Fake News, Telugu
 

మొబైల్ ఫోన్ పూర్తిగా డిశ్చార్జ్ అయినప్పుడు ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ 1000 రెట్లు ఎక్కువ అన్న వాదనలో నిజంలేదు

0

జీవిత సత్యాలు పేరుతో పలు ఆరోగ్య సూత్రాలు వివరిస్తున్న వీడియో ఒకటి యూట్యూబ్‌లో ఎక్కువ వ్యూస్ రాబడుతోంది. ఈ వీడియోలో చెప్తున్న సూత్రాలలో మొబైల్ రేడియేషన్‌కు సంబంధించి కూడా ఒక సూచన ఉంది. మొబైల్ ఫోన్ పూర్తిగా డిశ్చార్జ్ అయినప్పుడు ఫోన్ నుండి వచ్చే రేడియోధార్మికత 1000 రెట్లు ఎక్కువగా ఉంటుందని, ఇది మెదడును చాలా అనారోగ్యానికి గురి చేస్తుందని, కాబట్టి ఆ సమయంలో ఫోన్ వినకూడదని, ఈ వీడియోలో సూచిస్తున్నారు.  ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మొబైల్ ఫోన్ పూర్తిగా డిశ్చార్జ్ అయినప్పుడు ఫోన్ నుండి వచ్చే రేడియోధార్మికత 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

ఫాక్ట్(నిజం):  సాధారణంగా 450-2700 MHz రేడియో ఫ్రీక్వెన్సీ మధ్య మొబైల్ ఫోన్ల కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇది తక్కువ ఫ్రీక్వెన్సీ, కాబట్టి ఈ తరంగాల వల్ల మనుషులకు పెద్దగా ఏమి హాని ఉండదని నిపుణులు చెప్తున్నారు. WHO,FDA మరియు అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్సర్  కూడా ఇలాంటి అభిప్రాయాన్నే తెలిపింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వీడియోలో చేస్తున్న సూచనలలో మొబైల్ రేడియేషన్‌కు సంబంధించి రేడియోధార్మికత 1000 రెట్లు పెరుగుతుందని చేస్తున్న క్లెయిమ్ కరెక్ట్ కాదు. దీనికి సంబంధించిన వివరణ కింద చూద్దాం.

మొబైల్ రేడియేషన్:

సాధారణంగా రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు విడుదల ద్వారా మొబైల్ ఫోన్ల కమ్యూనికేషన్ జరుగుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు అనేవి ఒక రకమైన విద్యుదయస్కాంత రేడియేషన్ (electromagnetic). ఐతే ఈ విద్యుదయస్కాంత రేడియేషన్లు అనేవి రెండు రకాలు.

1) నాన్-అయోనైజింగ్ రేడియేషన్ : రేడియో ఫ్రీక్వెన్సీ, మైక్రోవేవ్, ఇన్ఫ్రారెడ్, మొదలైనవి

2) అయోనైజింగ్ రేడియేషన్ : X- కిరణాలు, గామా కిరణాలు

నాన్-అయోనైజింగ్ రేడియేషన్ అనే తక్కువ ఫ్రీక్వెన్సీ/ఎనర్జీ రేడియేషన్ కాబట్టి ఈ రేడియేషన్‌కు సాధారణ ఎక్సపోజర్ వల్ల ఎటువంటి హాని ఉండదు. వీటిలో బాండ్స్ బ్రేక్ చేసే అంత ఎనర్జీ ఉండదు. కాని అయోనైజింగ్ రేడియేషన్‌కు ఎక్సపోజ్ అయితే మాత్రం సెల్స్ & డీఎన్ఏ దెబ్బతినే అవకాశం ఉంది.

సాధారణంగా 450-2700 MHz రేడియో ఫ్రీక్వెన్సీ మధ్య మొబైల్ ఫోన్ల కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇది తక్కువ ఫ్రీక్వెన్సీ, కాబట్టి ఈ తరంగాల వల్ల మనుషులకు పెద్దగా ఏమి హాని ఉండదని నిపుణులు చెప్తున్నారు.

WHO కూడా ఇదే చెప్తుంది:

తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలకు ఎక్కువసేపు ఎక్సపోజ్ అయినా కానీ ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా చెప్తుంది.

మొబైల్ ఫోన్లు విడుదల చేసే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ వల్ల DNAకు ఎటువంటి హాని ఉండదని అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్సర్  తెలిపింది. అలాగే వీటివల్ల కాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి అనడానికి  ఎటువంటి ఆధారాలు లేవని కూడా తెలిపింది.

2019లో ఇరాన్‌లో చేసిన ఒక అధ్యయనంలో ఫోన్ బ్యాటరీ ఒక శాతం ఉన్నప్పుడు కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు రేడియేషన్‌లో విడుదలలో స్వల్ప పెరుగుదల (సుమారు 3.5 రెట్లు) కనిపించింది. కాని ఇది రేడియేషన్ 1000 రేట్లు పెరుగుతుందని పోస్టులో చేస్తున్న వాదనకు చాలా దూరంగా ఉంది.

గతంలో ఇదే వార్త సోషల్ మీడియాలో షేర్ అయినప్పుడు AAP, ఈ విషయానికి సంబంధించి వివరణ కోసం నిపుణులను సంప్రదించిగా, వారు కూడా పై వాదనతో ఏకీభవించారు.

చివరగా, మొబైల్ ఫోన్ పూర్తిగా డిశ్చార్జ్ అయినప్పుడు ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ 1000 రెట్లు ఎక్కువ అన్న వాదనలో నిజంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll