Fake News, Telugu
 

2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిస్తే అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నిలిపివేస్తామని కాంగ్రెస్ లేదా సమాజ్ వాది పార్టీ ప్రకటించలేదు

0

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నిలిపివేస్తామని సమాజ్ వాది- కాంగ్రెస్ పార్టీల కూటమి ప్రకటించినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. 2022 లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నిలిపివేస్తామని సమాజ్ వాది- కాంగ్రెస్ పార్టీల కూటమి ప్రకటించింది.

ఫాక్ట్ (నిజం): అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నిలిపివేస్తామని సమాజ్ వాది పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని ఎక్కడ ప్రకటించలేదు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తో కూటమి ఉండబోదని SP అధినేత అఖిలేష్ యాదవ్ ఇటీవల ప్రకటించారు. అయోధ్య రామ మందిర భూమి సేకరణలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అక్రమాలకు పాల్పడినట్టు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. కాని, తాము అధికారంలోకి వస్తే అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నిలిపివేస్తామని అఖిలేష్ యాదవ్ పేర్కొనలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతికితే, 2022లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్-సమాజ్ వాది పార్టీలు కూటమిగా పోటిచేయడం లేదని తెలిసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తాము కాంగ్రెస్ మరియు బహుజన్ సమాజ్ వాది (BSP) లాంటి పెద్ద పార్టీలతో కలిసి పోటిచేయబోమని సమాజ్ వాది (SP) పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇటీవల ప్రకటించారు. RLD లాంటి చిన్న చిన్న పార్టీలతో కలిసి 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటి చేయనున్నట్టు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేసారు. 

అయోధ్య రామ మందిర భూమి సేకరణలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు అఖిలేష్ యాదవ్ ఇటీవల India Today ఇంటర్వ్యూ లో ఆరోపించారు. ఆరోపణ ఎదుర్కొంటున్న ట్రస్ట్ సభ్యులపై వెంటనే చర్యలు చేపట్టాలని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కాని, తాము అధికారంలోకి వస్తే అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నిలిపివేస్తామని అఖిలేష్ యాదవ్ పేర్కొనలేదు.

అయోధ్య రామ మందిర భూమి సేకరణ విషయంలో ట్రస్ట్ సభ్యులు చేస్తున్న అక్రమాల గురించి సుప్రీం కోర్టు న్యాయ విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేసారు.  దీని కోసం అయోధ్య రామ మందిర నిర్మాణ పనులని ఆపాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

చివరగా, 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిస్తే అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నిలిపెస్తామని కాంగ్రెస్ లేదా సమాజ్ వాది పార్టీ ప్రకటించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll