Fake News, Telugu
 

6000 సంవత్సరాల పురాతన శివలింగాన్ని దక్షిణాఫ్రికాలోని సుద్వాలా గుహలలో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొనలేదు

0

దక్షిణాఫ్రికాలోని సుద్వారా అనే గుహలో పురావస్తు శాస్త్రవేత్తలు 6000 ఏళ్లనాటి శివలింగాన్ని కనుగొన్నారని సోషల్ మీడియాలో ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది. దీని వెనుక ఉన్న నిజానిజాలను ఈ ఆర్టికల్ ద్వారా వెరిఫై చేద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్చైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: దక్షిణాఫ్రికాలోని సుద్వారా గుహలో 6000 సంవత్సరాల పురాతన శివలింగాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఫ్యాక్ట్(నిజం): దక్షిణాఫ్రికాలోని సుద్వాలా గుహలలో పురావస్తు శాస్త్రవేత్తలు ఎటువంటి శివలింగాన్ని కనుగొనలేదు. ఈ క్లెయిమ్‌లో ఎటువంటి నిజం లేదని, సుద్వాలా గుహల అధికారులు స్పష్టం చేశారు. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

సుద్వారా గుహలో ఇటువంటి శివలింగాన్ని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారా అని తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, దక్షిణాఫ్రికాలో ‘సుద్వారా’ కాదు ‘సుద్వాలా’ అనే గుహలు ఉన్నాయని తేలింది( ఇక్కడ మరియు ఇక్కడ). సుద్వాలా గుహల యొక్క చిత్రాలు ‘గెట్టి ఇమేజెస్’ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు. అంతేకాక, అసలు సుద్వాలా గుహలలో పురావస్తు శాస్త్రవేత్తలు 6000 సంవత్సరాల పురాతన శివలింగాన్ని కనుగొన్నట్లు ఇంటర్నెట్‌లో ఇటివంటి విశ్వసనీయమైన వార్తా కథనాలు లేవు.

అలాగే, పోస్ట్ చేసిన వీడియోలో కనిపిస్తున్న రెండు శివలింగాల గురించి వివరాల కోసం ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికాము. ఐతే ఈ రెండిటినీ సౌత్ ఆఫ్రికాకు ముడిపెట్టెట్లు ఉన్న ఎటువంటి సమాచారం మాకు దొరకలేదు. మొదటి లింగం మహారాష్ట్రలోని సతారాలో ఉన్న పాటేశ్వర్ ఆలయంలోని శివలింగాన్ని పోలి ఉంది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ (ఆర్కైవ్ లింక్)). 

అలాగే, రెండో లింగాన్ని పోలిన ఫోటో ఒకటి మాకు ‘iStockPhoto’ అనే స్టాక్ ఫోటోస్ ఉండే వెబ్సైటులో దొరికింది (ఆర్కైవ్ లింక్). ఈ ఫోటో యొక్క వివరణ ప్రకారం, భారతదేశంలో  ఒక గుహలో ఉన్న శివలింగం ఇది. 

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న అసలు విషయాలను తెలుసుకోవడానికి మేము సుద్వాలా గుహల అధికారులను సంప్రదించగా, ఆ గుహల్లో ఎటువంటి శివుని విగ్రహాన్ని/ లింగాన్ని వారు కనుగొనలేదు అని, వైరల్ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు అని స్పష్టం చేశారు.

అదనంగా, ఈ సుద్వాలా గుహలకు సుమారు 35-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్‌ప్రూట్ నేచర్ రిజర్వ్‌లో ఒక రాక్ నిర్మాణాన్ని కొందరు శివలింగంగా పరిగణిస్తారు. దీన్ని 1800 సంవత్సరాల క్రితం ఆఫ్రికాకు వెళ్లిన భారతీయ ప్రయాణికులు పూజించారని ఒక నమ్మకం. ఈ రాక్ నిర్మాణం గురించి మరింత సమాచారం కోసం మీరు ఇక్కడ(ఆర్కైవ్ లింక్) చూడవచ్చు. కానీ, ఇది పోస్ట్‌లో పేర్కొన్న 6000 ఏళ్లనాటి శివలింగం కాదు.

చివరిగా, దక్షిణాఫ్రికాలోని సుద్వాలా గుహలలో పురావస్తు శాస్త్రవేత్తలు 6000 సంవత్సరాల పురాతన శివలింగాన్ని కనుగొన్నారు అని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll