2019లో భారత్ నిర్వహించిన బాలాకోట్ ఎయర్ స్ట్రైక్ దాడుల్లో 300 మంది మృతి చెందినట్లు ఒక టీవీ ప్రోగ్రాంలో పాక్ మాజీ దౌత్యవేత్త హిలాలీ అంగీకరించినట్టు చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: బాలాకోట్ ఎయర్ స్ట్రైక్ దాడుల్లో 300 మంది మృతి చెందినట్లు అంగీకరించిన పాక్ మాజీ దౌత్యవేత్త హిలాలీ.
ఫాక్ట్: బాలాకోట్ ఎయర్ స్ట్రైక్ దాడుల్లో 300 మంది మృతి చెందినట్లు జాఫర్ హిలాలీ అంగీకరించలేదు. తను అంగీకరించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఒక ఎడిటెడ్ వీడియో. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, అదే విషయం చెప్తూ తెలుగు వార్తాసంస్థలు [ఈనాడు (ఆర్కైవ్డ్), టీవీ9 (ఆర్కైవ్డ్), నమస్తే తెలంగాణ (ఆర్కైవ్డ్), టైమ్స్ అఫ్ ఇండియా – తెలుగు (ఆర్కైవ్డ్), సాక్షి (ఆర్కైవ్డ్), 10టీవీ (ఆర్కైవ్డ్), V6 న్యూస్ (ఆర్కైవ్డ్), ప్రజాశక్తి (ఆర్కైవ్డ్), ఎన్‌టీవీ న్యూస్ (ఆర్కైవ్డ్), జీ హిందూస్తాన్ – తెలుగు (ఆర్కైవ్డ్), మరియు ఆంధ్రజ్యోతి (ఆర్కైవ్డ్)] కూడా ఆర్టికల్స్ ప్రచురించినట్టు తెలిసింది.
పోస్ట్ లోని విషయం చెప్తూ కొందరు యూట్యూబ్ లో వీడియోలు కూడా పెట్టారు.వాటిని ఇక్కడ (ఆర్కైవ్డ్) మరియు ఇక్కడ (ఆర్కైవ్డ్) చూడవొచ్చు.
ఆంగ్ల వార్తాసంస్థలు కూడా ఈ వార్తని ప్రచురించాయి. అయితే, ‘ANI’ సంస్థ నుండి వచ్చిన బాలాకోట్ వార్తలో తప్పులు ఉన్నందున తమ ఆర్టికల్ ని తీసేస్తున్నాము అని ‘మింట్’ వారు రాసినట్టు ఇక్కడ చూడవొచ్చు. ‘ANI’ వారు కూడా తమ ఆర్టికల్ ని తీసేసారు; వారి ఆర్టికల్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చదవొచ్చు. ‘టైమ్స్ నౌ’ వారు కూడా ఈ వార్త పై వివరణ ఇచ్చారు.
బాలాకోట్ వార్తలో ఏం తప్పు ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ‘రిపబ్లిక్ టీవీ’ ప్రచురించిన ఆర్టికల్ లో జాఫర్ హిలాలీ చేసిన వ్యాఖ్యలు అని ఒకరు పెట్టిన ట్వీట్ ని చూడవొచ్చు. ఆ ట్వీట్ లోని వీడియోని ఇక్కడ చూడవొచ్చు. ఈ వీడియోని ‘ఇండియా టుడే’ వారు తమ న్యూస్ లో టెలికాస్ట్ కూడా చేసారు.
అయితే, తను మాట్లాడిన వీడియోని తీసుకొని ఎడిట్ చేసి, భారత్ మీడియా తప్పుగా చూపెడుతోందని జాఫర్ హిలాలీ ట్వీట్ చేసాడు. తను ఈ విషయం పై చేసిన ట్వీట్లను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.
జాఫర్ హిలాలీ ట్వీట్ చేసిన వీడియోలో తన వీడియో 23 డిసెంబర్ నాడు ‘Hum News’ లో వచ్చినట్టు చూడవొచ్చు. ఆ కీ-వర్డ్స్ తో వెతకగా, ఆ ప్రోగ్రాం కి సంబంధించిన పూర్తి వీడియో యూట్యూబ్ లో దొరికింది. వైరల్ అవుతున్న వీడియోని పూర్తి వీడియోలో 5:17 సమయం దగ్గర చూడవొచ్చు. అయితే, ఒరిజినల్ వీడియోలో “కమ్సే కమ్ తీన్ సౌ లోగోన్ కొ ఉన్హే మర్నా తా, ఇత్తేఫాకన్ వో నహి మారే” (తెలుగు అనువాదం – కనీసం మూడు వందల మందిని చంపాలనుకున్నారు, కానీ చంపలేదు) అని అన్నట్టు వినొచ్చు. అయితే, ఎడిటెడ్ వీడియోలో ఎనిమిది-తొమ్మిది సెకండ్ల మధ్య ‘మర్నా తా’ (చంపాలనుకున్నారు) అనే పదాన్ని ఎడిట్ చేసి, ‘మారే’ (చంపారు) అనే పదం వచ్చేలా చేసారు. అంతేకాదు, ఒరిజినల్ వీడియోలో 4:40 దగ్గర జాఫర్ హిలాలీ మాట్లాడుతూ, ‘300 మంది చదువుతున్న ఒక మదరసా మీద భారత్ దాడి చేయాలనుకుంది, 300 మందిని చంపాలనుకుంది, వాళ్ళు అక్కడ లేకుండే, అది జరగలేదు…’ (తెలుగు అనువాదం) అని అన్నట్టు వినొచ్చు. పోస్ట్ చేసిన ఎడిటెడ్ వీడియో తిప్పి ఉన్నట్టు కూడా గమనించవొచ్చు.
చివరగా, బాలాకోట్ దాడుల్లో 300 మంది మృతి చెందినట్లు పాక్ మాజీ దౌత్యవేత్త హిలాలీ అంగీకరించలేదు.