయింది. సమాచారం అందుకున్న అధికారులు జేసీబీ సహాయంతో మొసలిని పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. తాళ్లతో బంధించి దూదిగాం శివారులోని గోదావరిలో వదిలేశారు’.  అదే విషయాన్ని  వెల్లడిస్తూ ‘Telangana Today’ వారు ప్రచురించిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు. కావున, ఆ వీడియో సికింద్రాబాద్ లోని తుకారాం గేట్ దగ్గర మొసలి కనిపించినప్పుడు తీసిందని చెప్పడం తప్పు.

ఈ పాత వీడియో ని ‘The Hans India’ వార్తా సంస్థ వాళ్ళు కూడా సికింద్రాబాద్ తుకారాం గేట్ దగ్గర మొసలి కనిపించింది అంటూ ట్వీట్ చేసారు. అందరు అది పాత వీడియో అని చెప్పాక ఆ వార్త నిజం కాదంటూ ఇంకో ట్వీట్ చేసారు.

చివరగా, ఆ వీడియో సికింద్రాబాద్ లోని తుకారాం గేట్ దగ్గర మొసలి కనిపించినప్పుడు తీసినది కాదు. అది నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం దూదిగాం వద్ద ఉన్న జాతీయ రహదారి-44 పైకి మొసలి వచ్చినప్పుడు తీసిన వీడియో.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll