Fake News, Telugu
 

రాహుల్ గాంధీ వివాహానికి సంబంధించి వికిలిక్స్ ఎటువంటి కథనం పబ్లిష్ చేయలేదు

0

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వివాహం చేసుకున్న మహిళ గురించి ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వికిలిక్స్ కధనం రాసింది, అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొలంబియా దేశస్తురాలు అయిన తన భార్యతో రాహుల్ గాంధీ దిగిన ఫోటోలంటూ ఈ పోస్టులో కొన్ని ఫోటోలు షేర్ చేసారు. అంతేకాదు, రాహుల్ గాంధీ దంపతులకి 14 సంవత్సరాల వయసు గల కొడుకు, 10 సంవత్సరాల వయసు గల కుతురునట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: రాహుల్ గాంధీ వివాహం చేసుకున్న మహిళ గురించి ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వికిలిక్స్ కథనం రాసింది.

ఫాక్ట్ (నిజం): వికిలిక్స్ రాహుల్ గాంధీ వివాహానికి సంబంధించి ఎటువంటి కథనం రాయలేదు. పోస్టులో షేర్ చేసిన ఒక ఫోటోలో రాహుల్ గాంధీ పక్కన నిలిచున్నది స్పానిష్ కధానాయిక నతాలియా రమోస్. మరొక ఫోటో, రాహుల్ గాంధీ తన స్నేహితులతో కలిసి ఒక పార్టీ చేసుకున్నప్పుడు తీసినది. రాహుల్ గాంధీ రహస్య వివాహం చేసుకునట్టు ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ల వివరాల కోసం ఇంటర్నెట్ లో వెతికితే, రాహుల్ గాంధీ వివాహానికి సంబంధించి వికిలిక్స్ ఎటువంటి కథనం పబ్లిష్ చేయలేదని తెలిసింది.

ఫోటో-1:

పోస్టులో షేర్ చేసిన మొదటి ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘International Business Times’ న్యూస్ వెబ్ సైట్ ‘22 సెప్టెంబర్ 2017’ నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో,  కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పానిష్-అమెరికన్ కథానాయిక నతాలియా రమోస్ తో దిగిన ఫోటో అని ఈ ఆర్టికల్ లో తెలిపారు. ‘14 సెప్టెంబర్ 2017’ నాడు లాస్ ఏంజెల్స్ లోని Berggruen యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఫోటో దిగినట్టు ఆర్టికల్ లో తెలిపారు. ఇదే ఫోటోని నతాలియా రమోస్, తన అధికారిక ట్విట్టర్, ఫేస్బుక్ పేజిలలో ‘14 సెప్టెంబర్ 2017’ నాడు పోస్ట్ చేసింది. నతాలియా రమోస్ రాహుల్ గాంధీ తో దిగిన ఫోటోకి సంబంధించి పబ్లిష్ అయిన ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఫోటో-2:

పోస్టులో షేర్ చేసిన మరొక ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని జర్నలిస్ట్ రాహుల్ కవల్ ‘22 ఏప్రిల్ 2017’ నాడు తన ఫేస్బుక్ పోస్టులో షేర్ చేసినట్టు తెలిసింది. రాహుల్ గాంధీ తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నప్పుడు తీసిన ఫోటోలని మాజీ కాంగ్రెస్ నాయకురాలు బర్ఖా శుక్లా లీక్ చేసినట్టు తన పోస్టులో తెలిపారు.

ఈ ఫోటోలని బర్ఖా శుక్లా మీడియాకి చూపిస్తున్న వీడియోని ‘ABP News’ తమ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది. బర్ఖా శుక్లా లీక్ చేసిన ఈ ఫొటోలకి సంబంధించి న్యూస్ వెబ్ సైట్స్ పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. రాహుల్ గాంధీ పక్కన కనిపిస్తున్న వ్యక్తి తన భార్య అని ఈ మీడియా రిపోర్ట్స్ లో ఎక్కడా తెలుపలేదు.

చివరగా, రాహుల్ గాంధీ వివాహానికి సంబంధించి వికిలిక్స్ ఎటువంటి కథనం పబ్లిష్ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll