Fake News, Telugu
 

కాంగ్రెస్ పార్టీ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింలకు మాత్రామే ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పిస్తామని, ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు ఆసుపత్రులను నిర్మిస్తామని వాగ్ధానం చేయలేదు

0

తెలంగాణలో ముస్లింల ఓట్లను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇటీవల తమ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినట్టు జాతీయ మీడియా సంస్థ ‘Times Now’ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ అవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో తమ పార్టీ వచ్చే ఎన్నికలలో గెలుపొందితే ప్రతి ప్రభుత్వ కాంట్రాక్టును ముస్లిం యువతకే అందిస్తామని, పేద ముస్లిం విద్యార్థులకు 20 లక్షల ఆర్ధిక సహాయం అందిస్తామని, ముస్లింల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్‌లను నిర్మిస్తామని, మసీదులకు ఉచిత విధ్యుత్ అందిస్తామని, ముస్లింల కోసం ప్రత్యేక ఆసుపత్రులను కట్టిస్తామని వాగ్ధానం చేసినట్టు ‘Times Now’ వెల్లడించిందని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

క్లెయిమ్: తెలంగాణ కాంగ్రెస్ 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింలకు మాత్రమే ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్, ఆసుపత్రులు మరియు మసీదులకు ఉచిత విద్యుత్ అందిస్తామని వాగ్ధానం చేసింది.

ఫాక్ట్ (నిజం): కాంగ్రెస్ పార్టీ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసిన మేనిఫెస్టోకు సంబంధించి ‘Times Now’ పబ్లిష్ చేసిన పాత వార్తా రిపోర్ట్ గురించి ఈ పోస్ట్ తెలుపుతుంది. 2018లో తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో మసీదులు, చర్చిలతో సహా హిందూ దేవాలయాలకు కూడా ఉచిత విధ్యుత్ అందిస్తామని వాగ్ధానం చేసింది. పేద ముస్లిం విద్యార్థులతో పాటు ఆర్ధికంగా వెనుకబడి ఉన్న విధ్యార్ధులకు విదేశీ చదువుల సహాయార్ధం రూ. 25 లక్షలు స్కాలర్షిప్‌గా అందిస్తామని తెలిపింది. ముస్లిం మరియు ఇతర మైనారిటీలు కేంద్రీకృతమైన ప్రాంతాలలో ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు ఆసుపత్రులు కట్టిస్తామని కాంగ్రెస్ తమ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్ధానం చేసింది. 2023 తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎటువంటి మేనిఫెస్టోను విడుదల చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించి కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, కాంగ్రెస్ పార్టీ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసిన మేనిఫెస్టోకు సంబంధించి ‘Times Now’ పబ్లిష్ చేసిన ఒక పాత వార్తా రిపోర్ట్ గురించి ఈ పోస్టులో తెలుపుతున్నట్టు తెలిసింది. తెలంగాణలో  ముస్లింల ఓట్లను 90 శాతం పొందడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ముస్లింల కోసం ప్రత్యేకంగా ఏడు పథకాలను ప్రవేశపెట్టిందని ‘Times Now’ తమ రిపోర్టులో వెల్లడించింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను ఇక్కడ చూడవచ్చు. ‘Times Now’ రిపోర్ట్ ఆధారంగా పోస్టులో చేస్తున్న క్లెయింలకు సంబంధించిన వివరాలను ఒక్కొకటిగా తెలుసుకుందాం.

క్లెయిమ్-1: ప్రతి ప్రభుత్వ కాంట్రాక్ట్ ముస్లిం యువతకే అందించడం

తెలంగాణ కాంగ్రెస్ 2018లో విడుదల చేసిన మేనిఫెస్టోలో మైనారిటీల అభ్యున్నతికి సంబంధించి ముస్లింలకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో భాగంగా ప్రభుత్వ కాంట్రాక్టులు ముస్లిం యువత పొందే విధంగా అవకాశాలు కల్పిస్తామని వాగ్ధానం చేశారు. అయితే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువతకు అన్నీ ప్రభుత్వ కాంట్రాక్టులలో 50 శాతం పని కల్పిస్తామని తెలంగాణ కాంగ్రెస్ తమ ఈ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ ముస్లిం యువతకే అందిస్తామని తెలంగాణ కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో ఎక్కడా పేర్కొనలేదు.

క్లెయిమ్-2: పేద ముస్లిం విధ్యార్ధులకు 20 లక్షల ఆర్ధిక సహాయం

పేద మైనారిటీ విధ్యార్ధుల విదేశీ చదువుల కోసం రూ. 20 లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ తమ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్ధానం చేసింది. అయితే, పేద మైనారిటీ విధ్యార్ధులతో పాటు ఆర్ధికంగా వెనుకబడి ఉన్న విధ్యార్ధులకు విదేశీ చదువుల సహాయార్ధం రూ. 25 లక్షలు స్కాలర్షిప్‌గా అందిస్తామని కాంగ్రెస్ తమ ఈ 2018 మేనిఫెస్టోలో స్పష్టంగా తెలిపింది. కేవలం ముస్లిం విధ్యార్ధుల చదువుల కోసం మాత్రమే ఆర్ధిక సహాయం లేదా స్కాలర్షిప్‌ అందిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో తెలుపలేదు.

క్లెయిమ్-3: ముస్లింలకు మాత్రమే ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తాము గెలిస్తే మైనారిటీ బాలికల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టిస్తామని కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్ధానం చేసింది. ముస్లింలతో సహా క్రైస్తమ మరియు ఇతర మైనారిటీ విధ్యార్ధుల కోసం కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో స్పష్టంగా తెలిపింది. అంతేకాదు, గిరిజనులు మరియు వికలాంగుల కోసం కూడా ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్‌లను నిర్మిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో తెలిపింది.

క్లెయిమ్-4: మసీదులకు ఉచిత విధ్యుత్ అందించడం

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో తమ పార్టీ గెలిస్తే దేవాలయాలు, మసీదులు, చర్చిలు మరియు ఇతర ప్రార్థన స్థలాలకు ఉచిత విధ్యుత్ అందిస్తామని కాంగ్రెస్ వాగ్ధానం చేసింది. కేవలం, మసీదులకు మాత్రమే ఉచిత విధ్యుత్ అందిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పేర్కొనలేదు.

క్లెయిమ్-5: ముస్లింల కోసం ప్రత్యేక ఆసుపత్రులు కట్టిస్తాం

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో మైనారిటీలు కేంద్రీకృత ప్రాంతాలలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని వాగ్ధానం చేసింది. ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద ప్రకటించిన ఒక వాగ్ధనంలో, మైనారిటీలు ఎక్కువగా ప్రాంతాలలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అన్ని మైనారిటీలను ఉద్దేశించి చేసిన ఈ వాగ్ధానాన్ని, మేనిఫెస్టోలో ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద పాయింట్లలో జత చేయడంతో, కేవలం ముస్లింల కొరకు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మిస్తున్నట్టు పలు వార్తా సంస్థలు తప్పుగా రిపోర్ట్ చేసాయి. దీనికి సంబంధించి ఫాక్ట్‌లీ ఇదివరకు పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్‌ను ఇక్కడ చూడవచ్చు.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టో తయారుచేస్తామని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా 2022 అక్టోబర్ నెలలో తెలిపారు. అయితే, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయలేదు.

చివరగా, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ముస్లింలకు మాత్రమే ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్, ఆసుపత్రులు నిర్మిస్తామని మరియు మసీదులకు ఉచిత విద్యుత్ అందిస్తామని వాగ్ధానం చేయలేదు.    

Share.

About Author

Comments are closed.

scroll