Fake News, Telugu
 

తెలంగాణ వంటకాలు తనకు నచ్చవని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అనలేదు

0

తెలంగాణ వంటకాలు నాకు నచ్చావు, రుచి పచ్చి ఉండవు, కారం ఘాటు ఎక్కువ”, అని ఇటీవల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణ వంటకాలు తనకు నచ్చవని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఫాక్ట్ (నిజం): భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లో ‘కర్లీ టేల్స్’ ఫుడ్ అండ్ ట్రావెల్ చానెల్ ప్రతినిధి కామియా జానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ, తనకు తెలంగాణలోని వంటకాలు కాస్త ఘాటుగా అనిపించాయని, అంత కారం తాను తినలేనని చెప్పారు. కానీ, తెలంగాణ వంటకాలు తనకు  నచ్చవని రాహుల్ గాంధీ ఈ ఇంటర్వ్యూలో గానీ, మరెక్కడ కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించి ఇంటర్నెట్లో వెతికితే, తెలంగాణ వంటకాలకు సంబంధించి ఇటీవల రాహుల్ గాంధీ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలను రిపోర్ట్ చేస్తూ ‘సమయం’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లో ‘కర్లీ టేల్స్’ ఫుడ్ అండ్ ట్రావెల్ యూట్యూబ్ చానెల్ ప్రతినిధి కామియా జానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రాహుల్ గాంధీ, తనకు  తెలంగాణలోని వంటకాలు కాస్త ఘాటుగా అనిపించాయని, అంత కారం తాను తినలేనని అన్నట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు.

ఈ ఇంటర్వ్యూ వీడియోని రాహుల్ గాంధీ మరియు ‘కర్లీ టేల్స్’ తమ యూట్యూబ్ ఛానెల్స్‌లో పబ్లిష్ చేశారు. ఈ ఇంటర్వ్యూ వీడియోలోని 4:45 నిమిషాల దగ్గర, రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్రలో భాగంగా దేశంలోని అనేక రాష్ట్రాలలో విభిన్నమైన సంప్రదాయాలను, వంటకాల రుచులను చూసానని చెబుతూ, “తెలంగాణలో వంటకాలు నాకు కాస్త ఘాటుగా అనిపించాయి. అక్కడ కారం కాస్త ఎక్కువగా తింటారు. నాకు అక్కడ కొద్దిగా ఇబ్బంది కలిగింది. అంత కారం నేను తినలేను”, అని తెలిపారు. తనకు బటానీ మరియు పనసపండు అంటే అసలు నచ్చదని రాహుల్ గాంధీ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ, తెలంగాణ వంటకాలు రుచి పచ్చి ఉండవని, తనకు తెలంగాణ వంటకాలు నచ్చవని రాహుల్ గాంధీ ఈ ఇంటర్వ్యూలో గానీ, మరెక్కడ కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు.  

చివరగా, తెలంగాణ వంటకాలు తనకు నచ్చవని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పలేదు. 

Share.

About Author

Comments are closed.

scroll