మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఒక్క బాంబు పేలుడు కూడా జరగలేదని అర్ధం వచ్చేలా క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఒక్క బాంబ్ బ్లాస్ట్ కూడా జరగలేదు.
ఫాక్ట్ (నిజం): మోదీ ప్రధానమంత్రి అయ్యాక కూడా దేశంలో పలు సందర్భాలలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఉదాహారణకి 2019లో జరిగిన పుల్వామా దాడి, 2016లో జరిగిన ఊరి దాడి, ఇంకా జమ్మూ కాశ్మీర్, బెంగాల్, బెంగుళూరు మొదలైన ప్రాంతాలలో కూడా బాంబు దాడులు జరిగినట్టు ప్రభుత్వం లోక్ సభలో జవాబు రూపంలో చెప్పింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
2014లో మోదీ మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పటి నుండి ఇప్పటి వరకు దేశంలో బాంబు పేలుళ్లు, టెర్రరిస్ట్ దాడులు జరిగాయి. ఉదాహారణకి, కొన్ని బాంబ్ పేలుళ్ల సంఘటనలు కింద చూద్దాం.
- 14 ఫిబ్రవరి 2019న జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలు ప్రయాణిస్తున్న వ్యాన్ ని ఉగ్రవాదులు బాంబులతో పేల్చేశారు. ఈ దాడిలో 42 మందికి పైగా జవాన్లు చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని జైషే మహమ్మద్ ప్రకటించుకుంది.
- 18 సెప్టెంబర్ 2016న కాశ్మీర్ లోని ఊరి ప్రాంతంలో ఆర్మీ బేస్ పై ఉగ్రవాదులు చేసిన దాడిలో 17 మంది ఆర్మీ జవాన్లు చనిపోయారు.
- 26 జనవరి 2020న అస్సాం రాష్ట్రంలోని డిబ్రూగర్, చరైదేవ్, దులియాజాన్ ప్రాంతాల్లో బాంబ్ పేలుళ్లు జరిగాయి. ఐతే ఈ పేలుళ్ళలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. 2019 అస్సాంలోని గౌహతిలో ULFA (యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్) జరిపిన గ్రెనేడ్ దాడిలో ఆరుగురు గాయపడ్డారు.
- 2019లో జమ్మూ కాశ్మీర్ లోని హరి సింగ్ హై స్ట్రీట్ మార్కెట్ లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేయడం వల్ల పోలీస్ వారితో సహా పలువురు ప్రజలు కూడా గాయపడ్డారు.
- ఇటీవల జనవరి 2021లో ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీ దగ్గర ఒక చిన్న బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఐతే ఈ పేలుడులో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
- నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) ఆధ్వర్యంలోని నేషనల్ బాంబ్ డేటా సెంటర్ (NBDC) ప్రకారం ప్రమాదవశాత్తు జరిగిన వాటితో కలుపుకొని 2016 లో దేశంలో మొత్తం 406 పేలుడు సంఘటనలు చోటుచేసుకున్నాయని, ఈ పేలుళ్ళలో మొత్తం 479 మంది చనిపోయారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పార్లమెంట్ లో ఇచ్చిన ఒక సమాధానం చెప్తుంది. అదే విధంగా 2015లో మొత్తం 268 పేలుళ్లు జరిగినట్టు ఈ కథనం ద్వారా తెలుస్తుంది.
- ఇవే కాకుండా పలు రాష్ట్రాలలో నక్సల్స్ బాంబు దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. మార్చ్ 2021లో ఛత్తీస్‌గఢ్ లో నక్సల్స్ పోలీసులు వెళ్తున్న బస్సుని బాంబుతో పెల్చేయడం వల్ల ఐదుగురు పోలీసులు చనిపోయారు.
- ‘South Asia Terrorism Portal’ భారత్ జరిగిన బాంబు దాడులకు సంబంధించి విడుదల చేసిన డేటా ప్రకారం 2015 నుండి ఇప్పటి వరకు మొత్తం 309 బాంబు పేలుడు సంఘటనలు చోటుచేసుకున్నాయి. వీటన్నిటి బట్టి మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఒక్క బాంబు పేలుడు జరగలేదన్నది అవాస్తవం అని అర్ధంచేసుకోవచ్చు.
మోదీ ప్రధానమంత్రి అయ్యాక భారత్ లో జరిగిన ఉగ్ర దాడులకు సంబంధించి FACTLY ఇంతకు ముందు రాసిన కథనం ఇక్కడ చూడొచ్చు.
చివరగా, మోదీ ప్రధానమంత్రి అయ్యాక కూడా దేశంలో పలు సందర్భాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి.