కొరోనా వైరస్ సోకకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా ‘ఆర్సేనిక్ ఆల్బం 30’ అనే హోమియోపతీ మందు వాడాలని భారత ఆయుష్ (AYUSH) మంత్రిత్వ శాఖ సూచించిందని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ మందు ద్వారా కొరోనా వైరస్ ని నివారించచ్చో లేదో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: ‘ఆర్సేనిక్ ఆల్బం 30’ అనే హోమియోపతీ మందు వాడడం ద్వారా కొరోనా వైరస్ ని నివారించవొచ్చు.
ఫాక్ట్ (నిజం): ‘ఆర్సేనిక్ ఆల్బం 30’ మందు వాడడం ద్వారా కొరోనా వైరస్ ని నివారించవొచ్చని ఎక్కడా కూడా శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఇంతకుముందు, స్వైన్ ఫ్లూ మరియు డెంగ్యూ వ్యాధులకు కూడా లక్షణాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం అర్సేనిక్ ఆల్బం మందునే సూచించింది. కాకపోతే, కొరోనా వ్యాధిని నివారించడానికి లేదా తగ్గించడానికి ఇప్పటివరకు ఎటువంటి మందులు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారు కూడా తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
‘ఆర్సేనిక్ ఆల్బం 30’ మందుని భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిందా అని వెతకగా, నిజంగానే వారు ఆ మందుని కొరోనా వైరస్ రాకుండా నివారించడానికి సూచించినట్టు తెలుస్తుంది. ఆ సూచనకి సంబంధించిన డాక్యుమెంట్ లింక్ ని ఆయుష్ మంత్రిత్వ శాఖ వారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పెట్టుకున్నట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.
కానీ, ‘ఆర్సేనిక్ ఆల్బం 30’ మందు గురించి గూగుల్ లో వెతకగా, మందు వాడడం ద్వారా కొరోనా వైరస్ ని నివారించవొచ్చని ఎక్కడా కూడా శాస్త్రీయమైన ఆధారాలు దొరకలేదు. ఇంతకుముందు, స్వైన్ ఫ్లూ మరియు డెంగ్యూ వ్యాధులకు కూడా లక్షణాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం అర్సేనిక్ ఆల్బం మందునే సూచించింది. ఫ్లూ వ్యాధి లాంటి అన్ని వ్యాధులకు ‘ఆర్సేనిక్ ఆల్బం 30’ ని ప్రభుత్వం సూచించినట్టు ‘నేషనల్ హెల్త్ పోర్టల్’ వెబ్ సైట్ లో చూడవొచ్చు. ఆ మందు ద్వారా ఆ వ్యాధుల లక్షణాలు నియంత్రించవచ్చని కూడా శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఆయుష్ మంత్రిత్వ శాఖ వారు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ మీద వివిధ డాక్టర్ల అభిప్రాయాలను ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.
అంతేకాదు, కొరోనా వ్యాధిని నివారించడానికి, లేదా తగ్గించడానికి, ఇప్పటివరకు ఎటువంటి మందులు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారు కూడా తమ వెబ్ సైట్ లో పెట్టారు. అదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్వీట్ చేయగా, ఆ ట్వీట్ ని కేంద్ర ఆరోగ్య శాఖ (భరత్) వారు రీ-ట్వీట్ కూడా చేసారు. కావున, ‘ఆర్సేనిక్ ఆల్బం 30’ అనే హోమియోపతీ మందు కొరోనా వైరస్ ని నివారిస్తుంది అనడానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఫ్లూ లాంటి ఏ వ్యాధి వచ్చినా, ‘ఆర్సేనిక్ ఆల్బం 30’ మందుని ప్రభుత్వం సూచిస్తూ వచ్చింది.
చివరగా, ‘ఆర్సేనిక్ ఆల్బం 30’ ద్వారా కొరోనా వైరస్ ని నివారించవొచ్చని ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?